జనగామ: దారి తప్పిన ‘దిక్సూచి’...అవసరానికి మించి బుక్స్ ప్రింటింగ్కు ఆర్డర్స్

జనగామ: దారి తప్పిన ‘దిక్సూచి’...అవసరానికి మించి  బుక్స్ ప్రింటింగ్కు ఆర్డర్స్

జనగామ, వెలుగు: విద్యాశాఖలో 'దిక్సూచి' పేరుతో రూ.లక్షలు దారి మల్లించిన ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళ్తే.. టెన్త్ క్లాస్​ స్టూడెంట్స్​ను ఎగ్జామ్స్​కు ప్రిపేర్​ చేసి ఉత్తీర్ణత శాతం పెంచేందుకు గతేడాది జనగామ జిల్లా వ్యాప్తంగా 'దిక్చూచి' ప్రోగ్రామ్​ చేపట్టారు. జిల్లాలోని గవర్నమెంట్ స్కూల్స్ స్టూడెంట్స్​కు 'దిక్సూచి' పేరుతో స్టడీ మెటేరియల్స్ ప్రింట్ చేయాలని నిర్ణయం తీసుకోగా, విద్యాశాఖ అనుమతులు ఇవ్వలేదు. కొనుగోలు కమిటీని కూడా సంప్రదించలేదు. అయినా అప్పటి ఏవో సీహెచ్ శ్రీకాంత్ హనుమకొండకు చెందిన రుత్విక్ గ్రాఫిక్స్ యజమాని విజయ్​తో బుక్స్​ ప్రింటింగ్​పై ఒప్పందం చేసుకున్నాడు. 

జిల్లాలోని గవర్నమెంట్ స్కూల్స్​లో 2025–-26 ఎడ్యుకేషన్ ఇయర్​లో 4635 టెన్త్ స్టూడెంట్స్ ఉండగా, మూడు రెట్లు ఎక్కువగా 15 వేల బుక్స్ ప్రింటింగ్ చేయాలని ఏవో శ్రీకాంత్ ఆర్డర్ ఇచ్చాడు. దీనికోసం రూ.48.50 లక్షలు డ్రా కూడా చేశాడు. ఐదు నెలలు గడిచినా ఇప్పటి వరకూ దిక్యూచి బుక్స్ రాలేదు. దీనిపై అప్పటి విద్యాశాఖ ఏడీ సత్యమూర్తి నివేదిక ఇచ్చినా విషయం బయటకు పొక్కలేదు. ఏవో శ్రీకాంత్ దిక్సూచి బుక్స్ ఆర్డర్స్​కు సంబంధించిన డిటైల్స్​ను తొలగించేశాడు. ప్రస్తుతం డీఈవో పోస్ట్​ ఖాళీగా ఉండడంతో కలెక్టర్​ సందీప్​కుమార్ ఝా అదనపు బాధ్యతలు చేపట్టాడు. 

ఈ క్రమంలోనే దిక్యూచి బుక్స్​కు సంబంధించిన వ్యవహారం ఆయన దృష్టికి వచ్చింది. గత ఏడీ సత్యమూర్తి ఇచ్చిన నివేదిక బహిర్గతమైంది. కలెక్టర్​ ఆదేశాల మేరకు ఆడిట్​ చేసిన ఆఫీసర్లు అవసరానికి మించి బుక్స్​కు ఆర్డర్స్​ ఇచ్చారని, ఇందుకు విద్యాశాఖ నుంచి అనుమతులు కూడా లేవని గుర్తించారు. రూ.48.50 లక్షలు దుర్వినియోగం అయ్యాయని రిపోర్ట్​ ఇచ్చారు. ఈ రిపోర్ట్​ ఆధారంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్​ ఆదేశించారు. దీంతో గత ఏవో సీహెచ్​ శ్రీకాంత్​, హనుమకొండకు చెందిన రుత్విక్ గ్రాఫిక్స్​ యజమాని విజయ్​పై చర్యలు తీసుకోవాలని ప్రస్తుత ఏవో రవికిరణ్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు వారిద్దరిపై పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.