తెలంగాణ కిచెన్ : రొటీన్ బ్రేక్​ఫాస్ట్​కి బ్రేక్..ఈ వంటలపై ఓ లుక్​ వేయండి

తెలంగాణ కిచెన్ : రొటీన్ బ్రేక్​ఫాస్ట్​కి బ్రేక్..ఈ వంటలపై ఓ లుక్​ వేయండి

ఇడ్లీ, దోశ, పూరీ, వడ.. బ్రేక్​ ఫాస్ట్​ రోజూ ఇవే తిని బోర్​ కొడుతుంది. ఈ ఎండలకి.. నూనెతో చేసిన వంటలు తినాలంటే కష్టం. ఇలాంటి కంప్లయింట్స్ ప్రతి ఇంట్లో వినిపించేవే. బ్రేక్​ఫాస్ట్​ బోర్​ కొట్టకుండా వెరైటీగా చేసుకోవాలంటే ఈ వంటలపై ఓ లుక్​ వేయండి.

ఆలు శాండ్​విచ్

కావాల్సినవి :

ఆలుగడ్డలు - రెండు
బీన్స్ తరుగు - ఒక కప్పు
ఉల్లిగడ్డ తరుగు - ఒక కప్పు
కరివేపాకు, కొత్తిమీర - కొంచెం
గోధుమపిండి - పావు కప్పు
క్యారెట్ తురుము - ఒక కప్పు
శనగపిండి - పావు కప్పు
నూనె - సరిపడా
అల్లం పేస్ట్ - ఒక టీస్పూన్
ఆవాలు, జీలకర్ర - ఒక్కోటి అర టీస్పూన్
కారం - ఒక టేబుల్ స్పూన్
ఉప్పు - సరిపడా
నీళ్లు - ముప్పావు కప్పు
పసుపు - పావు టీస్పూన్

తయారీ :  నూనె వేడి చేసి అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేగించాలి. తర్వాత ఉల్లిగడ్డ తరుగు, అల్లం పేస్ట్​ వేసి వేగించాక, బీన్స్ తరుగు, క్యారెట్ తురుము ఒక్కోటిగా వేయాలి. మూతపెట్టి మూడు నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత ఆలుగడ్డల్ని తొక్క తీసి సన్నగా తురమాలి. నీళ్లు పోసి బాగా కడగాలి. నీటిని పిండేసి తురుమును వేరే గిన్నెలో వేయాలి. అందులో గోధుమ పిండి, శనగపిండి, వేగించిన బీన్స్, క్యారెట్ మిశ్రమం వేయాలి. వీటితో పాటు కారం, పసుపు, ఉప్పు వేసి, నీళ్లు కొంచెం కొంచెంగా పోస్తూ కలపాలి. నూనె వేడి చేసి కలుపుకున్న మిశ్రమాన్ని పెనం మీద దోశలా పరవాలి. మూతపెట్టి కాసేపు ఉడికించాలి. తర్వాత చాకుతో నాలుగు ముక్కలుగా కట్ చేయాలి. ఆ ముక్కలన్నీ రెండోవైపు తిప్పాలి. ఐదు నిమిషాల తర్వాత పెనం మీద నుంచి తీయాలి. ఒక ముక్క మీద టొమాటో  కెచప్​ పూసి  దానిపై  మరో ముక్క పెడితే శాండ్​ విచ్ రెడీ. 

స్టఫ్డ్​ బ్రెడ్​ 

కావాల్సినవి :

బ్రెడ్ స్లైస్​లు - నాలుగు
నూనె - ఒక టేబుల్ స్పూన్
ఉల్లిగడ్డ తరుగు - ఒక కప్పు
ఉప్పు - సరిపడా
పచ్చిమిర్చి - ఒకటి
కోడిగుడ్లు - రెండు
అల్లం + వెల్లుల్లి పేస్ట్ - ఒక టీస్పూన్
పసుపు - పావు టీస్పూన్
కారం - ఒక టీస్పూన్
గరం మసాలా - ఒక టీస్పూన్
టొమాటో కెచప్ - రెండు టేబుల్ స్పూన్లు

తయారీ : నూనె వేడి చేసి ఉల్లి గడ్డ, పచ్చిమిర్చి తరుగు, ఉప్పు వేసి వేగించాలి. అందులో అల్లం + వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, గరం మసాలా, టొమాటో కెచప్ కలిపితే స్టఫింగ్ రెడీ. ఒక గిన్నెలో కోడిగుడ్ల సొన, ఉప్పు, కారం, పసుపు, కొత్తిమీర వేసి బాగా కలపాలి. బ్రెడ్ స్లైస్​ల చివర్లు కట్ చేయాలి. ఆ ముక్కల్ని గుండ్రటి గిన్నెతో రౌండ్​గా కట్ చేయాలి. కట్​ చేసిన ముక్కల్లో స్టఫింగ్​ పెట్టి, దాన్ని మరో బ్రెడ్​తో మూసేయాలి. వాటిని ఎగ్ మిశ్రమంలో ముంచాలి. నూనె వేడి చేసి బ్రెడ్​ ముక్కల్ని వేసి రెండు వైపులా వేగించాలి. 

ఆలుగడ్డ రవ్వ ఇడ్లీ

కావాల్సినవి :

బొంబాయి రవ్వ, పెరుగు, నీళ్లు - ఒక్కో కప్పు చొప్పున
నూనె - రెండు టీస్పూన్లు
ఆవాలు - అర టీస్పూన్
జీలకర్ర - పావు టీస్పూన్
కరివేపాకు - కొంచెం
ఉల్లిగడ్డ తరుగు - ఒక కప్పు
అల్లం + వెల్లుల్లి పేస్ట్ - అర టీస్పూన్
పచ్చిమిర్చి - ఒకటి
ధనియాల పొడి, కారం, జీలకర్ర పొడి - ఒక్కోటి అర టీస్పూన్
పసుపు, గరం మసాల, బేకింగ్ సోడా - ఒక్కోటి పావు టీస్పూన్
ఆలుగడ్డలు (ఉడికించి) - రెండు 
ఉప్పు - సరిపడా

తయారీ :  నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేగించాలి. తర్వాత ఉల్లిగడ్డ తరుగు వేయాలి. అది వేగాక అల్లం, వెల్లుల్లి పేస్ట్​, పచ్చిమిర్చి తరుగు వేగించాలి. పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి కలపాలి. ఉడికించిన ఆలుగడ్డలు తొక్క తీసి, మెత్తగా మెదపాలి. ఆ మిశ్రమాన్ని కూడా పాన్​లో వేయాలి. కొత్తిమీర, ఉప్పు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని చేత్తో పొడవుగా, ముద్దలా చేయాలి. బొంబాయి రవ్వ, పెరుగు, నీళ్లు వేసి బాగా కలిపి, దానిపై మూతపెట్టి పదినిమిషాలు పక్కనపెట్టాలి. అందులో కొంచెం ఉప్పు వేసి కలపాలి. తర్వాత ఒక స్టీల్ టీ గ్లాస్​లో పిండి వేసి, అందులో ఆలూ స్టఫింగ్​ పెట్టి పైన మరికొంచెం పిండి వేసి కవర్ చేయాలి. ఇలా నాలుగు గ్లాసులు రెడీ చేయాలి. ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసి, ఇడ్లీ ప్లేట్ పెట్టాలి. ఆ ప్లేట్​లో ఈ గ్లాస్​లను పెట్టి మూతపెట్టాలి. పది నిమిషాలు ఉడికాక కాసేపు ఆరనిచ్చి చాకుతో అంచులను లూజ్ చేసి బోర్లించాలి. నూనె వేడి చేసి పసుపు, కారం, ఉప్పు, కొత్తిమీర వేగించాలి. అందులో ఇడ్లీలను వేసి కలపాలి. 

స్టఫ్డ్​ చపాతి

కావాల్సినవి :

 గోధుమ పిండి - రెండు కప్పులు, ఉప్పు - సరిపడా, నెయ్యి - ఒక టేబుల్ స్పూన్
నూనె - రెండు టీస్పూన్లు, సోంఫు, గరం మసాలా - ఒక్కోటి అర టీస్పూన్
ఉల్లిగడ్డలు - రెండు, అల్లం + వెల్లుల్లి పేస్ట్​ - ఒక టీస్పూన్ 
కొత్తిమీర, కరివేపాకు - కొంచెం, పసుపు - పావు టీస్పూన్, కారం - ఒక టీస్పూన్
క్యారెట్​లు - రెండు, ఆలుగడ్డ - ఒకటి

తయారీ : ఒక గిన్నెలో గోధుమ పిండి, నెయ్యి, ఉప్పు వేసి నీళ్లు పోస్తూ పిండి కలపాలి. ముద్దలా అయ్యాక నూనె వేసి మరోసారి బాగా కలపాలి. సోంఫు, ఉల్లిగడ్డ తరుగు నూనె వేగించాలి. తర్వాత పచ్చిమిర్చి తరుగు, అల్లం + వెల్లుల్లి పేస్ట్​, కరివేపాకు వేగించాలి. అందులో పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా కలపాలి. ఆ తర్వాత క్యారెట్ తురుము, ఆలుగడ్డ తురుము కలపాలి. కాసేప య్యాక కొత్తిమీర చల్లి, మళ్లీ ఒకసారి కలపాలి. గోధుమ పిండి ముద్దను చిన్న ఉండలు చేయాలి. వాటిని చపాతీల్లా వత్తి, అందులో రెడీ చేసిన స్టఫింగ్ పెట్టాలి. చివర్లు మూసేసి, చేత్తో వత్తాలి. పాన్​లో నీళ్లు పోసి, ఒక స్టాండ్ పెట్టాలి. ఇడ్లీ ప్లేట్​కి నూనె పూసి అందులో ​స్టఫ్డ్​ చపాతీలు పెట్టాలి. ఆ ప్లేట్​ని పాన్​లో ఉన్న స్టాండ్​ మీద పెట్టాలి. దానిమీద మూతపెట్టి కాసేపు ఉడికించాలి. పాన్​లో నూనె వేడి చేసి ఉడికించిన స్టఫ్డ్​ చపాతీలను రెండువైపులా వేగించాలి.

ఎగ్ వేఫర్స్

కావాల్సినవి :

గోధుమ పిండి - రెండు కప్పులు
ఉప్పు - సరిపడా
నూనె - రెండు టీస్పూన్లు
జీలకర్ర - అర టీస్పూన్
పచ్చిమిర్చి - ఒకటి 
కరివేపాకు - కొంచెం
ఉల్లిగడ్డ తరుగు - ఒక కప్పు
అల్లం + వెల్లుల్లి పేస్ట్ - ఒక టీస్పూన్
పసుపు - పావు టీస్పూన్
కారం, గరం మసాలా - ఒక్కోటి అర టీస్పూన్
ఆలుగడ్డలు (ఉడికించి) - రెండు
కార్న్​ ఫ్లోర్ - పావు కప్పు
కోడిగుడ్లు - రెండు

తయారీ : గిన్నెలో గోధుమ పిండి, ఉప్పు వేసి నీళ్లు పోసి చపాతీ పిండి ముద్దలా కలపాలి. నూనె వేడి చేసి జీలకర్ర, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు, ఉల్లిగడ్డ తరుగు, అల్లం + వెల్లుల్లి పేస్ట్ ఒక్కోటిగా వేస్తూ వేగించాలి. పసుపు, కారం, గరం మసాలా, ఉప్పు కలపాలి. ఆలుగడ్డలు ఉడికించి, తొక్క తీసి మెదిపి ఇందులో వేయాలి. కొత్తిమీర చల్లాలి. ఆ తర్వాత తయారుచేసిన పిండి ముద్దను ఉండలుచేసి చపాతీలు చేయాలి. చపాతీలో సగానికి స్టఫింగ్​ పూసి, రెండో సగంతో మూసేయాలి. వాటిని వేడి పెనం మీద రెండు వైపులా కాల్చాలి. తరువాత వాటిని ముక్కలు కట్ చేయాలి. ఒక గిన్నెలో కార్న్​ఫ్లోర్ వేసి అందులో కోడిగుడ్ల సొన వేయాలి. కొంచెం పసుపు, కారం, ఉప్పు వేసి బాగా కలపాలి. కరివేపాకు, కొత్తిమీర తరుగు కలపాలి. కట్ చేసిన చపాతీ ముక్కల్ని ఈ మిశ్రమంలో ముంచాలి. పాన్​లో నూనె వేడి చేసి వీటిని రెండు వైపులా వేగించాలి.