
రెండు అణు రియాక్టర్ల అడ్మిరల్ లొమొనొసోవ్ రెడీ
రష్యా-ఆర్కిటిక్ సరిహద్దులో కరెంటు కోసం వాడకం
అడ్మిరల్ లొమొనొసోవ్. కదిలే న్యూక్లియర్ పవర్ ప్లాంట్! 472 అడుగుల పొడవైన ఈ నౌక తయారీకి, రష్యాకు ఇరవై ఏళ్లు పట్టింది. ఇంత శ్రమ రష్యా ఊరికే ఏమీ పడలేదు. ఆర్కిటిక్ లో ఉన్న ఖనిజ సంపదను సొంతం చేసుకోవడానికే ఇలా చేసింది. అర్థం కాలేదా? రష్యాకు అతి తూర్పు కొన వద్ద ఆర్కిటిక్ కు అతి చేరువగా, ఛుకొట్కా అనే ప్రాంతం ఉంది. అక్కడ హైడ్రోకార్బన్లు, విలువైన రాళ్ల సంపద ఉంది. ఇప్పటికే చాలా కంపెనీలు ఈ సంపదను బయటకు తీస్తున్నాయి. కానీ అనుకున్నంత మొత్తంలో తీయలేకపోతున్నాయి. కారణం అక్కడ కరెంటు లేదు. సరే రష్యా భూభాగం నుంచి కరెంటు సప్లై చేద్దామంటే అందుకు ఊహించనంత ఖర్చవుతుంది. పైగా వాతావరణం క్షణాల్లో మారిపోయే ప్రాంతం, ఎప్పుడు ఎక్కడ సమస్య వస్తుందో తెలీదు.
దీంతో నిరంతరం కరెంటు ఇచ్చే ఓ న్యూక్లియర్ పవర్ ప్లాంటును సిద్ధం చేయాలని రష్యా భావించింది. ఆ ఆలోచనకు ప్రతిరూపమే అడ్మిరల్ లొమొనొసోవ్. ప్రస్తుతం ఈ నౌక వాయవ్య రష్యాలోని ముర్మనస్క్ వద్ద ఉంది. దీన్ని ఛుకొట్కాలోని పెవెక్ కు అంటే ఈశాన్య రష్యాకు తీసుకెళ్లాలి. ముర్మనస్క్, పెవెక్ మధ్య దూరం 6,450 కిలోమీటర్లు. ఇందుకు ఉన్న ఒకే ఒక్క దారి ఆర్కిటిక్ సముద్రంలోని ‘ఉత్తర సముద్ర మార్గం’.
అడ్మిరల్ లొమొనొసోవ్ ప్రపంచంలో అతి ఉత్తరాన ఉన్న ఒకే ఒక్క న్యూక్లియర్ పవర్ ప్లాంట్. ఇందులో రెండు రియాక్టర్లు ఉన్నాయి. ఒక్కోటి 35 మెగావాట్ల కరెంటును అందిస్తాయి. దీని ఆపరేషన్ మొదలైతే ఆర్కిటిక్, రష్యా సరిహద్దు గ్రామాల్లో బతుకుతున్న 20 లక్షల మందికి ఆర్థిక పుష్టి కలుగుతుందని రష్యా భావిస్తోంది. వాస్తవానికి ఇక్కడి ప్రజలు రష్యా జీడీపీలో 20 శాతం ఆదాయాన్ని అందిస్తున్నారు. సైబీరియాలో ఆయిల్, గ్యాస్ నిల్వలు అడుగంటుతున్న నేపథ్యంలో ఆర్కిటిక్ లో కరెంటు సదుపాయం రావడం ఆ దేశానికి బాగా ఉపయోగపడనుంది.
రష్యాపై విమర్శలు
న్యూక్లియర్ పవర్ ప్లాంటును ఆర్కిటిక్ కు తరలించడాన్ని చాలా మంది ఎన్విరాన్ మెంటలిస్టులు వ్యతిరేకిస్తున్నారు. అడ్మిరల్ లొమొనొసోవ్ ను కదిలే ‘చెర్నోబిల్’ గా అభివర్ణిస్తున్నారు. దీన్ని రష్యా న్యూక్లియర్ ప్రాజెక్టుల ఇన్ చార్జ్ రోసాటోమ్ ఖండించారు. చెర్నోబిల్ కు లొమొనొసోవ్ కు అసలు పోలికే లేదని పేర్కొన్నారు.