నిజాంసాగర్కు మళ్లీ పెరిగిన వరద

నిజాంసాగర్కు మళ్లీ పెరిగిన వరద

కామారెడ్డి జిల్లా: నిజాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం మళ్లీ పెరిగింది. గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. తాజాగా ఇవాళ ఉదయం 9 గంటల సమయంలో వరద ప్రవాహం 22వేల క్యూసెక్కులు దాటింది. వర్షాలు కొనసాగుతుండడం.. ఎగువన నది పరివాహక ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఉండడంతో వరద మరింత పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో అధికారులు అప్రమత్తమై డ్యామ్ వద్ద మూడు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల ప్రారంభించారు.

నిజామ్ సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటి విడుదలను పెంచడానికి ముందు అధికారులు నది పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. వర్షాల వల్ల నదిలో వరద పెరుగుతోందని.. పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని హెచ్చరికలు చేశారు. కాగా నిజామ్ సాగర్ కు 22వేల 400 క్యూసెక్కుల వరద వస్తుండగా.. 22వేల 400 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. డ్యామ్ ఇప్పటికే గరిష్ట స్థాయికి చేరుకోవడంతో.. వస్తున్న వరదను నిల్వ చేసే అవకాశం లేక వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు విడుదల చేస్తున్నారు.

కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

నిజామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతుండడంతో అధికారులు విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు. వరద ప్రవాహానికి అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు.  ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1405 అడుగులు కాగా.. ప్రస్తుతం డ్యాంలో నీటిమట్టం 1404 అడుగులు ఉంది. అలాగే నీటి సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 16.357 టీఎంసీల నీటి నిల్వను కొనసాగిస్తున్నారు.