ఏప్రిల్ 19న ఫస్ట్ ఫేజ్​ పోలింగ్ ..బరిలో కేంద్ర మంత్రులు 8 మంది

ఏప్రిల్ 19న ఫస్ట్ ఫేజ్​ పోలింగ్ ..బరిలో కేంద్ర మంత్రులు 8 మంది

న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల ఫస్ట్ ఫేజ్ పోలింగ్​కు రంగం సిద్ధమైంది. శుక్రవారం 21 రాష్ట్రాలు/యూటీల్లోని 102 ఎంపీ స్థానాలకు పోలింగ్ కు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఫస్ట్ ఫేజ్ లో 10 రాష్ట్రాలు/యూటీల్లో ఎన్నికలు ముగియనుండగా.. మిగతా 11 రాష్ట్రాలు/యూటీల్లో కొన్ని స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఫస్ట్ ఫేజ్ ఎన్నికల బరిలో 8 మంది కేంద్ర మంత్రులు, ఇద్దరు మాజీ సీఎంలు, ఇద్దరు మాజీ సీఎంల కొడుకులు, ఒక మాజీ గవర్నర్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

జితేంద్ర సింగ్ (ఉధంపూర్): కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ జమ్మూకాశ్మీర్ లోని ఉధంపూర్ నుంచి వరుసగా మూడోసారి లోక్ సభ బరిలో నిలిచారు. 2014 ఎన్నికల్లో జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం గులాం నబీ ఆజాద్ పై, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్​పై ఆయన గెలిచారు. ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి టూ టైమ్ ఎంపీ చౌధరి లాల్ సింగ్ బరిలో నిలిచారు. 

శర్బానంద సోనోవాల్ (దిబ్రూగఢ్): కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి, అస్సాం మాజీ సీఎం శర్బానంద సోనోవాల్ సొంత రాష్ట్రంలోని దిబ్రూగఢ్ లోక్ సభ స్థానంలో 
బీజేపీ తరఫున బరిలోకి దిగారు.

కిరెన్ రిజిజు (అరుణాచల్ వెస్ట్): ఫస్ట్ ఫేజ్ లో అరుణాచల్ ప్రదేశ్​లో పార్లమెంట్ తోపాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. కేంద్ర ఎర్త్ సైన్సెస్ మంత్రి, త్రీ టైమ్ ఎంపీ కిరెన్ రిజిజు అరుణాచల్ ప్రదేశ్​లోని అరుణాచల్ వెస్ట్ స్థానం నుంచి వరుసగా మూడోసారి బరిలోకి దిగారు. కాంగ్రెస్ నుంచి మాజీ సీఎం, స్టేట్ పీసీసీ చీఫ్ నబమ్ తుకీ తలపడుతున్నారు. 

అర్జున్ రామ్ మేఘ్వాల్ (బికనీర్): రాజస్థాన్​లోని బికనీర్ లోక్ సభ స్థానం ఒకప్పుడు కాంగ్రెస్​కు కంచుకోటలా ఉండేది. కానీ1999 నుంచి ఇక్కడ హస్తం పార్టీ పట్టును కోల్పోయింది. తర్వాత 2004 నుంచి 2019 వరకూ బీజేపీ వరుసగా నాలుగు సార్లు గెలిచింది. బీజేపీ నుంచి 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా గెలిచిన కేంద్ర న్యాయ శాఖ సహాయ మంత్రి అర్జున్  రామ్ మేఘ్వాల్ మరోసారి బరిలో నిలిచారు.

ఎల్. మురుగన్ (నీల్ గిరీస్): తమిళనాడులోని నీల్ గిరీస్ లోక్ సభ స్థానంలో డీఎంకే నేత, టెలికం శాఖ మాజీ మంత్రి అండిముత్తు రాజా సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. 2019లో ఆయన భారీ మెజార్టీతో గెలిచారు. ఈసారి నీల్ గిరీస్​లో బీజేపీ నుంచి కేంద్ర మత్స్యశాఖ సహాయ మంత్రి ఎల్. మురుగన్ బరిలో నిలిచారు.

సంజీవ్ బలియాన్ (ముజఫర్ నగర్): కేంద్ర పశు సంవర్థక శాఖ సహాయ మంత్రి సంజీవ్ బలియాన్ యూపీలోని ముజఫర్ నగర్ నుంచి బీజేపీ తరఫున తలపడుతున్నారు. ఎస్పీనుంచి హరీంద్ర మాలిక్, బీఎస్పీ నుంచి దారా సింగ్ బరిలోకి దిగడంతో ముక్కోణపు పోటీ నెలకొంది.

భూపేంద్ర యాదవ్ (అల్వార్): కేంద్ర అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ రాజస్థాన్​లోని అల్వార్ లోక్ సభ స్థానం నుంచి బరిలోకి దిగారు. భూపేంద్రకు యాదవ కమ్యూనిటీ మద్దతు కలిసి వస్తుందని ఆ పార్టీ భావిస్తోంది. 

విప్లవ్ కుమార్ దేవ్​(త్రిపుర వెస్ట్): త్రిపురలోని వెస్ట్ త్రిపుర నుంచి ఆ రాష్ట్ర మాజీ సీఎం విప్లవ్ కుమార్ దేవ్​బరిలో నిలిచారు. ఆయనకు పోటీగా కాంగ్రెస్ నుంచి త్రిపుర పీసీసీ చీఫ్ ఆశిష్ కుమార్ సాహా బరిలోకి దిగారు. 

నితిన్ గడ్కరీ (నాగ్ పూర్): కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ మహారాష్ట్రలోని నాగ్ పూర్ లోక్ సభ స్థానం నుంచి వరుసగా రెండు సార్లు గెలిచి, ఇప్పుడు మూడోసారి బరిలోకి దిగారు. 2014 ఎన్నికల్లో సెవెన్ టైమ్ ఎంపీ విలాస్ ముత్తెవార్ ను గడ్కరీ ఓడించారు. 2019లో కాంగ్రెస్ అభ్యర్థి నానా పటోల్ పై గెలిచారు. ఈసారి గడ్కరీపై నాగ్ పూర్ వెస్ట్ ఎమ్మెల్యే వికాస్ థాక్రేను కాంగ్రెస్ పోటీకి దింపింది. ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ కావడంతో నాగ్ పూర్ సీటును అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. 

తమిళిసై (చెన్నై సౌత్): ఇటీవలే రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తమిళనాడులోని చెన్నై సౌత్ లోక్ సభ స్థానం నుంచి బీజేపీ తరఫున ఎన్నికల బరిలో నిలిచారు. కాంగ్రెస్ సీనియర్ నేత కుమారి అనంతన్ బిడ్డ అయిన తమిళిసై 2019 లోక్ సభ ఎన్నికల్లో తూత్తుకుడి నుంచి డీఎంకే అభ్యర్థి కనిమొళిపై పోటీ చేసి, భారీ ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. కనిమొళి ఈసారి కూడా తూత్తుకుడి నుంచి పోటీలో ఉన్నారు.