నీతి ఆయోగ్ సమావేశం కాపేపట్లో

నీతి ఆయోగ్ సమావేశం కాపేపట్లో

ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన 5వ నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం కాపేపట్లో జరగనుంది. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ లక్ష్యంతో రాష్ట్రపతి భవన్ లోని సాంస్కృతిక కళా కేంద్రంలో జరగనున్న ఈ భేటీకి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, ప్రత్యేక ఆహ్వానితులు, పలువురు కేంద్రమంత్రులు, నీతి ఆయోగ్ ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. వర్షపు నీటి సంరక్షణ, కరవు పరిస్థితి, నివారణ చర్యలు, ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం, ట్రాన్స్ ఫార్మింగ్  అగ్రికల్చర్, ఎసెన్షియల్ కమోడిటీస్ చట్టం, భద్రతాపరమైన అంశాలు ఏక్  భారత్ -శ్రేష్ఠ్  భారత్  వంటి  కీలక అంశాలపై చర్చించనున్నారు. సమావేశం తర్వాత ముఖ్యమంత్రులు, ఆహ్వానితులకు ప్రధాని మోడీ విందు ఇవ్వనున్నారు.

మోడీ సర్కార్  తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఉన్న ప్రణాళిక సంఘాన్ని రద్దుచేసి, దాని స్థానంలో  నీతి ఆయోగ్  వ్యవస్థను ఏర్పరిచింది. అన్నిరాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్  గవర్నర్లు సభ్యులుగా ఉంటారు. నీతి ఆయోగ్ దేశంలో కేంద్రం, రాష్ట్రాలకు మధ్య అనుసంధానంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రాలకు కావాల్సిన అవసరాలపై నీతి ఆయోగ్  అంచనావేసి, నివేదికలను తయారు చేస్తోంది. ఇటీవలే  ప్రధాని నరేంద్ర మోడీ నీతి ఆయోగ్ ను పునర్  వ్యవస్థీకరించారు. నీతి ఆయోగ్  వైఎస్ ఛైర్మన్ గా ప్రస్తుతం రాజీవ్  కుమార్  వ్యవహరిస్తున్నారు.

మోడీ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగే  మొదటి సమావేశం కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. వివిధ రాష్ట్రాల సీఎంలు తమ డిమాండ్లను, సూచనలను ప్రధాని ముందు ఉంచనున్నారు. అయితే నీతి ఆయోగ్  కు ఏలాంటి ఆర్ధిక అధికారాలు లేవని ఆరోపిస్తున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. నీతి ఆయోగ్  సమావేశానికి హాజరుకాబోనని ప్రకటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కావడం లేదు. రాజస్థాన్ , మధ్యప్రదేశ్ , చత్తీస్  గఢ్ , ఆంధ్రప్రదేశ్ , సిక్కిం రాష్ట్రాల సీఎంలు మొదటిసారి హాజరుకాబోతున్నారు.