ఫ్లెష్‌‌ ఈటింగ్‌‌ బ్యాక్టీరియా.. వానాకాలంలో మరింత భద్రం

ఫ్లెష్‌‌ ఈటింగ్‌‌ బ్యాక్టీరియా.. వానాకాలంలో మరింత భద్రం

నెక్రోటైజింగ్ ఫాసిటిస్ అంటే శరీరంలోని కండరాలు, చర్మం, మెత్తటి కణజాలాన్ని చంపే ఇన్ఫెక్షన్. ఈ బ్యాక్టీరియల్‌‌ ఇన్ఫెక్షన్ వేగంగా బాడీ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. సోకిన కొన్ని గంటల్లోనే శరీరంలోని చాలా భాగాలకి విస్తరిస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ సోకడానికి రీజన్‌‌ స్ట్రెప్టోకాకస్ బ్యాక్టీరియా. అందులోనూ ‘గ్రూప్ ఎ స్ట్రెప్టోకాకస్ చాలా డేంజర్‌‌. దీంతో పాటు క్లెబసెల్లా, క్లొస్ట్రిడియం, ఎక్చరిషియా ఇ కొలె, స్టెఫైలోకాకస్ ఆరస్ వంటి బ్యాక్టీరియాలు కూడా ఈ ఇన్ఫెక్షన్‌‌కి దారితీస్తాయి. మాంసాన్ని కొద్ది కొద్దిగా తింటాయి కాబట్టే ఈ బ్యాక్టీరియాలను ‘ఫ్లెష్ ఈటింగ్ బ్యాక్టీరియా (మాంసాన్ని తినే బ్యాక్టీరియా)’లు అంటారు. మన దేశంలో నెక్రోటైజింగ్ ఫాసిటిస్ కేసులు చాలా అరుదుగా నమోదు అవుతుంటాయి. కాకపోతే వర్షాకాలంలో ఇది ఎక్కువ విజృంభిస్తుంది. కరోనా ఎఫెక్ట్‌‌తో ఈ ఇన్ఫెక్షన్‌‌కి విరుగుడు డ్రగ్స్‌‌ తయారీ ఆగిపోయింది. అందుకే కేసుల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉందని హెచ్చరిస్తోంది డాక్టర్‌‌ డోర్కస్‌‌.

చిన్నగాయమే, కానీ..

నెక్రోటైజింగ్ ఫాసిటిస్ సోకడానికి చిన్నగాయం చాలు. గాయం పచ్చిగా ఉంటే.. బ్యాక్టీరియాలు లోపలికి తొందరగా ప్రవేశిస్తాయి. గాయాలను నిర్లక్ష్యం చేయడం, అదే సమయంలో పరిశుభ్రత పాటించకపోవడం రెండూ ఇన్ఫెక్షన్‌‌కి కారణం. శరీరంలోకి ప్రవేశించే ‘ఫ్లెష్ ఈటింగ్ బ్యాక్టీరియా’.. శరీర కణజాలాన్ని తింటూ పోతుంది. ఈ క్రమంలో బ్యాక్టీరియా నుంచి విషపూరితమైన కెమికల్స్‌‌ రిలీజ్‌‌ అవుతాయి. అవి శరీర కణాలను చంపేస్తాయి. అంతేకాదు బ్యాక్టీరియా కారణంగా రక్తనాళాలు కూడా దెబ్బతింటాయి. దీంతో రక్తం సరఫరా నిలిచిపోతుంది. దీనివల్ల అక్కడి కణజాలం దెబ్బతినడంతో పాటు శరీర భాగాలకు రక్తసరఫరా ఆగిపోతుంది. ఫ్లెష్‌‌–ఈటింగ్ డిసీజ్‌‌ శరీరంలోని సాఫ్ట్ టిష్యూస్‌‌ను తొందరగా చంపేస్తుంది. ఈ ఇన్ఫెక్షన్‌‌ సడన్‌‌గా స్ప్రెడ్‌‌ అయ్యి ఎఫెక్ట్‌‌ చూపెడుతుంది. మోచేతులు, మోకాళ్ల నుంచి ఇది ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. కాలినప్పుడు, లేదా ఏదైనా కోసుకున్నప్పుడు అయ్యే చిన్నగాయమైనా సరే ఈ ఇన్ఫెక్షన్‌‌కి కారణం అవుతుంది.

ట్రీట్‌‌మెంట్‌‌ ఉంది

‘నెక్రోటైజింగ్ ఫాసిటిస్’ ఇన్ఫెక్షన్ చాలా ప్రమాదకరం. బ్యాక్టీరియా సోకిన కొద్ది గంటల్లోనే పరిస్థితి ప్రమాదకరంగా మారుతుంది. ఇన్ఫెక్షన్ సోకిన భాగాల్లో విడుదలయ్యే కెమికల్స్‌‌.. రక్త ప్రసరణ వ్యవస్థ ద్వారా శరీరమంతా వ్యాపించడంతో ఇతర ఆర్గాన్స్‌‌ దెబ్బతింటాయి. ఒక్కోసారి పేషెంట్స్‌‌ కోమాలోకి కూడా వెళ్లే ఛాన్స్‌‌ ఉంటుంది. కాబట్టి ఇన్ఫెక్షన్‌‌ను వెంటనే గుర్తించి ట్రీట్‌‌మెంట్ తీసుకుంటే క్యూర్‌‌ అవుతుంది. ఇన్ఫెక్షన్‌‌ ముదిరితే సర్జరీ చేసి కండరాల్ని, టిష్యూస్‌‌ను తీసేయొచ్చు. అదే టైంలో రిలీఫ్‌‌ కోసం యాంటీ-బ్యాక్టీరియల్ ఔషధాల్ని కూడా ఎక్కిస్తారు. అయితే ఇన్ఫెక్షన్ సోకి.. దెబ్బతిన్న భాగాలకు ట్రీట్‌‌మెంట్ చేయడం ఎంతమాత్రం సాధ్యం కాదు. ఎందుకంటే టిష్యూస్‌‌ అప్పటికే చనిపోయి ఉంటాయి. అందువల్ల కొన్ని సార్లు ఇన్ఫెక్షన్ సోకిన అవయవాన్ని మొత్తంగా తొలగిస్తారు. సర్జరీలో చర్మాన్ని తొలగించాల్సి ఉంటుంది. అందుకే ఆ ప్లేస్‌‌లో ఇతర భాగాలపై (ముఖ్యంగా తొడలపై) చర్మాన్ని తీసుకుని రీప్లేస్‌‌ చేస్తారు.

క్లీన్లీనెస్‌ లేకపోతేనే..

డ్రైనేజీ పొల్యూషన్‌‌, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోకపోవడం, ఆస్పత్రుల దగ్గరి అపరిశుభ్ర వాతావరణం వల్ల ‘ఫ్లెష్ ఈటింగ్ బ్యాక్టీరియా’ త్వరగా వ్యాపిస్తుంది. ముఖ్యంగా డ్రైనేజీ వాటర్‌‌ వల్ల ఈ బ్యాక్టీరియా త్వరగా విస్తరిస్తుంది. సిటీ, టౌన్‌‌లలో చాలా చోట్ల వానాకాలంలో డ్రైనేజీలు పొంగి పొర్లుతుంటాయి. ఆ నీరు ఒక్కోసారి మంచి నీటి పైప్‌‌లైన్లతో కలిసి నీటిని కలుషితం చేస్తాయి. హాస్పిటల్స్‌‌ దగ్గర ఇంజెక్షన్లు, సూదులు, దూది అక్కడే పడేయడం వల్ల ప్రమాదకరమైన స్ట్రెప్టోకాకస్ బ్యాక్టీరియా తయారవుతుంది.

ఇమ్యూనిటీ ఎఫెక్ట్‌‌

నిజానికి ఈ ఇన్ఫెక్షన్‌‌ అందరికీ సోకే ఛాన్స్‌‌ ఉన్నప్పటికీ.. కొందరిపై మాత్రమే ప్రభావం చూపెడుతుంది. హెల్దీగా ఉండేవాళ్లకు నెక్రోటైజింగ్ ఫాసిటిస్ సోకే ఛాన్స్‌‌ తక్కువ. ఇమ్యూనిటీ తక్కువ ఉండేవాళ్లపై ఇది త్వరగా ఎఫెక్ట్ చూపెడుతుంది. షుగర్‌‌, లిక్కర్.. స్మోకింగ్‌‌ అలవాటు ఉన్నవాళ్లకు(ఇమ్యూనిటీ పవర్‌‌ తక్కువ ఉండటమే కారణం) డేంజర్‌‌ ఎక్కువ. పోషకాహారం తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.

లక్షణాలివే

‘ఫ్లెష్ ఈటింగ్ బ్యాక్టీరియా’ ఇన్పెక్షన్ సోకిన వెంటనే చర్మంపై చిన్న పాటి కురుపులు, దద్దుర్లు వస్తాయి. చెమట పట్టడం, వాంతులు, జ్వరం, తీవ్రమైన నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి. చర్మం రంగు ఎరుపు, లేదా పర్పుల్‌‌ రంగులోకి మారుతుంది. ఈ బ్యాక్టీరియా చాలా వేగంగా విస్తరించే లక్షణం ఉండడం వల్ల.. కొద్ది గంటల్లోనే ఇన్ఫెక్షన్ లక్షణాలు పెరిగిపోతాయి. ఇన్ఫెక్షన్ సోకిన ప్రాంతంలో వాపు వస్తుంది. మెల్లగా చర్మం, దాని కింద కణజాలం నల్లగా మారిపోతుంటుంది. విపరీతంగా నొప్పి ఉంటుంది.

శుభ్రతే ముఖ్యం!

‘ఫ్లెష్ ఈటింగ్ బ్యాక్టీరియా’కి మాత్రమే కాదు.. చాలా రకాల బ్యాక్టీరియాలు, వైరస్ ల ఇన్ఫెక్షన్లకు కారణం శుభ్రత లేకపోవడం. అందుకే చిన్నగాయమైనా పూర్తిగా మానిపోయే వరకు జాగ్రత్తగా ఉండాలి. వాటిని ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ, మందులు వాడాలి. కేవలం నీటితోనే శుభ్రపర్చుకోకుండా.. సబ్బు, యాంటీ బ్యాక్టీరియల్ హ్యాండ్ వాష్ వంటివి వినియోగించడం మేలు. వానాకాలంలో మంచి నీరు కలుషితం అవుతుంటుంది. నీటిని తరచూ కాచి, వడబోయడం లేదంటే ఫిల్టర్‌‌లు, ఫ్యూరిఫైయర్లు వాడాలి. బయటికెళ్లినప్పుడు, ముఖ్యంగా హాస్పిటల్స్‌‌కి వెళ్లి వచ్చాక చేతులు, కాళ్లను శుభ్రంగా కడుక్కోవాలి. పర్సనల్ హైజీన్‌‌తో పాటు ఈ వానాకాలంలో ఇంటి పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం