చేప పిల్లల పంపిణీకి సిద్ధం!.. యాదాద్రికి 2.80 కోట్ల పిల్లలు

చేప పిల్లల పంపిణీకి సిద్ధం!..  యాదాద్రికి 2.80 కోట్ల పిల్లలు
  • 687 చెరువుల్లో వేయాలని నిర్ణయం
  • చేప పిల్లల కోసం ఈ–-టెండర్లు

యాదాద్రి, వెలుగు : చేప పిల్లల పంపిణీకి ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రపోజల్స్​ను హయ్యర్ ఆఫీసర్లకు పంపగా, వారు ఓకే చేశారు. చేప పిల్లల పంపిణీ కోసం టెండర్ల ప్రక్రియ చేపట్టారు. చెరువుల కెపాసిటీని బట్టి చేప పిల్లలను విడుదల చేయనున్నారు. 

జిల్లాలో మొత్తం 1155 చెరువులు.. 

యాదాద్రి జిల్లాలో మొత్తం 1155 చెరువులు ఉన్నాయి. ఇందులో చేపల పెంపకానికి అనువుగా 687 చెరువులు ఉన్నాయని ఫిషరీస్​ డిపార్ట్​మెంట్​గుర్తించింది. ఈ చెరువులు, మూసీ పరివాహక ప్రాంతాల్లో చేపలు పట్టుకోవడం ద్వారా మత్స్యకారులు ఉపాధి పొందుతున్నారు. 2016 నుంచి ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తూ వాటిని సెప్టెంబర్​లో చెరువుల్లో వదిలి పెడుతున్నారు. ఈ ఏడాది కూడా చేప పిల్లల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నారు. 

2.80 కోట్ల చేప పిల్లలు..

పెద్ద సైజు చేప పిల్లలు (80 ఎంఎం నుంచి 100 ఎంఎం) 1.40 కోట్లను 150 చెరువుల్లో వేయనున్నారు. 35 ఎంఎం నుంచి 40 ఎంఎం ఉన్న చిన్న సైజు చేపలను 537 చెరువుల్లో వేయనున్నారు. అయితే 60 శాతం నీరున్న చెరువుల్లో వంద శాతం చేప పిల్లలను వదులుతామని ఆఫీసర్లు చెబుతున్నారు. టెండర్ ప్రక్రియలో భాగంగా చేప పిల్లలను ఏ రేటుకు సప్లయ్​చేయాలో ప్రభుత్వం నిర్ణయించింది. 

80 ఎంఎం నుంచి 100 ఎంఎం సైజు ఉన్న ఒక్కో  చేప పిల్లకు రూ.1.60 పైసలు, 35 ఎంఎం నుంచి 40 ఎంఎం సైజు ఉన్న చేప పిల్లలకు రూ.0.60 పైసలు నిర్ణయించారు. ఈ రేట్లకు అనుగుణంగా బిడ్ కోట్ చేసిన కాంట్రాక్టర్లకు చేప పిల్లల సప్లయ్​ను ప్రభుత్వం అప్పగిస్తుంది. చేప పిల్లల పంపిణీ కోసం ప్రభుత్వం రూ.3.21 కోట్లు ఖర్చు చేస్తోంది. 

ఆన్​లైన్​ టెండర్లు..

ప్రతి సీజన్​లో మాదిరిగానే ఈసారి కూడా రాష్ట్ర స్థాయిలో ఆన్‌లైన్‌ టెండర్లను పిలిచారు. ఈనెల 18 నుంచి ఆన్​లైన్​లో టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది. 19న సాయంత్రం వరకు టెండర్ ఫారాల డౌన్​లౌడ్​ప్రక్రియ ముగిసింది. 20 నుంచి ప్రారంభమైన బిడ్ ప్రక్రియ సెప్టెంబర్​1 మధ్యాహ్నం 3 గంటలకు ముగుస్తుంది. అదేరోజు మధ్యాహ్నం 3.30 గంటల నుంచి టెండర్లను జిల్లాల వారీగా తెరవనున్నారు. ఈ టెండర్‌లో ప్రభుత్వ నిర్ణయించిన ధరలకు అనుగుణంగా వచ్చిన టెండర్లను ఖరారు చేయనున్నారు. 

జిల్లాలో 190 మత్య్స సహకార సొసైటీలు..

జిల్లాలో మహిళా సంఘాలతో కలిపి మొత్తం 190 మత్స్య సహకార సొసైటీలు ఉన్నాయి. ఈ సంఘాల్లో 11 వేల మందికి పైగా మెంబర్లు ఉన్నారు. గ్రామాల పరిధిలోని చెరువుల్లో వీరికి చేపలు పట్టుకొని ఉపాధి పొందుతారు.