సరిస్కా టైగర్ రిజర్వ్లో కార్చిచ్చు  

సరిస్కా టైగర్ రిజర్వ్లో కార్చిచ్చు  

జైపూర్ : రాజస్థాన్లోని అల్వార్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సరిస్కా టైగర్ రిజర్వ్లో కార్చిచ్చు రాజుకుంది. నిమిషాల వ్యవధిలోనే మంటలు కిలోమీటర్ల మేర వ్యాపించాయి. విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమైన టైగర్ రిజర్వ్ అధికారులు మంటలు అదుపు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. గంటలు గడిచినా మంటలు అదుపులోకి రాకపోవడంతో రిజర్వ్ అధికారులు ఆర్మీ సాయం కోరారు. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన సైన్యం రెండు హెలికాప్టర్లతో నీళ్లు గుమ్మరిస్తూ మంటలు అదుపుచేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాద స్థలానికి 43కిలోమీటర్ల దూరంలోని సరస్సు నుంచి హెలికాప్టర్ల ద్వారా నీటిని తీసుకువస్తున్నారు. వేడి గాలులు వీస్తుండటంతో మంటలు అదుపుచేయడం కష్టంగా మారింది. 

సరిస్కా టైగర్ రిజర్వ్ లో దాదాపు 20 వరకు పులులు ఉన్నాయి. ST-17 కోడ్ నేమ్ కలిగిన పులి ఈ మధ్యనే రెండు కూనలకు జన్మనిచ్చింది. అవి సంచరిస్తున్న ప్రాంతంలోనే మంటలు చెలరేగడంతో అధికారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మంటలు అదుపులోకి రాకపోవడంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యగా సరిహద్దు గ్రామ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.