హైదరాబాద్ లో రెండు వేర్వేరు చోట్ల అగ్ని ప్రమాదాలు 

హైదరాబాద్ లో రెండు వేర్వేరు చోట్ల అగ్ని ప్రమాదాలు 

హైదరాబాద్ : హైదరాబాద్ పరిధిలో రెండు వేర్వేరు చోట్ల అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కళ్యాణ్ నగర్ లో అగ్ని ప్రమాదం జరిగింది. దీపావళి పండుగ సందర్భంగా కొందరు బాణాసంచా రాకెట్లు పేల్చడంతో..అవి గాల్లోకి ఎగిరి నోబుల్ అపార్ట్ మెంట్ పై ఉన్న సెల్ టవర్ ను నిప్పురవ్వలు తాకాయి. దీంతో వెంటనే షార్ట్ సర్క్యూట్ జరిగి.. అగ్నిప్రమాదం జరిగింది. విషయం తెలియగానే సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్ల ద్వారా మంటలను ఆర్పివేశారు. ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులందరూ ఊపిరి పీల్చుకున్నారు. సుమారు రూ.3 లక్షల వరకూ ఆస్తి నష్టం జరిగినట్లు సనత్ నగర్ ఫైర్ ఆఫీసర్ ప్రదీప్ కుమార్ చెప్పారు. 

టింబర్ దుకాణంలో మంటలు

ఇటు.. ముషీరాబాద్ లోని ఎస్ ఎం ఫ్లైవుడ్ టింబర్ దుకాణంలో తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. విషయం తెలిసిన వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదం ఎలా సంభవించింది అనే దానిపై చిక్కడపల్లి, ముషీరాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అగ్నిప్రమాదం బాణాసంచా పేలుళ్ల కారణంగా జరిగిందా..? లేక దుకాణంలో దీపావళి సందర్భంగా వెలిగించిన దీపాల వల్ల జరిగిందా..? అనే కోణాల్లోనూ విచారణ చేస్తున్నారు.