మొక్కజొన్న బుగ్గిపాలు..అయ్యో దేవుడా..! పంటంతా కాలిపోతుంది

మొక్కజొన్న బుగ్గిపాలు..అయ్యో దేవుడా..! పంటంతా కాలిపోతుంది

నిన్నటి దాకా వరుణుడు అన్నదాతలను ఆగం చేస్తే..ఇవాళ అగ్నిదేవుడు పంటను బుగ్గి పాలు చేసిండు. చేతికొచ్చిన పంట కళ్ల ముందే కాలి బూడిదైపోతుంటే రైతు గుండెలవిసేలా రోధిస్తున్న తీరు ప్రతీ ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. రాత్రనకా..పగలనకా కష్టపడి కన్నబిడ్డ వలే సాదుకున్న పంట చేతికొచ్చే సమయానికి అగ్నికి ఆహుతవుంటే ఏం చేయలేని నిస్సహాయస్థితిలో దిక్కుతోచక  రైతన్న కూలబడిపోయాడు.   ములుగు జిల్లా పందికుంట గ్రామంలోని మొక్కజొన్న చేనులో జరిగిన అగ్నిప్రమాదంలో పంట పూర్తిగా కాలిపోయింది.

అయ్యో..! పంటంతా కాలిపోతుంది దేవుడా...

ములుగు జిల్లా పందికుంట గ్రామంలోని రైతు గుర్రం సతీష్ కు చెందిన 4 ఎకరాల మొక్క జొన్న చేనులో  అగ్నిప్రమాదం జరిగింది. పొలంలో నుంచి  విద్యుత్ లైన్ ఉంది. అయితే  షార్ట్ సర్క్యూట్  కారణంగా వైర్లు అంటుకుని నిప్పు రవ్వలు మొక్కజొన్న పంటపై పడ్డాయి. దీంతో పంటంతా కాలిబూడిదైపోయింది. మంటలు అంటుకుని పంట కాలిపోతుంటే..అయ్యయ్యో దేవుడా పంటంతా బూడిద అవుతుందంటూ రైతు కన్నీరుమున్నీరుగా విలపించాడు. అగ్ని ప్రమాదంలో మొక్కజొన్న కంకులు బూడిదైపోయాయి. ఈ అగ్నిప్రమాదం కారణంగా రూ. 5 లక్షల వరకు నష్టం వాటిల్లింది. 

అగ్నిప్రమాదంతో నష్టపోయిన రైతు గుర్రం సతీష్ ను కాంగ్రెస్ ములుగు జిల్లా  కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్ తో పాటు..ఇతర నాయకులు, రైతులు పరామర్శించారు. రైతుకు ధైర్యం చెప్పారు. నష్టపోయిన రైతు సతీష్ ను ఆదుకోవాలని కోరారు.