అమెజాన్, ఫ్లిప్‌‌కార్ట్ మధ్య ఫెస్టివల్ వార్!

అమెజాన్, ఫ్లిప్‌‌కార్ట్ మధ్య ఫెస్టివల్ వార్!


బెంగళూరు:  పండగ  సీజన్‌‌ను సొమ్ము చేసుకోవడానికి ఆన్‌‌లైన్ షాపింగ్ కంపెనీలు రంగంలోకి దూకాయి. మనదేశంలో అతిపెద్ద ఈ–కామర్స్ కంపెనీలు అమెజాన్, ఫ్లిప్‌‌కార్ట్‌‌లు వచ్చే నెల మొదటివారంలో ఫెస్టివల్ సేల్స్ ప్రకటించాయి.  డిస్కౌంట్లు, జీరో ఈఎంఐలు, క్యాష్‌‌ బ్యాక్‌‌లతో షాపర్లను ఆకట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాయి.  అమెజాన్ ఇండియా తన ఫ్లాగ్‌‌షిప్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌‌ను అక్టోబర్ మూడో తేదీ నుంచి నిర్వహించనుంది.  ఫ్లిప్‌‌కార్ట్ కూడా బిగ్ బిలియన్ డేస్ పేరుతో సేల్‌‌ను ఇదే తేదీల్లో తెస్తోంది. ఫ్లిప్‌‌కార్ట్  అక్టోబర్ 7 నుంచి సేల్ స్టార్ట్ చేయాలని మొదట అనుకుంది కానీ అమెజాన్ కంటే వెనుకబడతామనే ఆలోచనతో డేట్లను మార్చింది. అమెజాన్ సేల్ లో 8.50 లక్షల మంది సెల్లర్లు పాల్గొంటారు. రకరకాల కేటగిరీలలో 1,000 ప్రొడక్ట్ లాంచ్‌‌ అవుతాయని అమెజాన్ ప్రకటించింది.  ఫ్లిప్‌‌కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్ సేల్‌‌ని ఆరు రోజులు బదులుగా ఎనిమిది రోజుల పాటు నిర్వహిస్తోంది. ఈ ఈవెంట్ అక్టోబర్ 10 న ముగుస్తుంది. సేల్ ఈవెంట్ ముగింపు తేదీని అమెజాన్ ఇంకా ప్రకటించలేదు. కిందటి ఏడాది ఫ్లిప్‌‌కార్ట్ ఫెస్టివల్ సేల్ అక్టోబర్ 16 న ప్రారంభించగా, అమెజాన్  అక్టోబర్ 17 న మొదలుపెట్టింది. ఫెస్టివల్ సేల్ మొదటివారంలో కంపెనీలకు భారీగా ఆర్డర్లు వస్తాయి. 

దాదాపు రూ.66 వేల కోట్ల విలువైన ఆర్డర్లు...

కరోనా కేసులు చాలా తక్కువగా ఉండటం, ఎకానమీ పుంజుకోవడం, ఖరీదైన ఎలక్ట్రానిక్స్ వస్తువులు కొనడానికి జనం రెడీ కావడంతో ఈసారి ఫెస్టివల్ సేల్ ఆన్‌‌లైన్ షాపింగ్ కంపెనీలకు కాసుల వర్షం కురిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్కెట్ రీసెర్చ్ సంస్థ రెడ్‌‌సీర్ కన్సల్టింగ్ అంచనాల ప్రకారం, ఈసారి ఆన్‌‌లైన్ -కామర్స్ సంస్థలు 4.8 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.35,500 కోట్లు) విలువైన ప్రొడక్టులను సేల్ మొదటి వారంలోనే అమ్ముతాయి.  2020లో జరిగిన అమ్మకాల విలువతో పోలిస్తే ఇది 30 శాతం ఎక్కువ. గత సంవత్సరం పండుగ అమ్మకాల మొదటి వారంలోనే గ్రాస్ మర్చండైజ్ వాల్యూ (జీఎంవీ) లో దాదాపు  3.7 బిలియన్ డాలర్లను సంపాదించుకున్నాయి.  2020 లో ఫెస్టివల్ సేల్ సమయంలో ఆన్‌‌లైన్ -కామర్స్ ప్లాట్‌‌ఫామ్‌‌లలో అమ్ముడైన వస్తువుల మొత్తం జీఎంవీ 7.4 బిలియన్ డాలర్లు. ఈ సంవత్సరం మొత్తం అమ్మకాలు 23 శాతం పెరిగి  9 బిలియన్‌‌ డాలర్లకు (రూ.66 వేల కోట్లు) పెరుగుతాయని రెడ్‌‌సీర్ అంచనా వేసింది. 

ప్రైమ్ మెంబర్లు ముందే ఆర్డర్ ఇవ్వొచ్చు..

"కస్టమర్లు, అమ్మకందారుల ప్రయోజనాలు మాకు చాలా ముఖ్యం. దేశంలోని లక్షలాది మంది చిన్న సెల్లర్లలు,  పదివేల మంది లోకల్ స్టోర్లు అమెజాన్ ద్వారా ప్రొడక్టులను అమ్ముతాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ వచ్చే నెల 3 నుండి ప్రారంభమవుతుంది.  ఎప్పటిలాగే, ప్రైమ్ మెంబర్‌‌లకు ఒకరోజు ముందే ఫెస్టివల్ సేల్ కు యాక్సెస్ ఉంటుంది " అని అమెజాన్ ప్రతినిధి  చెప్పారు.  ఫ్లిప్‌‌కార్ట్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కళ్యాణ్ కృష్ణమూర్తి బిగ్ బిలియన్ డేస్ సేల్ తేదీల మార్పు గురించి ఇంటర్నల్ మెమో ద్వారా ఉద్యోగులకు సమాచారం పంపించారు. "కస్టమర్లు తమ డబ్బుకు తగ్గ విలువను, క్వాలిటీని కోరుకుంటారని మాకు తెలుసు. వారి అవసరాలను తీర్చడానికి బిగ్ బిలియన్ డేస్ సేల్ నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం లక్షలాది మంది సెల్లర్లు మాతో చేరారు.  వారిలో చాలా మందికి, బిగ్ బిలియన్ డేస్ చాలా  ముఖ్యం. ఎందుకంటే మహమ్మారి కారణంగా సెల్లర్ల వ్యాపారాలు కుదేలయ్యాయి" అని కృష్ణమూర్తి చెప్పారు. ఫ్లిప్‌‌కార్ట్‌‌కు డిసెంబర్ నాటికి 4.20 లక్షల మంది సెల్లర్లు ఉన్నారు.  తమకు 8.50 లక్షల మంది సెల్లర్లు ఉన్నారని అమెజాన్ తెలిపింది.