ఫిట్ నెస్ సర్టిఫికెట్ అవసరం లేదు

ఫిట్ నెస్ సర్టిఫికెట్ అవసరం లేదు

ఫుల్టీ బిల్ట్​ వాహనాలకు మొదటి రెండేళ్లు ఫిట్​నెస్​ సర్టిఫికెట్​ (ఎఫ్​సీ) అవసరం లేదు. దీనిపై కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్​ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. దీనికి సంబంధించి అన్ని ఆఫీసులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చాసిస్​, బాడీతో కలిపి తయారైన వాహనం రోడ్డు మీదకు వస్తే దాన్నే ఫుల్లీ బిల్ట్​ వాహనం అంటారు. ఈ లెక్కన కొన్ని రకాల హెవీ ట్రక్కులు, స్కూల్​ బస్సులు, మినీ వ్యాన్లు, కార్లకు ఎఫ్​సీ మినహాయింపు లభించనుంది. వివిధ రాష్ట్రాల సలహాలు సూచనలు తీసుకున్న కేంద్ర ప్రభుత్వం, అందుకు తగ్గట్టు మోటార్​ వెహికిల్​ చట్టం 1998కి కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది. ఆ మార్పుల్లో భాగంగానే ఫుల్లీ బిల్ట్​ వాహనాలకు ఎఫ్​సీ అవసరం లేదని, అన్ని రాష్ట్రాలూ అమలు చేయాలని పేర్కొంది. ఆ రూల్స్​ను తొలుత రాష్ట్ర ప్రభుత్వం పాటించలేదు. ఇటీవలి కాలం నుంచే దాన్ని అమల్లోకి తెచ్చింది. ఇన్నాళ్లూ ఎఫ్​సీ కావాలంటే మీసేవాలో అప్లై చేసుకోవాలి. వాళ్లిచ్చే డేట్​కు వెళితే సర్టిఫికెట్​ ఇస్తారు. అందుకు ₹750 నుంచి ₹1000 వరకు ఫీజు చెల్లించాల్సి ఉండేది. ఇప్పుడు కొత్త విధానం అమల్లోకి రావడంతో అవేవీ అవసరం లేకుండా పోయింది. అయితే, ప్రతి రెండేళ్లకోసారి మాత్రం కచ్చితంగా ఫిట్​నెస్​ చేయించుకోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అలా 8 ఏళ్ల పాటు ఎఫ్​సీ తీసుకోవచ్చు. 8 ఏళ్ల తర్వాత ఏడాదికొకసారి సర్టిఫికెట్​ తీసుకోవాల్సి ఉంటుంది. కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం ఎఫ్​సీ రూల్స్​ను అమలు చేస్తున్నామని రవాణా శాఖ డీటీసీ పీ శ్రీనివాస్​ తెలిపారు. కొత్త రూల్స్​ను అమలు చేస్తున్నందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆటో కార్మిక సంఘాల సమాఖ్య కృతజ్ఞతలు తెలిపింది.