రాజమండ్రిలో గోదావరి ఉగ్రరూపం.. గంట గంటకూ పెరుగుతున్న వరద ఉధృతి

రాజమండ్రిలో గోదావరి ఉగ్రరూపం.. గంట గంటకూ పెరుగుతున్న  వరద ఉధృతి

రాజమండ్రి వద్ద మళ్లీ గోదావరి వరద ఉగ్ర రూపం దాల్చింది. గంట గంటకు స్వల్పంగా నీటిమట్టం పెరుగుతుంది. ఈరోజు ఆదివారం (జులై 23) సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుందని రాజమండ్రిలోని అన్ని స్నాన ఘట్టాలు గేట్లు మూసివేశారు అధికారులు. ఎవరూ నదిలోకి వెళ్లకుండా ఘాట్ల వద్ద బారికేడ్లతో పోలీసుల గస్తీ ఏర్పాటు చేశారు. ఎగువన విలీన మండలల్లోనూ, దిగువన అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని 22 లంక గ్రామాలను వరదనీరు చుట్టు ముట్టింది. రహదారులు నీట మునిగి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.

గోదావరికి వరద ఉధృతి పెరుగుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. భద్రాచలం వద్ద నీటిమట్టం 43.2  ( వార్త రాసే సమయానికి) అడుగులు ఉండగా.. పోలవరం వద్ద 11.6( వార్త రాసే సమయానికి)  మీటర్లకు నీటిమట్టంకు చేరుకుంది. అలాగే.. ధవళేశ్వరం వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 7.89 లక్షల క్యూసెక్కులు( వార్త రాసే సమయానికి) ఉండగా.. ఇవాళ్టి నుంచి ( జులై 23 నుంచి) ధవళేశ్వరం వద్ద వరద ఉధృతి పెరగనున్నట్లు అధికారులు వెల్లడించారు. బుధవారం ( జులై 26) వరకు స్వల్పంగా వరద ప్రవాహం పెరుగుతుందని, కాటన్ బ్యారేజి వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక వరకు చేరే అవకాశం ఉందని తెలిపారు. విపత్తుల సంస్థలోని స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు.. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అయితే.. గోదావరి వరద ఉధృతి అంతకంతకు పెరుగుతుండటంతో.. ఎగువ ప్రాంతాల నుండి భారీ స్థాయిలో గోదావరిలోకి వరదనీరు చేరడంతో పోలవరం ప్రాజెక్టు అధికారులు అప్రమత్తమయ్యారు.