
- రెండు రాష్ట్రాల్లో 16 మంది మృతి
సిమ్లా/ న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గురువారం రాత్రి ఉత్తరాఖండ్‌లో కురిసిన కుండపోత వర్షానికి కొండచరియలు విరిగిపడి 12 మంది చనిపోగా, ఆరు గురు గాయపడ్డారు. చనిపోయిన వారిలో ముగ్గురు ఒకే ఫ్యామిలీ వారున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో చాలా గ్రామాలు నీట మునిగాయి.
పలుచోట్ల ఇండ్లు దెబ్బతినడంతో వందల మంది నిరాశ్రయులయ్యారు. హరిద్వార్, తెహ్రీ, చమోలీ ప్రాంతాల్లో భారీగా ఆస్తినష్టం జరిగింది. హరిద్వార్ జిల్లాలో ఆరుగురు, తెహ్రీలో ముగ్గురు, డెహ్రడూన్‌లో ఇద్దరు, చమోలీలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.
50 మంది గల్లంతు..
హిమాచల్‌ప్రదేశ్‌ను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. వరదలకు గురువారం నలుగురు చనిపోగా దాదాపు 50 మంది గల్లంతయ్యారు. వందల సం ఖ్యలో ఇండ్లు ధ్వంసమయ్యాయి. పలుచోట్ల కొండ చరియలు విరిగి పడడంతో ట్రాఫిక్ స్తంభించింది. బ్రిడ్జీలు కొట్టుకుపోయి పలు గ్రామాలకు రాక పోకలు నిలిచిపోయాయి. రాంపూర్ ఏరియాలో వరదలకు ఇద్దరు చనిపోగా 30 మంది అదృశ్యమయ్యారు.