అర్జెంటీనా విజయంతో కోల్కతాలో అభిమానుల సంబరాలు

అర్జెంటీనా విజయంతో కోల్కతాలో అభిమానుల సంబరాలు

 ఫిఫా వరల్డ్ కప్ ను అర్జెంటీనా అందుకుని విశ్వ విజేతగా నిలిచింది. ఫైనల్ పోరు హోరాహోరీగా సాగినా మేస్సీ మ్యాజిక్ తో ఆ జట్టును విజయ తీరాలకు చేర్చాడు. అర్జెంటీనా విజయం సాధించడంతో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సంబరాలు అంబరాన్ని అంటాయి. మెస్సీ అభిమానులు కోల్ కతాలో పటాకులు కాల్చి అర్జెంటీనా జెండాలను చేతపట్టుకుని.. కేక్ కట్ చేసి నృత్యాలు చేశారు. బ్లూ అండ్  వైట్ కలర్ టీ షర్టులు వేసుకున్న అర్జెంటీనా మద్దతుదారుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మెస్సీ..మెస్సీ అంటూ కేరింతలు కొట్టారు. 

అర్జెంటీనా మద్దతుదారులు, తమ అభిమాన జట్టు ప్రపంచకప్ ఫైనల్‌ మ్యాచ్ లో గెలిచిన తర్వాత కొందరు కన్నీళ్లు పెట్టుకున్నారు. మరికొందరు ఒకరినొకరు కౌగిలించుకొని స్వీట్లు పంచుకుని సంతోషం వ్యక్తం చేశారు. ఫుట్ బాల్  ఫైనల్ మ్యాచ్ కోసం కమ్యూనిటీ హాళ్లు,క్లబ్ లలో భారీ స్క్రీన్లు ఏర్పాటు చేసి మ్యాచ్ ను వీక్షించారు. అర్జెంటీనా చరిత్రాత్మక విజయం సాధించడంతో అభిమానులు ఆనందోత్సవాలతో ఉర్రూతలూగిపోయారు. పెనాల్టీ షూటవుట్లో అర్జెంటీనా ఆటగాళ్లు వరుసగా 4 సార్లు గోల్ పోస్టులోకి బంతిని తరలించగా.... ఫ్రాన్స్ రెండుసార్లు విఫలమైంది. అర్జెంటీనా గోల్ కీపర్ అద్భుతంగా బంతిని అడ్డుకుని జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. 

వరల్డ్ కప్ చరిత్రలో అర్జెంటీనాకు ఇది మూడో టైటిల్. ఆ జట్టు గతంలో 1978, 1986లో ప్రపంచవిజేతగా నిలిచింది. వరల్డ్ కప్ గెలిచి కెరీర్ కు వీడ్కోలు పలకాలన్న మెస్సీ కల ఘనంగా నెరవేరింది. ఈ టోర్నీలో విజేతగా నిలిచిన అర్జెంటీనాకు రూ.347 కోట్ల భారీ ప్రైజ్ మనీ లభించింది. రన్నరప్ ఫ్రాన్స్ రూ.248 కోట్లు అందుకుంది.