‘ఫిక్స్​ ఇట్’​ ఆన్ లైన్  సేవలు 

‘ఫిక్స్​ ఇట్’​ ఆన్ లైన్  సేవలు 

ఎక్కడికైనా వెళ్లాలంటే.. ఉన్నచోటు నుంచే బైక్​లు, ఆటోలు, కార్లు బుక్​ చేసుకుంటున్నాం. బట్టలు, ఇతరత్రా ఇంటి, వంట సామాన్లని ఒక్క క్లిక్​తోనే ఇంటికి  తెప్పించుకుంటున్నాం. అచ్చం అలానే కరెంట్​ పనికి, ఇంటి ఫ్లోర్​ క్లీనింగ్​కి, పగిలిన పైపుల్ని రిపేర్​ చేయడానికి ఆన్​లైన్​ ద్వారా వర్కర్స్​ని పంపితే? ఈ ఆలోచన నుంచి వచ్చిందే ‘ఫిక్స్​ ఇట్’​. దీన్ని నడుపుతోంది ఇరవై ఏండ్ల మహ్మద్​ అబ్దుల్​ గఫూర్​.

రెండేండ్ల  కిందట అబ్దుల్​ ఒక్కడితో మొదలైన ‘ఫిక్స్​ ఇట్’​లో ప్రస్తుతం డెబ్భై మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. ఇంటి నాలుగ్గోడల మధ్య మొదలైన ఈ స్టార్టప్​ ఇప్పుడు కేరళలోని మలప్పురం,  కోజికోడ్​, పాలక్కాడ్​ జిల్లాల్లోనూ సర్వీస్​లు అందిస్తోంది. నెలకి ముప్పై లక్షలకి పైగా ఆదాయం తెచ్చుకుంటున్న మహ్మద్​ను ‘ఈ బిజినెస్​ ఎలా నడుపుతున్నావు?’  అని అడిగితే?  ‘నేను పుట్టి, పెరిగిన పరిసరాలే నన్ను బిజినెస్​ వైపు నడిపించాయ’ని అంటాడు. 

పదహారేండ్లకే  మొదటి స్టార్టప్​

అబ్దుల్​ పుట్టింది కేరళలోని మలప్పురం జిల్లా కొందోట్టిలో అయినప్పటికీ.. పదో క్లాస్ వరకు దుబాయి​లో చదువుకున్నాడు. ఆ తర్వాత తల్లిదండ్రులతో పాటు సొంత ఊరికి షిఫ్ట్​ అయ్యాడు. అబ్దుల్ తండ్రి ఇండియాకి వచ్చాక సొంతంగా హార్డ్​ వేర్​ షాపు పెట్టాడు. దాంతో తండ్రిని చూస్తూ బిజినెస్​ స్కిల్స్​ నేర్చుకున్నాడు అబ్దుల్​​.  తండ్రి షాపుకొచ్చే కస్టమర్స్​ కాంటాక్ట్స్​ తీసుకొని.. వాళ్లకి ఇంటి, వంట సామాన్లని సప్లయ్​ చేసే ఓ చిన్న స్టార్టప్​ మొదలుపెట్టాడు. అప్పటికి అతని వయసు పదహారేండ్లు. ఆ బిజినెస్​ పుంజుకుంటున్న టైంలోనే కరోనా, లాక్​డౌన్​  వల్ల బ్రేక్​ వచ్చింది.

ఆ ఆలోచన వచ్చింది

లాక్​డౌన్​ టైంలో అబ్దుల్​ వాళ్ల ఇంట్లోని  నీళ్ల పైపు  ఒకటి  పాడైంది. ఆ టైంలో అబ్దుల్​ క్వారెంటైన్​లో ఉన్నాడు. అతని​ తండ్రి సిటీకి దూరంగా ఉన్నాడు. దాంతో వాళ్ల అమ్మ చుట్టుపక్కలున్న ప్లంబర్లు అందరికీ ఫోన్​ చేసింది. కానీ, ఎవరూ  రెస్పాండ్​ కాలేదు. దాంతో రెండుమూడు రోజుల పాటు వాటర్​ లీకేజ్​తో ఇబ్బంది పడ్డారు. అప్పుడే ప్లంబింగ్, ఎలక్ట్రీషియన్​ వర్క్​, ఫ్లోర్​ క్లీనింగ్​, గార్డెనింగ్.. లాంటి పనుల కోసం వర్కర్స్​ని సప్లయ్​ చేయడానికి ఓ స్టార్టప్​ పెట్టాలనుకున్నాడు. అందుకోసం మొదటిగా చుట్టుపక్కల ఆ పనులు చేస్తున్న వాళ్లని కాంటాక్ట్​ అయ్యాడు. వాళ్లకి తన బిజినెస్​ మోడల్ వివరించాడు. ఒక సిమ్​ కార్డు తీసుకొని.. ఇంటిముందు ఆ నెంబర్​ని బ్యానర్​ కట్టించాడు. అలా ఐదువేల రూపాయల పెట్టుబడితో ‘ ఫిక్స్​ ఇట్​’ ని మొదలుపెట్టాడు. 

అయితే స్టార్టప్​ పెట్టిన కొత్తలో నెల మొత్తంలో నలుగురు కస్టమర్స్​ మాత్రమే వచ్చారు. అయినా నిరుత్సాహపడలేదు. సిటీలోని మరికొన్ని చోట్ల తన సర్వీస్​ గురించి బ్యానర్స్​ కట్టాడు. మెల్లిగా కస్టమర్ల సంఖ్య పెరిగింది. దాంతో ఆఫీసు తెరిచాడు. కస్టమర్స్​ అవసరాలను అర్థం చేసుకోవడానికి ఉద్యోగులను పెట్టుకున్నాడు. ఎలక్ట్రీషియన్స్​, పంబ్లర్స్​.. ఇలా రకరకాల ఫీల్డ్స్​కి సంబంధించిన 300 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు ప్రస్తుతం ఫిక్స్​ ఇట్​లో. 

యాప్​ తీసుకొస్తున్నాం

ఎవరైనా కస్టమర్​ ఫిక్స్​ ఇట్​ని కాంటాక్ట్​ అయితే.. వాళ్ల అవసరాన్ని బట్టి వర్కర్​ని​ సెలక్ట్​ చేస్తారు. అయితే ఇక్కడ కస్టమర్​, వర్కర్​ నేరుగా మాట్లాడుకోరు. ఫిక్స్​ ఇట్​​ పంపిన లొకేషన్​ ద్వారా కేవలం ఎనిమిది నిమిషాల్లో వర్కర్,​ కస్టమర్​ ఇంటికి వెళ్తాడు. కస్టమర్​ తన టైం వెసులుబాటుని బట్టి వర్కర్​ని బుక్​ చేసుకోవచ్చు కూడా. పని చేయించుకున్న గంటల్ని బట్టి  వాళ్లు​ డబ్బులు చెల్లించాలి. ప్రస్తుతం నెలకి ముప్పై లక్షల టర్నోవర్​తో నడుస్తోంది ఈ స్టార్టప్​. రానున్న రోజుల్లో ఈ ​ సేవల్ని మరింత విస్తరిస్తా అంటున్నాడు ఇంజినీరింగ్​​ చదువుతున్న అబ్దుల్​. అందుకోసం ఓ యాప్​ని కూడా తెస్తాడట. మొదట్లో నన్ను, నా బిజినెస్​ని ఎవరూ సీరియస్​గా తీసుకోలేదు. కారణం నా వయసు.  నా బిజినెస్​ ఐడియా  చుట్టుపక్కల వర్కర్స్​కు చెప్పినప్పుడు.. ‘ఇదంతా అయ్యే పనికాదం’టూ కొట్టిపడేశారు. వేరే బిజినెస్​ ఓనర్స్​  ‘ఇవన్నీ నీకెందుకు?’ అంటూ మాట్లాడారు. అయినా వెనకడుగేయలేదు. ఒక పక్క చదువుకుంటూనే బిజినెస్​పైనా ఫోకస్​ పెట్టా. ఆ ప్రయత్నమే ఈరోజు ఇక్కడి వరకు తీసుకొచ్చింది. స్టేట్​ లెవల్​ గ్లోబల్​ స్టూడెంట్​ అవార్డు కూడా అందుకున్నా అని చెప్పాడు అబ్దుల్​.