దేశాన్ని ఏలిన తెలంగాణ బిడ్డ

దేశాన్ని ఏలిన తెలంగాణ బిడ్డ
  • దేశాన్ని ఏలిన తెలంగాణ బిడ్డ
  • ప్రధాని పదవి  చేపట్టిన ఏకైక తెలుగు వ్యక్తి పీవీ
  • దక్షిణాది నుంచి తొలి ప్రధానిగానూ రికార్డు 
  • ఉమ్మడి ఏపీలో ముఖ్యమంత్రిగా సేవలు

కరీంనగర్, వెలుగు: ప్రధాని పదవి చేపట్టిన ఏకైక తెలుగు వ్యక్తి పీవీ నరసింహారావు. ఎమ్మెల్యేగా ప్రస్థానం ప్రారంభించిన ఆయన.. దేశ ప్రధానిగా అత్యున్నత పదవిని చేపట్టారు. దక్షిణ భారతదేశం నుంచి తొలి ప్రధానిగా చరిత్ర సృష్టించారు. వరంగల్ లో పుట్టిన పీవీ.. కరీంనగర్ నుంచి తన రాజకీయ జీవితం ప్రారంభించారు. 1951లో కరీంనగర్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడినా, తర్వాత ఇదే జిల్లాలోని మంథని నుంచి వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మంత్రిగా, ముఖ్యమంత్రిగా సేవలందించారు. ఆ తర్వాత దేశ రాజకీయాలపై దృష్టిసారించి ప్రధాని దాకా ఎదిగారు. 

నాగ్ పూర్ లో లా చదివి.. 

వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లిలో 1921 జూన్ 28న రుక్మాబాయి, సీతారామారావు దంపతులకు నరసింహారావు జన్మించారు. అయితే ఆయనను పాత కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు, రుక్మిణమ్మ దంపతులు దత్తత తీసుకున్నారు. దీంతో ఆయన పేరు పాములపర్తి వెంకట నరసింహారావుగా మారింది. పీవీ స్కూల్, కాలేజీ చదువు హనుమకొండలో సాగింది. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీలో చేరారు. 1938లోనే హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ లో చేరి నిజాం ప్రభుత్వం నిషేధించిన వందేమాతరం గేయాన్ని పాడి యూనివర్సిటీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. దీంతో ఆయన నాగ్ పూర్ యూనివర్సిటీకి వెళ్లి ఎల్ఎల్ బీ పూర్తి చేశారు. అప్పటి కాంగ్రెస్ నాయకులు స్వామి రామానంద తీర్థ, బూర్గుల రామకృష్ణారావు అనుచురుడిగా స్వాతంత్ర్య ఉద్యమం, హైదరాబాద్ విముక్తి పోరాటంలోనూ పాల్గొన్నారు. 

1957లో అసెంబ్లీకి..  

1951లోనే ఏఐసీసీ మెంబర్ గా ఎంపికైన పీవీ నరసింహారావు అదే ఏడాది కరీంనగర్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి కమ్యూనిస్టు నాయకుడు బద్దం ఎల్లారెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత 1957లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ జిల్లా మంథని నియోజకవర్గం నుంచి ఎన్నికై శాసనసభలో తొలిసారి అడుగుపెట్టారు. ఇదే నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1962 నుంచి 1971 వరకు వరుసగా న్యాయ, సమాచార, దేవాదాయ, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా సేవలందించారు. అయితే 1969లో తెలంగాణ ఉద్యమం ఎగిసిపడడం, తెలంగాణ ప్రజల్లో అసంతృప్తి నెలకొనడంతో దీన్ని చల్లార్చేందుకు తెలంగాణ ప్రాంత నేతను సీఎంగా చేయాలనే ప్రతిపాదన తెరమీదికొచ్చింది.

ఈ పదవికి పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ, పార్టీలోని ఏ గ్రూపునకు చెందని పీవీ నరసింహారావును హైకమాండ్​ సీఎంగా ఎంపిక చేసింది. దీంతో 1971 సెప్టెంబర్ 30న ముఖ్యమంత్రిగా పీవీ బాధ్యతలు చేపట్టారు. తర్వాత కొన్నాళ్లకే  రాష్ట్రంలో భూగరిష్ట పరిమితి చట్టం తీసుకొచ్చి భూసంస్కరణలు అమలు చేశారు. ఇది అప్పట్లో తెలంగాణ ప్రాంత భూస్వాములకు కోపం తెప్పించింది. దీనికితోడు 1973లో జైఆంధ్రా ఉద్యమం మొదలైంది. దీంతో పీవీ రాజీనామా చేయాల్సి వచ్చింది. తర్వాత కేంద్రం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించింది. 

1977లో లోక్ సభకు.. 

ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయాక దేశరాజకీయాలపై దృష్టిసారించిన పీవీ.. 1977లో తొలిసారిగా హనుమకొండ స్థానం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1980లో జరిగిన ఎన్నికల్లోనూ ఆయన మళ్లీ హనుమకొండ నుంచే గెలిచి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1984లో హనుమకొండతో పాటు మహారాష్ట్రలోని రాంటెక్ నుంచి పోటీ చేయగా.. హనుమకొండలో బీజేపీ అభ్యర్థి చందుపట్ల జంగారెడ్డి చేతిలో ఓడిపోయారు. రాంటెక్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ కేంద్ర హోంశాఖ మంత్రిగా, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ గా, కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా, హెచ్ఆర్డీ మంత్రిగా,  ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా సేవలందించారు. 1989లో మళ్లీ రాంటెక్ నుంచే గెలుపొందారు. 

రాజీవ్ గాంధీ హత్యతో అనూహ్యంగా ప్రధాని.. 

1991లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో పీవీ పోటీ చేయకుండా దాదాపు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అదే సమయంలో రాజీవ్ గాంధీ హత్య కారణంగా కాంగ్రెస్ పార్టీని నడిపించే నేత లేకుండాపోయారు. ఆ సమయంలో ఎలాంటి గ్రూపులో లేకుండా కాంగ్రెస్ లో అందరివాడిగా ఉన్న పీవీని ప్రధానమంత్రిగా హైకమాండ్​నిర్ణయించింది.

ఇలా దక్షిణాది నుంచి ప్రధానిగా ఎన్నికైన తొలి నేతగా పీవీ చరిత్ర సృష్టించారు. దీంతో ఆయన ఆర్నెళ్లలోపు ఏదో ఒక లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికవడం తప్పనిసరి కావడంతో కర్నూలు జిల్లా నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం నుంచి గంగుల ప్రతాపరెడ్డితో రాజీనామా చేయించి బై ఎలక్షన్ లో గెలిచారు. అప్పటి ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ లేకపోయినా తన చాణక్యం, చాతుర్యం, కేంద్రంలో వివిధ మంత్రిత్వ శాఖల్లో పని చేసిన అనుభవంతో ఐదేళ్లు సుస్థిర ప్రభుత్వాన్ని నడిపారు. ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు.