ఢిల్లీ సీఏఏ ఆందోళనల్లో ఐదుగురు మృతి

ఢిల్లీ సీఏఏ ఆందోళనల్లో ఐదుగురు మృతి

    ఆందోళనకారుల దాడిలో హెడ్‌‌ కానిస్టేబుల్‌‌, గొడవల్లో నలుగురు ఆందోళనకారులు..

    షాపులు, కార్లు, పెట్రోల్‌‌ బంక్‌‌కు నిప్పు

    ఆందోళనకారులపై పోలీసుల లాఠీ చార్జ్‌‌

న్యూఢిల్లీనార్త్‌‌ఈస్ట్‌‌ ఢిల్లీలోని జఫ్రాబాద్‌‌, మౌజ్‌‌పూర్‌‌‌‌, కర్దాంపురి, చాంద్‌‌బాగ్‌‌, దయాల్‌‌పుర్‌‌‌‌ ప్రాంతాల్లో సీఏఏ వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య సోమవారం మరోసారి గొడవలు జరిగాయి. జాఫ్రాన్‌‌, మౌజ్‌‌పుర్‌‌‌‌, గోలక్‌‌పురి, భజన్‌‌పురలో సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాలు రాళ్లు రువ్వుకున్నారు. దీంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్‌‌ చేసి, టియర్‌‌‌‌గ్యాస్‌‌ ఉపయోగించారు. 144 సెక్షన్‌‌ను విధించారు. నిషేధాజ్ఞలు ఉన్నప్పటికీ ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఆందోళనకారులు విసిరిన రాయి తగలడంతో హెడ్‌‌కానిస్టేబుల్‌‌ రతన్‌‌ లాల్‌‌ చనిపోయాడు. డిప్యూటీ కమిషనర్‌‌‌‌ ఆఫ్‌‌ పోలీస్‌‌ అమిత్‌‌ శర్మ, మరో 50 మంది సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. నలుగురు ఆందోళనకారులు చనిపోయారు. నిరసనకారులు రెండు ఇళ్లకు నిప్పుపెట్టారు. మంటలు ఆర్పేందుకు వచ్చిన ఫైర్‌‌‌‌ ఇంజన్‌‌ను ధ్వంసం చేశారు. మౌజ్‌‌పూర్‌‌‌‌లోని షాపులు, మినీ బస్సులు, కార్లకు నిప్పుపెట్టినట్లు అధికారులు చెప్పారు. భజన్‌‌పురాలోని పెట్రోల్‌‌ బంక్‌‌కు కూడా నిప్పుపెట్టారు.  డొనాల్డ్‌‌ ట్రంప్‌‌ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో సెక్యూరిటీని మానిటర్‌‌‌‌ చేస్తున్నామని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. పోలీసులపై ఆందోళనకారులు దాడి చేయడం కరెక్ట్‌‌ కాదని, దీనికి బాధ్యులైన ఏ ఒక్కరినీ వదిలిపెట్టమని కేంద్ర మంత్రి కిషన్‌‌రెడ్డి చెప్పారు. మౌజ్‌‌పూర్‌‌‌‌లో ఆదివారం జరిగిన ఆందోళనలు కూడా హింసాత్మకంగా మారాయి.

మెట్రో స్టేషన్లు బంద్‌‌

ఆందోళన నేపథ్యంలో మెట్రో అధికారులు కొన్ని మెట్రో స్టేషన్లను బంద్‌‌ చేశారు. పింక్‌‌ లైన్‌‌ పరిధిలోని జఫార్‌‌‌‌బాద్‌‌, మౌజీపూర్‌‌‌‌–బాబర్‌‌‌‌పూర్‌‌‌‌, గోకుల్‌‌పూర్‌‌‌‌, జోహ్రీ ఎన్‌‌క్లేవ్‌‌, శివ్‌‌ విహార్‌‌‌‌ స్టేషన్లను క్లోజ్‌‌ చేశామని మెట్రో అధికారులు ట్వీట్‌‌ చేశారు. ఉద్యోగ్‌‌ భవన్‌‌, పటేల్‌‌ చౌక్‌‌, సెంట్రల్‌‌ సెక్రటేరియట్‌‌, జన్‌‌పథ్‌‌ స్టేషన్లను కూడా మూసేశారు.

లా అండ్‌‌ ఆర్డర్‌‌ను అదుపులో ఉంచండి: కేజ్రీవాల్‌‌

నార్త్‌‌ ఈస్ట్‌‌ ఢిల్లీలో లా అండ్‌‌ ఆర్డర్‌‌‌‌ను పునరుద్ధరించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌‌ కేంద్రాన్ని కోరారు.  “ ఢిల్లీలోని శాంతి సామరస్యతలను దెబ్బతీసేలా జరుగుతున్న ఈ ఘటనలకు సంబంధించి వార్తలు చాలా బాధకలిగించాయి. లా అండ్ ఆర్డర్‌‌‌‌ను పునరుద్ధరించండి. ఆందోళనలు చేసేందుకు ఎవర్నీ అనుమతించవద్దు”అని ఢిల్లీ లెఫ్టినెంట్‌‌ గవర్నర్‌‌‌‌ అనిల్‌‌ బైజల్‌‌, కేంద్ర హోం మంత్రి అమిత్‌‌ షాకు విజ్ఞప్తి చేశారు.

ఢిల్లీ పోలీసులకు ఎల్‌‌జీ ఆదేశాలు

ఈ ఘటనపై లెఫ్టినెంట్‌‌ గవర్నర్‌‌‌‌ అనిల్‌‌ బైజల్‌‌ స్పందించారు. నార్త్‌‌ఈస్ట్‌‌లో లా అండ్‌‌ ఆర్డర్‌‌‌‌ పునరుద్ధరించాలని పోలీసులను ఆదేశించారు. శాంతిని కాపాడేందుకు ప్రతిఒకరు ఓపికతో వ్యవహరించాలని అన్నారు. పరిస్థితిని వెంటనే చక్కదిద్దాలని ఢిల్లీ పోలీస్‌‌ కమిషనర్‌‌‌‌ అమూల్య పట్నాయక్‌‌ను ఆదేశించారు. బాజర్‌‌‌‌పూర్‌‌‌‌ ఎమ్మెల్యే గోపాల్‌‌ రాయ్‌‌ కూడా దీనిపై స్పందించారు. కొందరు వ్యక్తులు శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టేందుకు ట్రై చేస్తున్నారని ట్వీట్‌‌ చేశారు. ఆందోళనలపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్పందించారు. నిరసనలు చేయడం వల్ల సాధారణ ప్రజలే ఇబ్బందులు పడతారని, శాంతియుతంగా నిరసన తెలియజేయాలని అన్నారు.

షాహీన్‌‌బాగ్‌‌ ప్రొటెస్ట్‌‌పై సీల్డ్‌‌ కవర్‌‌‌‌లో నివేదిక

షాహీన్‌‌బాగ్‌‌ ఆందోళనకారులతో మధ్యవర్తిత్వం వహించిన సభ్యులు అక్కడ జరుగుతున్న నిరసనలపై సీల్డ్‌‌ కవర్‌‌‌‌లో సుప్రీం కోర్టుకు సోమవారం నివేదిక అందించారు. అడ్వొకేట్‌‌ సాధనా రామచంద్రన్‌‌, సీనియర్‌‌‌‌ అడ్వొకేట్‌‌ సంజయ్‌‌ హెగ్డేలు తమ నివేదికలను జస్టిస్‌‌ జోషి కౌల్‌‌, కే.ఎం. జోసఫ్‌‌లతో కూడిన బెంచ్‌‌కు అందించారు. ఆ నివేదికపై బుధవారం విచారణ జరుపుతామని బెంచ్‌‌ చెప్పింది.

గాల్లోకి కాల్పులు జరిపిన వ్యక్తి

మౌజ్‌‌పూర్‌‌లో ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. పోలీసులపై కాల్పులు జరిపేందుకు వచ్చిన వ్యక్తి గాల్లో కొన్ని రౌండ్లు కాల్పులు జరిపాడని అధికారులు చెప్పారు. పోలీసుల లాఠీ చార్జ్‌‌కు నిరసనగా కొంత మంది ప్రొటెస్టర్లు మౌజాపూర్‌‌‌‌, భజాన్‌‌పురా, తదితర ప్రాంతాల్లో షాపులపై దాడి చేసి, ఇళ్లకు నిప్పుపెట్టారు. నెహ్రూ విహార్‌‌‌‌లోని ఆప్‌‌ కార్పొరేటర్‌‌‌‌ ఇంట్లోకి చొరబడ్డ ఆందోళనకారులు ఇంటికి నిప్పుపెట్టినట్లు తెలుస్తోంది.