కళ్లు చల్లబడ్డాయా ఐటీ కంపెనీలూ : ఆరు నెలల్లో 2 లక్షల 12 వేల మందిని పీకేశారు

కళ్లు చల్లబడ్డాయా ఐటీ కంపెనీలూ : ఆరు నెలల్లో 2 లక్షల 12 వేల మందిని పీకేశారు

ఐటీ రంగం.. అదేనండీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏ విధంగా ఉంది అంటే.. సింపుల్ గా ఇప్పుడు చెప్పబోయేది చదివినా.. విన్నా ఇట్టే తెలిసిపోతుంది. 2023, జూన్ నెల వరకు.. అంటే ఆరు నెలల్లో ప్రపంచ వ్యాప్తంగా అన్ని టెక్ కంపెనీలు కలిపి.. అక్షరాల రెండు లక్షల 12 వేల మంది ఉద్యోగులను పీకేశాయి. ఇందులో ఇండియా వాటా.. అదేనండీ మన భారతదేశంలో ఉద్యోగం కోల్పోయిన ఐటీ ఉద్యోగుల సంఖ్య 27 వేలు. ది జస్ట్ ఆరు నెలలు.. 180 రోజుల ట్రాక్ రికార్డ్ మాత్రమే.. ముందుంది ముసళ్ల పండుగ అన్నట్లు.. రాబోయే ఆరు నెలల్లో ఇంకెన్ని లక్షల మంది ఐటీ ఉద్యోగులు రోడ్డున పడతారు అనేది అందరినీ ఆందోళనకు గురి చేస్తుంది.

ఐటీ రంగంలోనే ఇది ఓ రికార్డుగా ఉంది. 2022 అంటే గత ఏడాది వెయ్యి 46 టెక్ కంపెనీలు అన్నీ కలిపి.. ఒక లక్షా 61 వేల మంది ఉద్యోగులను తొలగిస్తే.. 2023 ఆరు నెలల కాలంలోనే 891 టెక్ కంపెనీలు.. 2 లక్షల 12 వేల మందిని తొలగించటం అనేది.. ఐటీ రంగంలోని సంక్షోభాన్ని చెబుతోంది. ఏడాదిన్నర కాలంగా.. అంటే 2022 జనవరి నుంచి 2023 జూన్ నెలల వరకు.. 18 నెలల కాలంలో ఓ 4 లక్షల మంది ఉద్యోగులను ఆయా కంపెనీలు తొలగించినట్లు చెబుతున్నాయి లెక్కలు. 

ప్రపంచ వ్యాప్తంగా ఇలా ఉంటే.. ఒక్క మన దేశంలోనే 2023 జనవరి నుంచి జూన్ మధ్య.. ఆరు నెలల్లో 27 వేల మంది ఐటీ ఉద్యోగం కోల్పోయారు. ఇందులో 11 వేల మంది స్టార్టప్ కంపెనీల్లో పని చేస్తున్న వారే కావటం విశేషం. ఇది అధికారిక లెక్క అయినా.. అనధికారికంగా చిన్న చిన్న ఐటీ, స్టార్టప్ కంపెనీల నిర్ణయంతో.. మరో 20 మంది ఐటీ ఉద్యోగులు రోడ్డున పడ్డారనేది ఓ అంచనాగా ఉంది. ముఖ్యంగా ఎడ్యుకేషన్ కు సంబంధించిన 22 స్టార్టప్ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు నిపుణులు.

ఏది ఏమైనా ఐటీ రంగం సంక్షోభంలో ఉంది అనేది ఈ ఆరు నెలల్లోనే తేటతెల్లం అయ్యింది. రాబోయే ఆరు నెలలు ఎలా ఉండబోతుంది అనేది భయాందోళనలకు గురి చేస్తుంది.