
- అన్ని శాఖల అధికారులు ప్రణాళికతో పాటు సమన్వయంతో ముందుకెళ్లాలి
- రాష్ట్ర రెవెన్యూ (విపత్తు నిర్వహణ) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్
ఏటూరు నాగారం, వెలుగు: వానాకాలంలో వచ్చే ముంపు విపత్తులను ఎదుర్కొనేందుకు అధికారులు ప్లాన్ తో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర రెవెన్యూ(విపత్తు నిర్వహణ) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ సూచించారు. మంగళవారం ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం వద్ద సమ్మక్క సాగర్ బ్యారేజ్ పనితీరు, నిర్వహణను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
అనంతరం ఏటూరునాగారం ఐటీడీఏ మీటింగ్ లో హాల్ లో కలెక్టర్, పీవో, ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) జి. మహేందర్, ఎన్డీఆర్ఎఫ్ డిప్యూటీ కమాండెంట్ దామోదర్ తో కలిసి వరదల ముంపు నివారణకు తీసుకోవాల్సిన ముందస్తు ప్లాన్, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, సహాయక చర్యలు తీసుకోవడం వంటి అంశాలపై సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేశారు.
స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్ మాట్లాడుతూ.. గతంలోని వరద ముంపు ఇబ్బందులు పునరావృతం కాకుండా చూడాలని పేర్కొన్నారు. వరదలతో తలెత్తే విపత్తులను ఎదుర్కోడానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడంతో పాటు పునరావాస కేంద్రాలను ముందుగానే సిద్ధం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఐటీడీఏ పీవో చిత్ర మిశ్రా, జిల్లా ఇరిగేషన్ అధికారి అప్పల నాయుడు, ఆర్డీఓ వెంకటేశ్, ఏపీవో వసంతరావు, అగ్నిమాపక, ఆర్ డబ్ల్యూఎస్, అగ్రికల్చర్, సివిల్ సప్లై, విద్యుత్, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.