పది రోజులుగా సొరంగంలోనే.. ఉత్తరాఖండ్‌‌ టన్నెల్‌‌లో కొనసాగుతున్న సహాయక చర్యలు

పది రోజులుగా సొరంగంలోనే..  ఉత్తరాఖండ్‌‌ టన్నెల్‌‌లో కొనసాగుతున్న సహాయక చర్యలు

ఉత్తరాఖండ్‌‌లోని టన్నెల్‌‌లో 41 మంది కార్మికులు చిక్కుకుపోయి పది రోజులు అయితున్నది. వారిని బయటికి తీసుకొచ్చేందుకు రెస్క్యూ సిబ్బంది చేస్తున్న సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి.. డ్రిల్లింగ్‌‌ చేస్తే రాతిపొరలు అడ్డుపడుతున్నాయి. మట్టిని తొలగిస్తుంటే.. పైనుంచి మరింత కూలుతున్నది. ఈ నేపథ్యంలో ఓవైపు రెస్క్యూ పనులు కొనసాగిస్తూనే.. కార్మికుల్లో ధైర్యాన్ని నింపేందుకు వారితో నిరంతరం మాట్లాడుతున్నారు. కుటుంబ సభ్యులతోనూ మాట్లాడిస్తున్నారు. సోమవారం సాయంత్రం టన్నెల్‌‌ లోపలికి కెమెరాను పంపి, అందరితోనూ మాట్లాడారు. ఇందుకు సంబంధించిన వీడియోను రిలీజ్ చేశారు. తమ వాళ్లు ఎలా ఉన్నారో తెలియక.. ఏ క్షణం ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అర్థం కాక ఆందోళన చెందిన కుటుంబాలకు ఈ వీడియో  కొంత ఉపశమనం కలిగించింది.

పెద్ద పైపును పంపి

సోమవారం వరకు 4 ఇంచుల పైప్‌‌లైన్‌‌ ద్వారా డ్రైఫ్రూట్స్, మెడిసిన్స్, ఆక్సిజన్‌‌ను అధికారులు టన్నెల్‌‌లోకి పంపించారు. సోమవారం సాయంత్రం 6 ఇంచుల వెడల్పు ఉన్న పెద్ద పైప్‌‌లైన్‌‌ను ఏర్పాటు చేశారు. దీని నుంచి ఎండో స్కోపిక్ కెమెరాను పంపిన అధికారులు.. అక్కడి దృశ్యాలను రికార్డు చేశారు. ఈ వీడియోలో.. హెల్మెట్లు ధరించిన కార్మికులు.. పైప్‌‌లైన్ ద్వారా అధికారులు పంపిన ఆహారాన్ని అందుకోవడం, తమలో తాము మాట్లాడుకోవడం కనిపించింది. అధికారులు బయటి నుంచి స్క్రీన్‌‌పై చూస్తూ వారికి సూచనలు ఇచ్చారు. కెమెరా లెన్స్‌‌ను క్లీన్ చేయాలని, అందరూ కెమెరా ముందుకు రావాలని కోరారు. పైప్‌‌లైన్‌‌ దగ్గరికి వచ్చి, వాకీ టాకీల ద్వారా మాట్లాడాలని చెప్పారు. పెద్ద పైప్‌‌లైన్ ఏర్పాటు చేశాక.. తొలుత కిచిడీని కార్మికులకు పంపారు. ఈ పది రోజుల్లో సరైన ఆహారం అందడం ఇదే తొలిసారి.

హారిజాంటల్ డ్రిల్లింగ్‌‌పై ఫోకస్

ఈ నెల 12న కొండచరియలు విరిగిపడి టన్నెల్ కూలింది. కార్మికులకు, రెస్క్యూ సిబ్బందికి మధ్య 40 మీటర్ల మేర మట్టి దిబ్బ అడ్డుగా ఉన్నది. కార్మికులను బయటికి తీసుకొచ్చేందుకు ఫైవ్ ప్లాన్ స్ట్రాటజీని అనుసరిస్తున్నారు. అయితే అందరినీ సురక్షితంగా తీసుకొచ్చేందుకు హారిజాంటల్ డ్రిల్లింగ్‌‌పైనే తాము ఫోకస్ పెట్టినట్లు అధికారులు చెప్పారు. వర్టికల్ డ్రిల్లింగ్ అనే అంశం సెకండ్ ఆప్షన్ మాత్రమేనని తెలిపారు. ‘‘ఐదు వైపుల నుంచి సమాంతరంగా ప్రయత్నాలు చేస్తున్నాం’’ అని నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌‌మెంట్ అథారిటీ సభ్యుడు సయ్యద్ హస్నయిన్ చెప్పారు. ‘‘ఇది అంత తేలిక కాదు. అందుకే మేం ప్రతి మార్గాన్ని అన్వేషిస్తున్నాం. అన్ని బృందాలు దానిపై పని చేస్తున్నాయి. ఎప్పటిలోపు కార్మికులను తీసుకొస్తామనేది చెప్పలేను” అని వివరించారు. కొత్తగా ఏర్పాటు చేసిన పైప్‌‌లైన్ వల్ల.. వేడి ఆహారం, మందులు పంపేందుకు వీలవుతోందని తెలిపారు.  

త్వరలోనే మిమ్మల్ని చేరుకుంటాం..

 
‘‘మీరు బాగున్నారా? దయచేసి కెమెరా ముందుకు వచ్చి కనిపించండి. మీ చేతులు పైకెత్తి, నవ్వండి” అని వాకీ-టాకీ ద్వారా కార్మికులకు అధికారులు చెప్పారు. కెమెరా ముందుకు కార్మికులు లైనుగా వచ్చి నిల్చున్నారు. తాము బాగానే ఉన్నామని సంకేతాలిస్తూ కెమెరా ముందు చేతులు ఊపారు. ‘‘త్వరలోనే మిమ్మల్ని మేం చేరుకుంటాం.. వర్రీ కావద్దు. ఒకరి తర్వాత ఒకరు కెమెరా ముందుకు రండి. మీరు బాగున్నారని మీ కుటుంబ సభ్యులకు మేము తెలియజేయాలి” అని ఓ ఆఫీసర్ చెప్పడం వీడియోలో వినిపించింది.