
- మృతుల్లో ఇద్దరు మహిళలు.. మహారాష్ట్రలోని కవాండే అటవీ ప్రాంతంలో ఘటన
- ముందస్తు సమాచారంతో రంగంలోకి 12 టీమ్‌లు
- ఇంద్రావతి నదీ తీరం వెంట భారీ వర్షంలో కూంబింగ్
- మావోయిస్టులు ఎదురుపడడంతో ఇరువర్గాల మధ్య కాల్పులు
- రెండు గంటలపాటు కొనసాగిన ఎన్కౌంటర్
భద్రాచలం, వెలుగు: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. గడ్చిరోలి జిల్లాలోని కవాండే -నెలుగుండీ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న పక్కా సమాచారంతో అడిషనల్ ఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో 12 టీమ్‌ల సీ-60 బలగాలు రంగంలోకి దిగాయి. వీరికి సీఆర్పీఎఫ్ బలగాలు తోడయ్యాయి. గురువారం రాత్రి ఇంద్రావతి నదీ తీరం వెంట భారీ వర్షంలోనే కూంబింగ్ ప్రారంభమైంది.
శుక్రవారం ఉదయం మావోయిస్టులు ఎదురుపడడంతో ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. రెండు గంటలపాటు కాల్పులు కొనసాగాయి. ఘటనా స్థలంలో నలుగురు మవోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అందులో ఇద్దరు మహిళలున్నారు. గాయపడిన మరికొంతమంది మావోయిస్టులు పారిపోయినట్టు చెబుతున్నారు. వారి కోసం అదనపు బలగాలతో గాలింపు చేపట్టారు. సెల్ఫ్ లోడింగ్ రైఫిల్, ఒక బర్మార్ తుపాకీ, వాకీటాకీలు, పేలుడు పదార్థాలను ఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకుని గడ్చిరోలీ జిల్లా కేంద్రానికి తరలించారు.
సుక్మా ఎన్కౌంటర్లో మరో మావోయిస్టు మృతి
చత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా కిష్టారం పోలీస్‌స్టేషన్ పరిధి అడవుల్లో శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. సుక్మా ఎస్పీ కిరణ్ చౌహాన్ ఆధ్వర్యంలో 500 మందితో కూడిన బలగాలు కిష్టారం అడవుల్లోకి ప్రవేశించాయి. ఈ క్రమంలో మావోయిస్టులు తారసపడ్డారు. డీఆర్జీ బలగాలు వారిని వెంబడించి కాల్పులు జరపడంతో మావోయిస్టులు పారిపోయారు. ఘటనా స్థలంలో ఒక మావోయిస్టు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.