కాష్టానికి కట్టెలు దొరుకుడు కష్టమైతుంది

కాష్టానికి కట్టెలు దొరుకుడు కష్టమైతుంది
  • అంతరిస్తున్న చిట్టడవులు, గుట్టలు
  • వెంచర్లుగా మారుతున్న బంజరు భూములు
  • గట్ల మీద మాయం అవుతున్న చెట్లు
  • సా మిల్లుల్లో క్వింటాల్​ కట్టెలు రూ.800
  • ఒక్కో దహనానికి రూ.10 వేలకు పైగా ఖర్చు

నెట్​వర్క్​, వెలుగు : రాష్ట్రంలో కాష్టానికి కట్టెలు దొరుకుడు కష్టమైతున్నది. కొన్నేండ్లుగా చిట్టడవులు కూడా వెంచర్లుగా, ఫామ్​ల్యాండ్స్​గా మారుతుండటం..  క్వారీల కారణంగా గుట్టలు కనుమరుగవడం.. వ్యవసాయ భూములు ప్లాట్లుగా మారుతుండడంతో గట్ల మీద కూడా పెద్దగా చెట్లు కనిపించడం లేదు. దీంతో గ్రామాలు, పట్టణాల్లో ఎవరైనా చనిపోతే దహనసంస్కారాలకు కట్టెలు కరువైతున్నాయి.  తప్పనిసరి పరిస్థితుల్లో సా మిల్లుల్లో కొంటే క్వింటాల్​కు రూ. 700 నుంచి 800 దాకా వసూలు చేస్తున్నారు. దీంతో ఒక శవం దహన సంస్కారాలకు కట్టెలు కావాలంటే ట్రాక్టర్​ కిరాయితో కలిపి ఎంతలేదన్నా రూ. 10 వేల దాకా ఖర్చు అవుతున్నది. ఇది సామాన్యులకు తలకుమించిన భారమవుతున్నది. 

బంజరు భూములు మాయమాయె

తెలంగాణలో ఒకప్పుడు ఏ ఊరు వెళ్లినా వాగులు, చెరువులు, పొలాల గట్లు అనే తేడా లేకుండా ఎటుచూసినా మోదుగ, కానుగ, తుమ్మ, సర్కారు తుమ్మ, వేప, నర్రెంగ, చింత చెట్ల తో గ్రామాలు కళకళలాడేవి. ఎవరైనా చనిపోతే చెట్ల ఎండు కొమ్మలను నరికి వాగు ఒడ్డుకో, గుట్ట అంచుకో కాష్టం పేర్చి దహనసంస్కారాలు నిర్వహించేవారు. కానీపదేండ్లలో పరిస్థితి మారిపోయింది. భూముల రేట్లు పెరగడంతో ఆక్రమణలు  ఎక్కువై చెరువు శిఖాలు, సర్కారు భూముల అమ్మకం వల్ల చిట్టడవులు మాయమయ్యాయి. క్వారీలు వచ్చి గుట్టలు ధ్వంసమయ్యాయి. గడిచిన ఐదేండ్లలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 శాతం భూములు వెంచర్లుగా మారాయి. ఫలితంగా చెట్లు తగ్గిపోయాయి. కట్టెలకు కొరత ఏర్పడింది. ప్రభుత్వం వైకుంఠ ధామాలైతే కట్టింది గానీ అందులో దహన సంస్కారాలు చేసేందుకు కట్టెలు తేవడం కష్టమవుతున్నది. అటవీ సమీప గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి. మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి, జన్నారం మండలాలు పూర్తిగా అటవీ ప్రాంతాలు. కానీ ఈ ఏరియాను కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్​గా సర్కారు ప్రకటించడంతో అడవిలోకి ఎవరినీ అనుమతించడం లేదు.  దీంతో ఇక్కడి ప్రజలు ఇతర ప్రాంతాల్లోని సామిల్లుల నుంచి దాదాపు రూ.10 వేల దాకా ఖర్చు చేసి దహన సంస్కారాలకు కట్టెలు తెచ్చుకుంటున్నారు. ఆదిలాబాద్​, కుమ్రంభీం ఆసిఫాబాద్, నాగర్​కర్నూల్​, భద్రాద్రి కొత్తగూడెం  లాంటి అటవీ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. అక్కడి కొన్ని గ్రామాల్లో అడవికి చాటుమాటుగా వెళ్లి ఎడ్ల బండ్లలో కాష్టానికి కట్టెలు తెచ్చుకుంటున్నా, ఆఫీసర్లకు దొరికితే పెద్దమొత్తంలో ఫైన్లు పడుతున్నాయి. 

క్వింటాల్​ కట్టెలకు రూ.800 దాకా..

సామిల్లుల్లో పర్మిటెడ్​ టేకు కోయగా మిగిలే కట్టెను బయట అమ్ముకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి కట్టెను ఎక్కువగా కాష్టం పేర్చేందుకే వాడుతుంటారు. కానీ కొన్నేండ్లుగా కాష్టం కట్టెలకు డిమాండ్​ ఏర్పడడంతో సామిల్లుల యజమానులు ఎక్కడికక్కడ రేట్లు పెంచుతున్నారు. గతంలో క్వింటాల్​ కట్టెల రేటు రూ. 150 నుంచి  200 వరకు ఉండగా, ఇప్పుడు రూ. 700 నుంచి 800 దాకా  తీసుకుంటున్నారు. ఒక కాష్టానికి కనీసం 8 నుంచి 10 క్వింటాళ్ల కట్టెలు అవసరమవుతాయి. అంటే కట్టెలకే  సుమారు రూ.6 వేల నుంచి 8 వేల ఖర్చు పెట్టాల్సి వస్తున్నది. ఇక సామిల్లు నుంచి తెచ్చేందుకు ట్రాక్టర్​కు రూ. 2వేల దాకా కిరాయి తీసుకుంటున్నారు. అందుకే చాలా జిల్లాల్లో రూ.15 వేల నుంచి 20వేల దాకా ప్యాకేజీ తీసుకొని దహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 

కానరాని ఎలక్ట్రిక్​, ఎల్పీజీ క్రిమిటోరియాలు

కట్టెల కొరత వల్ల కనీసం మున్సిపాలిటీలు, మండల కేంద్రాల్లోనైనా ఎలక్ట్రిక్​, ఎల్పీజీ దహన వాటికలు ఏర్పాటుచేయాలనే డిమాండ్లు వస్తున్నాయి. కానీ ప్రభుత్వం ఈ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కరీంనగర్​, మంచిర్యాల, ఖమ్మం, భూపాలపల్లి లాంటి చోట్ల అక్కడి మున్సిపాలిటీలు చొరవ తీసుకొని ఎల్పీజీ క్రిమిటోరియాలు ఏర్పాటుచేశాయి. వీటి ద్వారా ఉచిత దహన సేవలు అందిస్తున్నప్పటికీ పెద్దగా ప్రచారం చేయకపోవడంతో నిరూపయోగంగా ఉంటున్నాయి. హైదరాబాద్​తో పాటు ఈ నాలుగు చోట్ల తప్ప మరెక్కడా ఎలక్ట్రిక్​, ఎల్పీజీ దహనవాటికలు లేవు.  వరంగల్ సిటీలో ఏర్పాటుచేస్తున్న మోడల్​శ్మశానవాటికలో ఎల్పీజీ దహనవాటిక ప్రపోజల్​ ఉన్నా ఇంకా పూర్తికాలేదు. ఎల్పీజీ క్రిమిటోరియంలో ఒక దహనానికి రూ. 2 వేలు మాత్రమే ఖర్చు అవుతుందని అధికారులు చెప్తున్నారు. కట్టెల ఖర్చుతో పోలిస్తే ఇది నాలుగోవంతే కావడం గమనార్హం.

కంచెలు పోయి కట్టెలకు కరువచ్చింది

ఒకప్పుడు మా ఊర్లో  800 ఎకరాల కంచె భూములు ఉండేవి. వాటి నిండా తుమ్మ , రేగు చెట్లు, పట్నం తుమ్మలు పెరిగేవి. ఎవరైనా చనిపోతే ఆ కట్టెలే వాడుకునేవాళ్లం. పైసా ఖర్చయ్యేది కాదు. ఇప్పుడు ఆ కంచెలు లెవ్వు. అందులో చెట్లు లెవ్వు. అక్కడక్కడ ఉన్న చెట్లను వ్యాపారులు కొట్టి సామిల్లులకు తరలిస్తున్నారు. అంతా వ్యాపారమైపోయింది. పదేండ్ల కింద రూ. 100,  రూ. 200 పెడ్తే  దహన సంస్కారాలు పూర్తయ్యేవి. ఇప్పుడు ఎవరైనా చనిపోతే వేలకు వేలు పెట్టి కట్టెలు కొనాల్సి వస్తున్నది. 
- గారంపల్లి ఉపేందర్, రైతు, ఇల్లందకుంట మండలం, కరీంనగర్ జిల్లా 

కట్టె కాలాలంటే ఇండ్లన్నీ తిరగాల్సిందే

గతంలో మనిషి చనిపోతే వెంటనే దగ్గర్లో ఉన్న అడవికి పోయి కట్టెలు తెచ్చి చితి పేర్చేవాళ్లం. ఇప్పుడు ఎవరైనా చనిపోతే ట్రాక్టర్ తీసుకొని ఇల్లిల్లూ తిరిగి పుల్లలు తీసుకొచ్చి కార్యక్రమం చేయాల్సి వస్తున్నది. అధికారులు అడవిలోకి పోనివ్వడం లేదు. కట్టెలు కొందామంటే వేలల్లో ఖర్చవుతున్నది. ప్రభుత్వం వైకుంఠ ధామాలు నిర్మించింది కానీ హిందూ ధర్మం ప్రకారం జరిగే దహన సంస్కారాలకు కనీసం కట్టెలు దొరకకపోతే ఎట్లా?  - నరసింహారావు, కల్లూరుగూడెం , ఖమ్మం జిల్లా

దహన సంస్కారాలకు ఇబ్బందిపడ్డం

నా భర్త వెంకటేశ్వర్లు(62) టైలరింగ్ పని చేసేవాడు. కుటుంబ పోషణకే కష్టంగా ఉండేది. కొద్ది రోజుల కింద కిడ్నీ, లివర్ సమస్యలతో చనిపోయాడు. దహన సంస్కారాలకు ఇబ్బందులుపడ్డాం. మా పట్టణంలో ఉన్న ఒక కట్టె కోత మిల్లు నుంచి కట్టెలు తేవడానికి వెళ్తే 5 వేలు అడిగారు. మా దగ్గర 2 వేలే ఉంటే, దాతలు 3 వేలు సాయం చేస్తే  కట్టెలు కొన్నాం. ఆటో కిరాయి, దహనానికి పెట్రోల్​కు దాతలే సాయం చేశారు. - రావిరాల పద్మ, మరిపెడ, మహబూబాబాద్​ జిల్లా