కాజీపేట -బల్లార్షా రూట్లో..నాలుగో రైల్వే లైన్..రూ.3,500 కోట్ల అంచనా వ్యయం

కాజీపేట -బల్లార్షా రూట్లో..నాలుగో రైల్వే లైన్..రూ.3,500 కోట్ల అంచనా వ్యయం
  •     పూర్తయిన డీపీఆర్,  ఫైనల్ లొకేషన్ సర్వే 
  •     నాలుగు రాష్ట్రాల మధ్య పెరగనున్న కనెక్టివిటీ

కోల్​బెల్ట్, వెలుగు: ఉత్తరాది రాష్ట్రాలను దక్షిణాదితో అనుసంధానించే చైన్నై–-న్యూఢిల్లీ రూట్​లోని కాజీపేట–-బల్లార్షా మధ్య నాలుగో రైల్వే లైన్​ నిర్మించేందుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. దేశంలో అత్యంత రద్దీగా ఉండే ఈ మార్గంలో ప్రయాణికుల, సరుకు రవాణా రైళ్ల రాకపోకలను సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.3,500 కోట్ల అంచనాతో నాలుగో లైన్​ను మంజూరు చేసింది. కాజీపేట–-బల్లార్షా మార్గంలో 250 కిలోమీటర్ల పొడవున చేపట్టనున్న ఈ లైన్​ నిర్మాణానికి సంబంధించి డీటెల్డ్​ ప్రాజెక్ట్​ రిపోర్ట్( డీపీఆర్) సైతం పూర్తయింది.

మూడో రైల్వే లైన్​ పూర్తయిన నేపథ్యంలో..

దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని కాజీపేట–-బల్లార్షా రైల్వే మార్గంలో ఇటీవల నిర్మించిన  మూడో రైల్వే లైన్​లో రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. 2015–16 బడ్జెట్​లో 203 కిలోమీటర్ల మూడో లైన్​ పనులకు ఆమోదం లభించింది. రూ.3వేల కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్​ జులై నెలలో పూర్తిగా అందుబాటులోకి  వచ్చింది. ఈక్రమంలో కాజీపేట–-బల్లార్షా రూట్​లో నాలుగో లైన్​ నిర్మాణంపై రైల్వేశాఖ దృష్టి పెట్టింది. 250 కిలోమీటర్ల పొడవున నాలుగో రైల్వే లైన్​ నిర్మించనున్నారు. ఈ మార్గంలో 80శాతం తెలంగాణలో ఉండగా, మిగిలిన భాగం మహారాష్ట్రలో ఉంది. నాలుగో రైల్వే లైన్​కు సంబంధించి ఫైనల్​ లోకేషన్​ సర్వే(ఎఫ్ఎల్ఎస్) కూడా ఇటీవల పూర్తయింది. మొదటి సర్వేను పూర్తి  చేయగా, ఈ నెల 9,10 తేదీల్లో రెండో సర్వే కూడా చేశారు. దీనిపై ఈనెల 15న నివేదిక అందించనున్నారు. ఇందులోని అంశాల ఆధారంగా సాధ్యాసాధ్యాలపై చర్చించి వచ్చే రైల్వే బడ్జెట్​లో ప్రకటించేందుకు రైల్వే అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

రద్దీ నియంత్రణకు చెక్

కాజీపేట–-బల్లార్షా రైల్వే మార్గంలో ఇప్పటికే మూడో రైల్వే లైన్​ అందుబాటులోకి వచ్చింది. తాజాగా నాలుగో రైల్వే లైన్​ ఏర్పాటు చేసేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తుండగా, ఈ ప్రాజెక్టుతో కాజీపేట–--బల్లార్షా మధ్య రైళ్ల వేగం పెరగడంతో పాటు ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి వస్తుంది. ఈ రూట్​లో ప్రయాణించే రైళ్ల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే సౌత్​ సెంట్రల్​ రెల్వే నెట్వర్క్​లో ముఖ్యమైన భాగంగా ఉంటుంది. గ్రాండ్  ట్రంక్  రూట్​లో కాజీపేట–--బల్లార్షా మార్గం అత్యంత రద్దీగా ఉంటుంది. ప్రయాణికులను చేరవేసే రైళ్లు, గూడ్స్  రాకపోకలతో ఈ మార్గం నిత్యం బిజీగా ఉంటుంది. కీలక రైలు రవాణా మార్గాల్లో ఇది ఒకటి. నాలుగో లైన్​ పూర్తయితే గూడ్స్  రైళ్లకు ప్రత్యేక ట్రాక్  అందుబాటులోకి వస్తుంది. దీంతో సికింద్రాబాద్​ నుంచి ఢిల్లీ, చండీగఢ్, జైసల్మేర్, జోధ్​పూర్, పాట్నా, లఖ్​నవూ, అలహాబాద్​ వంటి నగరాలకు రైలు ప్రయాణం వేగవంతమవుతుంది. సికింద్రాబాద్(ఘట్​కేసర్)-–కాజీపేట మధ్య ఇటీవల కేంద్రకేబినెట్​ ఆమోదించిన 110 కిలోమీటర్ల నాలుగో లైన్​ ప్రాజెక్టుతో కాజీపేట–-బల్లార్షా నాలుగో లైన్​ను అనుసంధించే అవకాశం ఉంది. దీంతో సికింద్రాబాద్​ నుంచి ఢిల్లీ వైపు నిరంతరాయంగా రైల్వే సేవలు అందుబాటులోకి వస్తాయి. 

మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో  సింగరేణి బొగ్గు గనులు, సిమెంట్​ ఫ్యాక్టరీలు ఎక్కువగా ఉండడం, ఎన్టీపీసీ, థర్మల్​ విద్యుత్​ కేంద్రాలకు అవసరమైన ముడి సరుకు రవాణాతో గూడ్స్​ రైళ్ల రద్దీ ఎక్కువగా ఉంటుంది. నాలుగో లైన్​ పూర్తయితే గూడ్స్, ప్యాసింజర్​​రైళ్లు ఒకదాని కోసం ఒకటి ఆగాల్సిన అవసరం లేకుండా పోతుంది. రద్దీ నియంత్రణ ద్వారా సమయపాలన మెరుగవుతుంది. ఇప్పటికే కాజీపేట–విజయవాడ మధ్య మూడో రైల్వే లైన్​ పనులు కొనసాగుతున్నాయి. ఇది మరో రెండేళ్లలో పూర్తయ్యే అవకాశం ఉంది. కాజీపేట–-బల్లార్షా మధ్య మరో లైను నిర్మిస్తే దేశంలో అతిపెద్ద నాలుగో లైన్​ కలిగిన రైల్వే మార్గంగా మారనుంది. మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ, తమిళనాడు మధ్య రవాణా పెరుగుతుంది.