పెండింగ్ ​పనులపై ఫోకస్!

పెండింగ్ ​పనులపై ఫోకస్!
  • అడిగిందే తడువుగా ఫండ్స్​ శాంక్షన్​
  • కొత్త మండలాల ఏర్పాటుకూ చర్యలు
  • ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు చకచక కదులుతున్న పెండింగ్ ఫైల్స్​​

కామారెడ్డి, వెలుగు: వచ్చే ఎన్నికల్లోనూ గెలిచి మూడోసారి అధికారం చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్న అధికార బీఆర్ఎస్, తమపై ఉన్న ప్రతికూలతలను అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఏండ్లుగా పెండింగ్​లో ఉన్న పనులను పూర్తి చేసేందుకు ప్రాధాన్యమిస్తోంది. కామారెడ్డి జిల్లాలో సీఎం కేసీఆర్​ పోటీ చేయనున్న నేపథ్యంలో పెండింగ్​లో ఉన్న పనులను స్పీడప్​ చేయడంతో పాటు, కొత్తగా పనులు చేపట్టేందుకు ఫండ్స్​కూడా రిలీజ్ చేస్తున్నారు. స్థానిక  ప్రజాప్రతినిధులు అడిగిందే తడువుగా, ఫండ్స్​ శాంక్షన్​ చేస్తూ జీవోలు జారీ చేస్తున్నారు. ఎంతో కాలంగా కోరుతున్న కొత్త మండలాల  ఏర్పాటుకు గ్రీన్​సిగ్నల్ ​ఇస్తున్నారు. 

తాగునీటి పైపులైన్​కు భారీగా నిధులు

కామారెడ్డి నియోజకవర్గంతో పాటు, ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని కొన్ని ఏరియాలకు తాగునీటిని అందించేందుకు కాంగ్రెస్ ​హయాంలో వాటర్​ స్కీమ్​పనులు ప్రారంభించారు. ఎస్సారెస్పీ, జలాల్​పూర్​నుంచి ఇన్​వెల్​టెక్ ద్వారా నీటిని తీసుకొని తాగునీటిని సప్లయ్​ చేయాలని భావించారు. ఇందుకోసం జలాల్​పూర్ ​నుంచి కామారెడ్డి వరకు మెయిన్​ పైప్​లైన్ ​వేశారు. ప్రస్తుతం దాన్ని మిషన్​భగీరథకు అనుసంధానం చేశారు. 

దశాబ్దాల కింద వేసిన మెయిన్​ పైప్​లైన్​ తరచుగా పలిగిపోతుంది. దీంతో కామారెడ్డి టౌన్​తో పాటు, పలు గ్రామాలకు తాగునీటికి ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ లైన్​మార్పు కోసం కొద్దిరోజుల కింద స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్​ ప్రభుత్వ పెద్దలకు విన్నవించగా, 46 కిలోమీటర్ల మెయిన్ ​పైప్​లైన్ ​మార్చేందుకు రూ.195 కోట్లు శాంక్షన్​ చేశారు. ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది.

మహ్మద్​నగర్​ మండలం ఏర్పాటు దిశగా..

జిల్లాలో 22 మండలాలు ఉండగా కొన్ని రోజుల క్రితం కొత్తగా డోంగ్లీ, పాల్వంచలను మండలాలుగా  ఏర్పాటు చేశారు. జుక్కల్​ నియోజకవర్గంలోని నిజాంసాగర్ ​మండలంలో ఉన్న మహ్మద్ నగర్​ను మండలంగా ఏర్పాటు చేయాలని స్థానికులు కోరారు. స్థానిక ఎమ్మెల్యే హన్మంత్​షిండే ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లగా 18 గ్రామాలతో మహ్మద్​నగర్​మండల ఏర్పాటుకు ప్రభుత్వం ఆగస్టు 28న ముసాయిదా నోటిఫికేషన్ ​జారీ చేసింది.  అభ్యంతరాల కోసం 15 రోజుల గడువు ఇచ్చారు. త్వరలోనే మహ్మద్​నగర్ మండల ఏర్పాటుకు జీవో జారీ కానుంది. బాన్సువాడ నియోజకవర్గంలోని హన్మాజీపేటను మండలంగా ఏర్పాటు చేయాలని కొన్ని నెలల కింద ప్రపోజల్ ​వెళ్లాయి. ప్రస్తుతం ఇది పెండింగ్​లో ఉంది. 

ALSO READ:చేపల వలలో కొండ చిలువ

దోమకొండలో 100 బెడ్స్​ హాస్పిటల్​

 కామారెడ్డి నియోజకవర్గంలోని దోమకొండ లో 30 బెడ్స్​ సీహెచ్​సీ ఉంది. దీన్ని 100 బెడ్స్​కు మార్చాలని స్థానికంగా డిమాండ్​చేస్తున్నారు. ఇటీవల స్థానిక ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్​తో పాటు, హెల్త్ మినిస్టర్​ను కలిసినప్పుడు ఈ విషయాన్ని గుర్తు చేశారు. హెల్త్​డిపార్ట్​మెంట్​కు కూడా ప్రపోజల్స్ ​వెళ్లాయి. సీహెచ్​సీ స్థాయి పెంపుపై త్వరలోనే  జీవో వస్తోందని స్థానిక లీడర్లు చెబుతున్నారు. ఇటీవల స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్, పార్టీ జిల్లా ప్రెసిడెంట్​ ముజీబోద్దీన్ ​సీఎం కేసీఆర్​తో భేటీలోనూ పెండింగ్​ పనులపై చర్చ జరిగినట్లు సమాచారం. జుక్కల్​నియోజకవర్గంలోనూ రోడ్లు, కల్వర్టుల కోసం ప్రభుత్వం ఇటీవల రూ.90 కోట్ల ఫండ్స్​శాంక్షన్​ చేసింది.