
హాలియా, వెలుగు : శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి నాగార్జునసాగర్‌కు వరద రాక కొనసాగుతోంది. ఎగువ నుంచి 1,45,076 క్యూసెక్కుల నీరు సాగర్‌కు వస్తోంది. దీంతో సాగర్ 22 గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి 1,70,808 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు (312.0450 టీఎంసీలు) కాగా, ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు వరకు 586.80 అడుగుల (304.4680 టీఎంసీల) నీరు చేరింది. సాగర్ నుంచి కుడికాల్వకు 6,006 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 3,667, ఏఎమ్మార్పీకి 2,400, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 28,204 క్యూసెక్కులు కలిపి మొత్తం 2,11,885 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.