ఎంపీ శశి థరూర్‌‌‌‌పై దేశద్రోహం కేసు

ఎంపీ శశి థరూర్‌‌‌‌పై దేశద్రోహం కేసు

న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే రోజు ఢిల్లీలో రైతులు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ర్యాలీ టైమ్‌‌లో రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌పై నోయిడాలో ఎఫ్ఐఆర్ నమోదైంది. రిపబ్లికే డే నాడు జరిగిన హింసకు సోషల్ మీడియాలో థరూర్ చేసిన బాధ్యతాయుత ట్వీట్స్ కారణమంటూ ఆయనతోపాటు మరో ఆరుగురిపై కేసు రిజిస్టర్ అయ్యింది. ఆ ఆరుగురు కూడా సోషల్ మీడియాలో అభ్యంతరకర ట్వీట్స్ చేశారని సమాచారం. వీరందరి మీద ఐపీసీ సెక్షన్లు 124ఏ (దేశద్రోహం), 295ఏ (మత నమ్మకాలను రెచ్చగొట్టడం), 504 (హింసకు ప్రేరేపించడం)తోపాటు 506, 34, 120బీ సెక్షన్ల కింద కేసు నమోదైంది.

రిపబ్లిక్ డే నాడు ఢిల్లీ బార్డర్‌‌లో రైతులు బారికేడ్లను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. అన్నదాతలను నియంత్రించడానికి పోలీసులు లాఠీచార్జ్ చేయడంతోపాటు టియర్ గ్యాస్‌ను కూడా ప్రయోగించారు. ఈ ఘటనలో ఓ ట్రాక్టర్ బోల్తా పడి ఒక రైతు చనిపోయాడు. అనంతరం రైతులు ఎర్రకోట దిశగా దూసుకెళ్లారు. ఎర్రకోటలోని అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం చేసిన నిరసనకారులు.. కోటపై ఖలిస్థాన్ జెండాను ఎగురవేశారు. అది ఖలిస్థాన్ జెండా కాదని గురుద్వారాలో ఎగురవేసే జెండా అని రైతు సంఘాలు పేర్కొన్నా అది వివాదాస్పదమైంది. ఈ ఘటనపై శశి థరూర్ ఆగ్రహాం వ్యక్తం చేశారు. తాను మొదట్నుంచి రైతుల ఉద్యమానికి మద్దతు తెలుపుతూ వచ్చానని, కానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించనని ట్వీట్ చేశారు. సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్నారు.