ఉద్యమాల గతిమార్చిన తొలితరం తురుపుముక్క

ఉద్యమాల గతిమార్చిన తొలితరం తురుపుముక్క

తెలంగాణ తొలితరం ఉద్యమకారిణి, తొలి దళిత మహిళా శాసన సభ్యురాలు తక్కెళ్ల నారాయణ సదాలక్ష్మి. అణగారిన కుటుంబంలో పుట్టిన ఆమె తుది శ్వాస వరకు పీడితుల గొంతుకై నిలిచారు. అన్యాయం, అవినీతిని సహించని ధీశాలిగా ఖ్యాతి పొందారు. అంబేద్కరిజాన్ని అమితంగా ఆరాధించిన ఆమె ఆయన స్ఫూర్తితో అణచివేతపై పోరాడారు. 1928 డిసెంబర్ 25న  హైదరాబాద్​లోని పెన్షన్ పురాలో కొండయ్య, గోపమ్మ దంపతులకు సదాలక్ష్మి జన్మించారు. బ్రిటీష్ అధికారులు నివసించే కంటోన్మెంట్ ప్రాంతంలో పెరగడం వల్ల ఆమెకు కొంత విద్య అందింది. చిన్నతనం నుంచే కుటుంబ ప్రోత్సాహంతో పాటు అరిగే రామస్వామి, ముదిగొండ లక్ష్మయ్య , పులి నరసింహులు లాంటి దళిత నాయకుల స్ఫూర్తితో ఆమె ముందుకు వెళ్లారు. అంబేద్కర్, జగ్జీవన్​రామ్​ల ప్రభావం ఆమెపై ఎక్కువగా ఉండేది. జీరా కాంపౌండ్ లో అంబేద్కర్ ఉపన్యాసం ప్రత్యక్షంగా విని తన ఆలోచనా విధానం మార్చుకున్నారు. మెడిసిన్ చదువును వదులుకొని ఉద్యమ భావజాలాన్ని, అన్యాయాన్ని ఎదిరించే గుణాన్ని అలవర్చుకున్నారు. 

తెలంగాణ ఉద్యమంలో..
1956లో  కాంగ్రెస్ పార్టీలో చేరిన సదాలక్ష్మి కేవీ రంగారెడ్డి నాయకత్వంలో విశాలాంధ్రకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. 1968లో విద్యార్థులు మొదలుపెట్టిన ఉద్యమానికి పెద్దదిక్కుగా నిలిచారు.1969 మార్చి 8, 9వ తేదీల్లో తెలంగాణ కన్వెన్షన్ నిర్వహించి ఉద్యమ గమనాన్ని మలుపుతిప్పారు. ఉద్యమాన్ని తెలంగాణ అంతటా విస్తరింపజేసి తెలంగాణ ప్రజా సమితి ఏర్పాటులో కీలక పాత్ర వహించారు. ఉద్యమ సమయంలో మర్రి చెన్నారెడ్డి జైలులో ఉన్నప్పుడు ప్రజా సమితి అధ్యక్షురాలిగా ఉద్యమాన్ని సమర్థంగా ముందుకు నడిపారు. 

రాజకీయ జీవితం..
నిజాం రాష్ట్రంలో 1940-- నుంచి1947 వరకు టీఎన్​సదాలక్ష్మి స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారు. అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడారు. పెద్దపల్లి, కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు.1960 -–1962 మధ్యలో ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు. 1974--1980 మధ్యలో విధాన పరిషత్ సభ్యురాలిగా 
కొనసాగారు. 1982లో తెలుగుదేశం పార్టీలో చేరి పార్టీ  వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టారు. 1953 నుంచి1996 వరకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. నీలం సంజీవరెడ్డి కేబినెట్ లో మొదటి మహిళా మంత్రిగా దేవాదాయశాఖ బాధ్యతలు చేపట్టి హిందూ పురోహితులుగా దళితులకు శిక్షణ ఏర్పాటు చేసి విప్లవాత్మక అడుగులు వేశారు. విమర్శలు వచ్చినా తగ్గకుండా సామాజిక అసమానతలు రూపుమాపేందుకు పోరాడారు.  యాదగిరిగుట్టలో అర్చక పాఠశాలను ఏర్పాటు చేసి, దేవస్థానం ట్రస్టుల్లో మహిళలకు స్థానం కల్పించారు. సాంఘిక సంక్షేమ మంత్రిగా ఎస్సీ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. డెమోక్రటిక్ కాంగ్రెస్ పార్టీ, జనతా పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీల ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు.

సామాజిక ఉద్యమాలు
రాజకీయాల్లో గాంధేయవాదిగా కొనసాగినప్పటికీ దళితురాలిగా, మహిళగా తను ఎదుర్కొన్న వివక్ష మూలంగా  అంబేద్కరిజం ప్రభావంతో సామాజిక ఉద్యమాల్లో పాల్గొనకుండా ఉండలేకపోయింది. అరుంధతీయ మాతాంగ మహాసభ, వాల్మీకి సభ, అరుంధతి సభ, బాబు జగ్జీవన్​రామ్ వెల్ఫేర్ సొసైటీ, బ్యాక్ వర్డ్ క్లాసెస్ ఫెడరేషన్ లాంటి సంఘాల్లో పని చేశారు. ఉద్యమమే జీవితంగా బతికిన సదాలక్ష్మి 2004 జులై 24 న మృతిచెందారు. తొలితరం తెలంగాణ ఉద్యమకారిణిగా, సామాజిక ఉద్యమాలకు, మహిళా సాధికారతకు ప్రతీకగా నిలిచారు. తెలంగాణ చారిత్రక ఉద్యమ వారసత్వాన్ని భావితరాలకు అందించే విధంగా ప్రజల నుంచి వస్తున్న డిమాండ్స్ ప్రభుత్వం గమనించాలి. వివిధ ప్రతిష్టాత్మక ప్రాంతాల్లో సదాలక్ష్మి విగ్రహాల ఏర్పాటు, రాష్ట్రంలోని మహిలా యూనివర్సిటీ సహా వివిధ సంస్థలకు ఆమె పేరు పెట్టాలి. భావితరాలకు ఆమె పోరాట జీవితాన్ని స్ఫూర్తిగా  అందించడమే మనం ఆమెకు ఇచ్చే ఘన నివాళి. - తాళ్ల అజయ్, రీసెర్చ్​ స్కాలర్, ఓయూ