గోల్డ్‌‌‌‌తో పారిస్‌‌‌‌కు.. ఇండియా హాకీ వీరుల డబుల్‌‌‌‌ ధమాకా

గోల్డ్‌‌‌‌తో పారిస్‌‌‌‌కు..  ఇండియా హాకీ వీరుల డబుల్‌‌‌‌ ధమాకా

హాంగ్జౌ:  ఆసియా గేమ్స్‌‌‌‌లో ఇండియా మెన్స్‌‌‌‌ హాకీ టీమ్‌‌‌‌ అద్భుతం చేసింది. ఒకే మ్యాచ్‌‌‌‌తో డబుల్‌‌‌‌ ధమాకా సాధించింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో ఇండియా 5–1తో డిఫెండింగ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌ జపాన్‌‌‌‌కు చెక్‌‌‌‌ పెట్టి గోల్డ్‌‌‌‌ మెడల్‌‌‌‌తో మెరిసింది. తద్వారా దాదాపు 9 ఏళ్ల తర్వాత పారిస్‌‌‌‌ ఒలింపిక్స్‌‌‌‌కు అర్హత సాధించింది. గేమ్స్‌‌‌‌లో టీమిండియాకు ఇది నాలుగో గోల్డ్‌‌‌‌ కావడం విశేషం. 1966, 1998, 2014లో ఇండియా స్వర్ణ పతకాలు నెగ్గింది. ఇండియా తరఫున హర్మన్‌‌‌‌ప్రీత్‌‌‌‌ (32, 59వ ని.) రెండు, మన్‌‌‌‌ప్రీత్‌‌‌‌ సింగ్‌‌‌‌ (25వ ని.) ఒక్క పెనాల్టీ గోల్‌‌‌‌ సాధించగా, అమిత్‌‌‌‌ రోహిడాస్‌‌‌‌ (36వ ని.), అభిషేక్‌‌‌‌ (48వ ని.) ఫీల్డ్‌‌‌‌ గోల్స్‌‌‌‌తో మెరిశారు. సెరెన్‌‌‌‌ తనకా (51వ ని.) జపాన్‌‌‌‌కు ఏకైక గోల్‌‌‌‌ అందించాడు. 

ఆట ఆరంభం నుంచి ఇరువైపు ఫ్లాంక్స్‌‌‌‌ వ్యూహాత్మకంగా కదులుతూ ఎదురుదాడికి సిద్ధమయ్యాయి. దీనికి తోడు లాంగ్‌‌‌‌ బాల్‌‌‌‌ లైన్‌‌‌‌ పర్ఫెక్షన్‌‌‌‌ కూడా ఇండియాకు బాగా కలిసొచ్చింది. అయితే 5వ నిమిషంలో వచ్చిన ఫస్ట్‌‌‌‌ చాన్స్‌‌‌‌ను లలిత్‌‌‌‌ ఉపాధ్యాయ్‌‌‌‌ వృథా చేసినా.. మిగతా టైమ్‌‌‌‌లో మాత్రం షార్ట్‌‌‌‌ పాస్‌‌‌‌లతో గోల్స్‌‌‌‌ చేసే అవకాశాలను సృష్టించుకుంది. అప్పటికే తీవ్ర ఒత్తిడికి లోనైన జపాన్‌‌‌‌ ఆఖరి 10 నిమిషాల్లో బ్యాక్‌‌‌‌ టు బ్యాక్‌‌‌‌ పెనాల్టీలను వృథా చేసుకుంది. ఇండియా తరఫున టాప్‌‌‌‌ గోల్‌‌‌‌ స్కోరర్లుగా కెప్టెన్‌‌‌‌ హర్మన్‌‌‌‌ప్రీత్‌‌‌‌ (13), స్ట్రయికర్‌‌‌‌ మన్‌‌‌‌దీప్‌‌‌‌ సింగ్‌‌‌‌ (12) నిలిచారు. ఓవరాల్​గా గేమ్స్​లో ఇప్పటి వరకు ఇండియా 95 (22 గోల్డ్​, 34 సిల్వర్​, 39 బ్రాంజ్​) మెడల్స్​తో నాలుగో ప్లేస్​లో ఉంది. 

‘గురి’ అదిరింది...

ఆర్చరీ రికర్వ్‌‌‌‌ టీమ్‌‌‌‌ విభాగంలో ఇండియా 13 ఏళ్ల తర్వాత మెడల్‌‌‌‌ గెలిచింది. శుక్రవారం జరిగిన మెన్స్‌‌‌‌ టీమ్‌‌‌‌ ఫైనల్లో అటాన్‌‌‌‌ దాసు-–తుషార్‌‌‌‌ షెల్కే-–ధీరజ్‌‌‌‌ బొమ్మదేవర 1-–5 (55–-60, 57–-57, 55–-56)తో లీ వుసియోక్‌‌‌‌-–ఓజిన్‌‌‌‌హెక్‌‌‌‌-–కిమ్‌‌‌‌ జి డియోక్‌‌‌‌ (సౌత్‌‌‌‌ కొరియా) చేతిలో ఓడి సిల్వర్‌‌‌‌ను సొంతం చేసుకుంది. విమెన్స్‌‌‌‌ రికర్వ్‌‌‌‌ టీమ్‌‌‌‌ బ్రాంజ్‌‌‌‌ మెడల్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో అంకిత్‌‌‌‌ భాకట్‌‌‌‌–సిమ్రన్‌‌‌‌జిత్‌‌‌‌ కౌర్‌‌‌‌–భజన్‌‌‌‌ కౌర్‌‌‌‌తో కూడిన ఇండియా త్రయం 6–2 (56–52, 55–56, 57–50, 51–48)తో డు ఎంగుయట్‌‌‌‌–ఎంగుయెన్‌‌‌‌ తన్హా–హోంగ్‌‌‌‌ పోంగ్‌‌‌‌ థావో (వియత్నాం)పై నెగ్గి బ్రాంజ్‌‌‌‌ మెడల్‌‌‌‌ను సాధించింది. 2010 గాంగ్జూ గేమ్స్‌‌‌‌ తర్వాత ఈ కేటగిరీలో ఇండియాకు మెడల్‌‌‌‌ రావడం ఇదే తొలిసారి. ఈ గేమ్స్‌‌‌‌లో ఇండియా రికార్డు స్థాయిలో ఇప్పటికే 8 మెడల్స్‌‌‌‌ సాధించింది. మెన్స్‌‌‌‌ కాంపౌండ్‌‌‌‌ ఇండివిడ్యువల్‌‌‌‌ కేటగిరీలో అభిషేక్‌‌‌‌ వర్మ, ఒజాస్‌‌‌‌ దియోతలే ఫైనల్లోకి ప్రవేశించారు. విమెన్స్‌‌‌‌లోనూ తెలుగమ్మాయి జ్యోతి సురేఖ వెన్నం కూడా టైటిల్‌‌‌‌ ఫైట్‌‌‌‌కు అర్హత సాధించింది. 

41 ఏళ్ల తర్వాత..

41 ఏళ్ల తర్వాత బ్యాడ్మింటన్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌లో ఇండియాకు పతకం లభించింది. మెన్స్‌‌‌‌ సెమీస్‌‌‌‌లో హెచ్‌‌‌‌.ఎస్‌‌‌‌. ప్రణయ్‌‌‌‌ 16–21, 9–21తో వరల్డ్‌‌‌‌ ఎనిమిదో ర్యాంకర్‌‌‌‌ లీ షెఫాంగ్‌‌‌‌ (చైనా) చేతిలో ఓడి కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. అయితే సయ్యద్‌‌‌‌ మోదీ తర్వాత గేమ్స్‌‌‌‌లో మెడల్‌‌‌‌ నెగ్గిన తొలి ప్లేయర్‌‌‌‌గా ప్రణయ్‌‌‌‌ రికార్డు సాధించాడు. ఢిల్లీ గేమ్స్‌‌‌‌ (1982)లో మోదీ బ్రాంజ్‌‌‌‌ మెడల్‌‌‌‌ను సాధించాడు. మెన్స్‌‌‌‌ డబుల్స్‌‌‌‌లో సాత్విక్‌‌‌‌–చిరాగ్‌‌‌‌ 21–17, 21–17తో ఆరోన్‌‌‌‌ చియా టెంగ్‌‌‌‌ ఫాంగ్‌‌‌‌–సో వుయి యిక్‌‌‌‌ (మలేసియా)పై గెలిచి ఫైనల్లోకి అడుగుపెట్టారు. ఫలితంగా కనీసం సిల్వర్‌‌‌‌ను ఖాయం చేసుకున్నారు. 

రెజ్లింగ్‌‌‌‌లో మరో మూడు బ్రాంజ్‌‌‌‌

భారీ అంచనాలతో బరిలోకి దిగిన స్టార్‌‌‌‌ రెజ్లర్‌‌‌‌ బజ్‌‌‌‌రంగ్‌‌‌‌ పూనియా ఖాళీ చేతులతో వెనక్కి వచ్చినా.. మిగతా రెజ్లర్లు బ్రాంజ్‌‌‌‌ మెడల్స్‌‌‌‌తో మెరిశారు. విమెన్స్‌‌‌‌ 65 కేజీల బ్రాంజ్‌‌‌‌ మెడల్‌‌‌‌ బౌట్‌‌‌‌లో సోనమ్‌‌‌‌ మాలిక్‌‌‌‌ 7–5తో చెన్‌‌‌‌ లాంగ్‌‌‌‌ జీ (చైనా)పై గెలిచింది. విమెన్స్‌‌‌‌ 76 కేజీ బౌట్‌‌‌‌లో కిరణ్‌‌‌‌ బిష్ణోయ్‌‌‌‌ 6–3తో గన్బత్ (మంగోలియా)ను చిత్తు చేసి కాంస్యాన్ని దక్కించుకుంది. మెన్స్‌‌‌‌ 57 కేజీల బ్రాంజ్‌‌‌‌ మెడల్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో అమన్‌‌‌‌ షెరావత్‌‌‌‌ 11–0తో లియు మింగ్‌‌‌‌ (చైనా)పై నెగ్గి బ్రాంజ్‌‌‌‌ను సాధించాడు. మెన్స్‌‌‌‌ 65 కేజీ బ్రాంజ్‌‌‌‌ మెడల్‌‌‌‌ బౌట్‌‌‌‌లో బజ్‌‌‌‌రంగ్‌‌‌‌ 0–10తో యమగుచి కైకి (జపాన్‌‌‌‌) చేతిలో చిత్తయ్యాడు. 

సెపక్‌‌‌‌తక్రాలో తొలి పతకం

విమెన్స్‌‌‌‌ సెపక్‌‌‌‌తక్రాలో ఇండియా తొలిసారి బ్రాంజ్‌‌‌‌ మెడల్‌‌‌‌ను గెలిచింది. అయెక్పామ్‌‌‌‌ మైపాక్‌‌‌‌ దేవి–ఓనమ్‌‌‌‌ చావోబా దేవి–ఖుష్బు–ఎలాంగ్బమ్‌‌‌‌ ప్రియా దేవి–ఎలాంగ్బమ్‌‌‌‌ లెరెంటోమి దేవితో కూడిన ఇండియా టీమ్‌‌‌‌ సెమీస్‌‌‌‌లో 10–21, 13–21తో డిఫెండింగ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌ థాయ్‌‌‌‌లాండ్‌‌‌‌ చేతిలో ఓడింది. గ్రూప్‌‌‌‌లో రెండో ప్లేస్‌‌‌‌తో ఇండియా సెమీస్‌‌‌‌కు అర్హత సాధించింది. సెమీస్‌‌‌‌లో ఓడిన టీమ్‌‌‌‌కు బ్రాంజ్‌‌‌‌ మెడల్‌‌‌‌ను ఇస్తారు. మరోవైపు బ్రిడ్జ్‌‌‌‌ గోల్డ్‌‌‌‌ మెడల్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో ఇండియా 152–238.1తో హాంకాంగ్‌‌‌‌ చేతిలో ఓడి రెండో స్థానంతో సిల్వర్​ను గెలిచింది.