అస్సాంలో వరద బీభత్సం..20 జిల్లాల్లో 6.71 లక్షల మందిపై ప్రభావం 

అస్సాంలో వరద బీభత్సం..20 జిల్లాల్లో 6.71 లక్షల మందిపై ప్రభావం 
  •     13 మంది మత్స్యకారులను కాపాడిన ఐఏఎఫ్
  •     నీటమునిగిన కజిరంగా నేషనల్ పార్క్‌‌

గువహటి : అస్సాంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో బ్రహ్మపుత్ర నదితో సహా రాష్ట్రంలోని 13 ప్రధాన నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. ఆరు రోజులుగా కురుస్తున్న అతి భారీ వర్షాలతో, వరదలతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దాంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. రాష్ట్రంలోని దాదాపు 20 జిల్లాల్లో 6.71 లక్షల మందిపై వరదలు ప్రభావం చూపాయి. దిబ్రూగఢ్ జిల్లాలోని సాండ్‌‌బార్ ఏరియాలో 13 మంది మత్స్యకారులు వరదలో చిక్కుకుపోయారు.

అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌‌మెంట్ అథారిటీ (ఏఎస్డీఎంఏ) రిక్వెస్ట్ తో రంగంలోకి దిగిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్(ఐఏఎఫ్)13 మందిని కాపాడింది. ధేమాజీ జిల్లాలోని జోనై ఏరియాలో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తూ వరదలో చిక్కుకున్న 8 మంది స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్డీఆర్ఎఫ్) సిబ్బందిని కూడా ఐఏఎఫ్ కాపాడింది. గడిచిన 24 గంటల్లో వరదలకు ఒకరు చనిపోయారని ఏఎస్డీఎంఏ మంగళవారం వెల్లడించింది. ఈ మృతితో ఈ ఏడాది వరదలు, తుపాను, కొండచరియలు విరిగిపడటంతో మరణించిన వారి సంఖ్య 46కి పెరిగిందని తెలిపింది.

ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని చెప్పింది. మొత్తం 72 సహాయక శిబిరాల్లో 8,142 మంది ఆశ్రయం పొందుతున్నారని వివరించింది. కాచర్, బార్‌‌పేట, బొంగైగావ్, దిబ్రూగఢ్​, జోర్హాట్, గోలాఘాట్, మజులి, లఖింపూర్‌‌లలో 614 మంది ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, ఆర్మీ సిబ్బంది, ఎస్డీఆర్ఎఫ్, పోలీసు బలగాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని తెలిపింది.

కజిరంగా పార్క్‌‌లో 4 జింకలు మృతి

వరద బీభత్సానికి కజిరంగా నేషనల్ పార్క్‌‌ దెబ్బతిన్నది. మంగళవారం నాలుగు జింకలు చనిపోయాయి.  మరో 24 జంతువులను రక్షించామని పార్క్ అధికారులు వెల్లడించారు. కాపాడినవాటిని  సురక్షితమైన ప్రాంతానికి తరలించామన్నారు. ఈస్ట్రన్ అస్సాం వైల్డ్ లైఫ్ డివిజన్​లోని 167 క్యాంపులు ఇప్పటికే వరద నీటితో మునిగిపోయాయని చెప్పారు. పార్క్ గుండా రాకపోకలపై నిషేధం విధించినట్లు వివరించారు. 

గుజరాత్‌‌లోనూ.. 

గుజరాత్‌‌లోనూ మూడు రోజులుగా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. జునాగఢ్ జిల్లాలో దాదాపు 30 గ్రామాలకు వెళ్లే రహదారులు నీట మునిగాయి. గడిచిన 24 గంటల్లో జునాగఢ్ జిల్లాలోని వంతలిలో 362 మి.మీ. వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. రాష్ట్ర దక్షిణ ప్రాంతంలోని పది తాలూకాల్లోనూ 200 మి.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందని.. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయని వివరించారు. వరదల కారణంగా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.