రూరల్లో సబ్బులు , షాంపూల అమ్మకాలు పుంజుకుంటాయ్

రూరల్లో సబ్బులు , షాంపూల అమ్మకాలు పుంజుకుంటాయ్

న్యూఢిల్లీ: రూరల్​ ఏరియాలలో సబ్బులు, షాంపూలు వంటి ప్రొడక్టుల అమ్మకాలు మూడో క్వార్టర్లో పుంజుకుంటాయని ఎఫ్​ఎంసీజీ (ఫాస్ట్​ మూవింగ్​ కన్జూమర్​ గూడ్స్​) కంపెనీలు అంచనా వేస్తున్నాయి. ఫలితంగా తమ మార్జిన్లు మెరుగుపడతాయని ఆశలు పెట్టుకుంటున్నాయి. ఇన్​ఫ్లేషన్ ఒకింత ఎక్కువగానే ఉండటంతో సెప్టెంబర్ ​క్వార్టర్లో ఈ కంపెనీలు మార్జిన్ల విషయంలో  కొంత ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. పండగల సీజన్​ మొదలవడంతోపాటు, రుతుపవనాలు బాగుండటంతో పంటలు బాగా పండుతాయని, దీంతో రూరల్​ ఏరియాలలో తమ ప్రొడక్టులకు డిమాండ్​ ఊపందుకుంటుందనేది ఎఫ్​ఎంసీజీ కంపెనీల నమ్మకం. 

అన్ని కంపెనీలదీ అదే పరిస్థితి...

జులై–సెప్టెంబర్​ మధ్య కాలంలో హెచ్​యూఎల్, ఐటీసీ, డాబర్​, నెస్లే, టాటా కన్జూమర్​, బ్రిటానియా, మారికో వంటి లిస్టెడ్​ ఎఫ్​ఎంసీజీ కంపెనీలు మార్జిన్ల విషయంలో ఇబ్బంది పడ్డాయి. రేట్ల పెరుగుదల ఎఫెక్ట్​ వినియోగంపై పడటంతో సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు ఆ కంపెనీలు పేర్కొన్నాయి. పామ్​, ఖోప్రా వంటి కమోడిటీల రేట్లు కొంత తగ్గుముఖం పట్టడంతో ఈ క్వార్టర్లో తమ గ్రాస్​ మార్జిన్లు మెరుగుపడతాయని ఎఫ్​ఎంసీజీ కంపెనీలు  ఆశిస్తున్నాయి. రేట్లు ఎక్కువగా ఉండటంతో సెప్టెంబర్​ క్వార్టర్లో ఈ కంపెనీల ఆదాయం​ పెరిగింది. అయితే కొన్ని సెగ్మెంట్లలో మాత్రం బ్రిటానియా, డాబర్​, నెస్లే వంటి కంపెనీలు సేల్స్​ వాల్యూమ్​నూ పెంచుకోగలిగాయి.

రిటెయిల్ ఇన్​ఫ్లేషన్​ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వరసగా నాలుగో క్వార్టర్లోనూ సేల్స్​ వాల్యూమ్​ తగ్గినట్లు మారికో వెల్లడించింది. డిమాండ్​ అంతకు ముందు క్వార్టర్లలోలాగే నెమ్మదిగా ఉందని, సెప్టెంబర్​ క్వార్టర్లోని చివరి నెలలో మాత్రమే కొంత ఊపందుకుని కూడా ఈ కంపెనీ వివరించింది. పారాచూట్ ​బ్రాండ్​ పేరుతో హెయిర్​ అండ్​ కేర్​ ప్రొడక్టులను మారికో విక్రయిస్తోంది. క్యూ 3 నుంచి గ్రాస్​ మార్జిన్లు మెరుగుపడతాయనే ఆశాభావాన్ని ఈ కంపెనీ వ్యక్తం చేస్తోంది. జులై–సెప్టెంబర్​ క్వార్టర్లో మారికో నికర లాభం 3 శాతం తగ్గి రూ. 307 కోట్లకు చేరింది. మరోవైపు అత్యధిక క్వార్టర్లీ రెవెన్యూ సాధించిన బ్రిటానియా కూడా ఇన్​ఫ్లేషన్ ఎఫెక్ట్​ పడుతోందనే పేర్కొంది. ఫ్లోర్​, మిల్క్​ ప్రొడక్టుల ఇన్​ఫ్లేషన్​ను ప్రత్యేకంగా ఈ కంపెనీ ప్రస్తావించింది. గుడ్​డే, టైగర్​, న్యూట్రిఛాయిస్​, మిల్క్​బికిస్​, మేరీ గోల్డ్​ వంటి ప్రొడక్టులను బ్రిటానియా కంపెనీ విక్రయిస్తోంది. బ్రిటానియా కంపెనీకి సెప్టెంబర్​ క్వార్టర్లో నికర లాభం 28.5 శాతం పెరిగింది. ఈ క్వార్టర్లో కంపెనీకి రూ. 490.58 కోట్ల నికరలాభం వచ్చింది. ఇదే టైములో మొత్తం రెవెన్యూ కూడా 21.40 శాతం గ్రోత్​తో రూ. 4,379.61 కోట్లుగా రికార్డయింది.

ఇన్​ఫ్లేషన్​ ఎఫెక్టే....

ఇన్​ఫ్లేషన్​ పెరుగుదలతో మార్కెట్లో సవాళ్లనే ఎదుర్కొంటున్నట్లు మరో ఎఫ్​ఎంసీజీ కంపెనీ డాబర్​  వెల్లడించింది. రూరల్ ఏరియాలలో ఈ ఎఫెక్ట్​ బాగా కనబడుతోందని, అక్కడ అమ్మకాలు పెరగడం లేదని డాబర్​ సీఈఓ మోహిత్ మల్హోత్రా చెప్పారు. ఇన్​ఫ్లేషన్​ ఎఫెక్ట్​ వినియోగంపై ఉందని మరో ఎఫ్​ఎంసీజీ కంపెనీ హెచ్​యూఎల్​  కూడా పేర్కొంది. కొన్ని కమోడిటీల రేట్లు దిగి రావడంతో ఈ క్వార్టర్​ నుంచి పరిస్థితులు మెరుగుపడొచ్చని హెచ్​యూఎల్​ సీఈఓ సంజీవ్​ మెహతా చెప్పారు. రుతుపవనాలు బాగుండటంతోపాటు, ప్రభుత్వం, రిజర్వ్​ బ్యాంకు తీసుకున్న చొరవ కారణంగా రాబోయే నెలల్లో వినియోగం జోరందకుంటుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.