చేప ఎగిరొచ్చి.. మెడలో గుచ్చుకుంది

చేప ఎగిరొచ్చి..  మెడలో గుచ్చుకుంది

ఇండోనేషియాలోని శార్దీ, మహమ్మద్ ఇదుల్(16) స్నేహితులు. వీరిద్దరూ అర్ధరాత్రి వేళ సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్లారు. శార్దీ పడవ కొంచెం ముందుగా వెళ్లింది. అతడి వెనకే వెళ్లిన ఇదుల్ వల వేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇంతలో ఓ నీడిల్ ఫిష్ (75 సెంటీమీటర్లు)  గాల్లోకి ఎగిరింది. సూది మాదిరిగా పొడవుగా, పదునుగా ఉండే తన మొట్టెను చాపుతూ వేగంగా వచ్చి ఇదుల్ మెడను తాకింది. అదే వేగంతో మెడలో బలంగా గుచ్చుకుపోయింది. ఆ దెబ్బకు విలవిల్లాడిన ఇదుల్ పడవలో నుంచి సముద్రంలో పడిపోయాడు.

ఇది బీచ్ కు 500 మీటర్ల దూరంలోనే జరిగింది. వెంటనే గమనించిన శార్దీ వచ్చి ఇదుల్ ను ఒడ్డుకు తీసుకొచ్చాడు. రక్తం కారకూడదని మెడలో దిగిన ఫిష్​ను అలాగే ఉంచి ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడి నుంచి దగ్గర్లోని హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అయితే ఆస్పత్రి డాక్టర్ల దగ్గర సరైన పరికరాలు లేకపోవడంతో మెడలో దిగిన వరకు అలాగే వదిలేసి, బయట ఉన్న ఫిష్​ను కట్ చేశారు. తర్వాత పెద్దాస్పత్రికి పంపించారు. ఇలాంటి కేసు ఇదే మొదటిదని, గంటసేపు ఆపరేషన్ చేసి ఫిష్​ను తొలగించామని డాక్టర్ ఖలీద్ తెలిపారు. ఇదుల్ హాస్పిటల్ లో చేరి ఇప్పటికే ఐదు రోజులవుతోంది. ప్రస్తుతం అతని కండీషన్ బాగానే ఉందని, అయితే మరిన్ని పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందని ఖలీద్ చెప్పారు. నీడిల్ ఫిష్​ముక్కు పెద్దగా షార్పుగా ఉంటుంది. ఇవి నీటిలో వేగంగా ప్రయాణిస్తాయి.

వెలుగు వార్తలకోసం క్లిక్ చేయండి