పారిస్ చర్చిలో భారీ అగ్ని ప్రమాదం

పారిస్ చర్చిలో భారీ అగ్ని ప్రమాదం

ఫ్రాన్స్ రాజధాని పారిస్  లోని పురాతన చర్చిలో అగ్ని ప్రమాదం జరిగింది.850 ఏళ్ల పురాతనమైన నోట్రే డామే కేథడ్రల్  చర్చిలో సోమవారం మంటలు అంటుకున్నాయి. దాదాపు 400 మంది అగ్నిమాపక సిబ్బంది కొన్ని గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదం ఎలా జరిగిందన్న విషయంపై విచారణ చేస్తున్నారు అధికారులు. ఈ ఘటనలో అంతా సురక్షితంగా బయటపడ్డారు.

12వ శతాబ్దానికి చెందిన నోట్రే డామే కేథడ్రల్  చర్చిలో ఆధునీకరణ పనులు జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున అగ్నికీలలు ఎగిసిపడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేసింది.  దీంతో సమీప ప్రాంతాల  ప్రజలను అక్కడనుంచి దూరంగా తరలించారు. 93 మీటర్ల శిఖరం కూలిపోయింది. అయితే చాలా అమూల్య కళాఖండాలు,  చారిత్రక చిహ్నాలను మాత్రం భద్రపరిచారు.

ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యూల్ మాక్రోన్ తో పాటు, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు డోనాల్డ్ టస్క్ ,  జర్మన్ ఛాన్స్ లర్ ఏంజెలా మెర్కెల్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్  తదితర  ప్రపంచ నేతలు ఈ ఘటనపై విచారం తెలిపారు. లేడీ ఆఫ్  ప్యారిస్  మంటల్లో చిక్కుకుందంటూ ఇమ్యాన్యుల్  భావోద్వేగంతో ట్వీట్ చేశారు. పూర్తిగా కలపతో నిర్మించిన  ఈ అద్భుత కట్టడానికి యూరప్ లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా పేరుంది. పెద్ద సంఖ్యలో జనం ఈ చర్చ్ కు వస్తుంటారు. 1991లో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చోటు దక్కించుకుంది. పురాతన చర్చిని పునరుద్దరించేందుకు ఫ్రాన్స్ చేపట్టే  చర్యలకు సహాయం అందిస్తామని యునెస్కో తెలిపింది.