కుండపోత వానలు, ఆకస్మిక వరదల ధాటికి పాకిస్తాన్ ఆగమాగం

కుండపోత వానలు, ఆకస్మిక వరదల ధాటికి పాకిస్తాన్ ఆగమాగం

న్యూఢిల్లీ: కుండపోత వానలు, ఆకస్మిక వరదల ధాటికి పాకిస్తాన్ ఆగమాగం అయింది. దాదాపు సగం దేశం నీట మునిగింది. జూన్ నుంచి ఇప్పటిదాకా 1,350 మంది చనిపోయారు. 50 లక్షల మంది నిరాశ్రయులుగా మిగిలారు. 900 పశువులు మృత్యువాత పడ్డాయి. 10 లక్షల ఇండ్లు కొట్టుకుపోయాయి. 40 రిజర్వాయర్ల కట్టలు తెగినయి. 90 శాతం పంటలు నాశనం అయ్యాయి. మొత్తంగా పాక్ కు10 బిలియన్ డాలర్ల నష్టం జరిగింది. అయితే, పాక్ ఇంతగా కనీవినీ ఎరుగని స్థాయిలో వరదల తాకిడికి గురవ్వడానికి.. రెండు నెలలుగా కురిసిన భారీ వర్షాలతోపాటు హిమాలయాల్లోని గ్లేసియర్లు విపరీతంగా కరిగిపోవడం కూడా కారణమేనని రీసెర్చర్లు చెప్తున్నారు. గ్లోబల్ వార్మింగ్ కారణంగా హిమాలయాల్లోని గ్లేసియర్లు భారీగా కరిగిపోతున్నాయని, ఫలితంగా గ్లేసియల్ లేక్ అవుట్ బరస్ట్ ఫ్లడ్స్ వెల్లువెత్తుతున్నాయని అంటున్నారు. ఇటీవల పాక్ లో భారీ వర్షాలు, వరదలతో సింధూ నది పోటెత్తింది. దీనికి తోడు హిమాలయాల్లోని గ్లేసియర్లు కూడా కరిగి పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో అటు వర్షపు నీళ్లు.. ఇటు గ్లేసియర్ల నీళ్లు కలిపి పాక్ ను ముంచేశాయని పేర్కొంటున్నారు.

వేగంగా కరుగుతున్న గ్లేసియర్లు 

గ్లోబల్​ వార్మింగ్​తో హిమాలయ పర్వతాల్లో హిమానీ నదాలు(గ్లేసియర్లు) శరవేగంగా కరిగిపోతున్నాయి. సైంటిస్టులు ఊహించిన దాని కన్నా ఎక్కువ వేగంగా గ్లేసియర్లు కరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం హిమానీ నదాలు కరుగుతున్న పరిమాణం(డిశ్చార్జి) పెరిగిపోతున్నదని సైంటిస్టులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.  

గ్లోబల్ వార్మింగ్ వల్లే.. 

మహాసముద్రాలు, సముద్రాల్లో నీటి మట్టం పెరగడం, ఇటీవల చైనాలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొనడం, ఇండియాలో వచ్చిన హీట్​వేవ్​లు, పాక్​లో సంభవించిన వరదల వంటివి గ్లోబల్ వార్మింగ్​వల్ల జరిగిన నష్టాలేనని సైంటిస్టులు చెప్తున్నారు. హీట్​వేవ్​ వల్ల యూరప్​లోని ఆల్ప్స్​ పర్వత శ్రేణుల్లో కూడా మంచు వేగంగా కరుగుతోందని వారు వెల్లడించారు.