బడ్జెట్‌ దళారులకు ఉపయోగపడేలా ఉండొద్దు

బడ్జెట్‌ దళారులకు ఉపయోగపడేలా ఉండొద్దు
  • పేదలు, సామాన్యుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేలా ఉండాలి
  • సమాజంలో శాంతి.. సంతోషం వెలసిల్లేందుకు దోహదపడేలా బడ్జెట్ రూపొందించాలి

వస్తున్న ఆదాయాన్ని శాస్త్రీయంగా అంచనా వేసి వాస్తవాలకు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్ ను రూపొందించాలి. విద్య, ఆరోగ్యం, సాగునీరు, తాగునీరు, ఆవాసాలు, ఉపాధి కల్పనకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ, మన రాష్ట్రంలో బడ్జెట్ రూపకల్పన అందుకు విరుద్ధంగా సాగుతోంది. ఉత్పాదక రంగంపై కాకుండా అనుత్పాదక రంగంపై ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు వ్యయం చేస్తోంది. దీని వల్ల కొద్ది మంది దళారీలు, దోపిడీ వర్గాలకు లాభం జరగవచ్చేమో గానీ, మెజార్టీ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుకావడం అసాధ్యం. ఇప్పటికైనా వాస్తవాలకు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్ను రూపొందించాలి. బడ్జెట్ను శాస్త్రీయంగా ప్రకటించడంతోపాటు కేటాయించిన నిధుల్లో 90--–95 శాతం వ్యయం చేసేలా అంచనాలు వేయాలి.

ఈ నెల 18న రాష్ట్ర ప్రభుత్వం 2021–-22 స్టేట్ బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతోంది. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందే ఆర్థికమంత్రి ఈ బడ్జెట్ గతేడాదికంటే 20 శాతం తగ్గే అవకాశం ఉందని ప్రకటించారు. గతంలో ప్రవేశపెట్టిన బడ్జెట్లను పరిశీలించినా ఏటా 20 శాతం ఆదాయం తగ్గిపోతూనే ఉంది. 2020–-21లో ఆమోదించిన బడ్జెట్ రూ.1,82,914 కోట్లు, అందులో రూ.36,582 కోట్లు తగ్గుతుందని అధికారికంగానే ప్రకటిస్తున్నారు. 18న రివైజ్డ్ బడ్జెట్లో ఇంత మొత్తం తగ్గించి చూపడం ఖాయం. అకౌంటెంట్ జనరల్ ఆడిట్ చేయని లెక్కల ప్రకారం.. గత ఏడాది బడ్జెట్లో జనవరి 2021 నాటికి(ఫిబ్రవరి, మార్చి వ్యయాలు కలపలేదు) రెవెన్యూ ఆదాయం అంచనా రూ.1,43,152 కోట్లు. అయితే రూ.74,991 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. ఇది ఆదాయ అంచనాలో 52.40 శాతమేనని నివేదిక చెబుతున్నది. వచ్చిన ఆదాయంలో అప్పుల కింద రూ.12,735 కోట్లు చెల్లించారు. రెవెన్యూ వ్యయం కింద రూ.48,690 కోట్లు, వేతనాల కింద రూ.20,144 కోట్లు, పెన్షన్లకు రూ.9,249 కోట్లు, సబ్సిడీల కింద రూ.7,943 కోట్లు ఇంతవరకూ ఖర్చు చేశారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో మిగతా 48 శాతం ఆదాయం రావడం సాధ్యమా? 

వాటికీ కరోనానే కారణమా?
ఆదాయం తగ్గుతున్నట్టు చెబుతున్న ఆర్థిక మంత్రి.. అందుకు కరోనాను కారణంగా చూపుతున్నారు. గత బడ్జెట్లను అంటే 2014 నుంచి 2020 మధ్య ప్రవేశపెట్టిన బడ్జెట్లను చూసినా ఇదే పరిస్థితి. కేటాయింపులు ఎక్కువగా వాస్తవ వ్యయం తక్కువగా చేస్తున్నారు. 2014 నుంచి 2020 మధ్య మొత్తం బడ్జెట్లు రూ.8,02,521 కోట్లు కాగా వాస్తవ ఆదాయం రూ.6,83,619 కోట్లే. ఇది కూడా కరోనా వల్లే తగ్గిందా? దీని వల్ల మొత్తంగా ఈ కాలంలో 24.26 శాతం కోత పడింది. ఈ కోతల ప్రభావం దళితులు, గిరిజనులు, మైనారిటీ, మహిళలు, బీసీ, వికలాంగులు, పంచాయతీరాజ్, వ్యవసాయ రంగాలపై పడింది. వడ్డీ చెల్లింపులు, ఉద్యోగాలు, పెన్షనర్లు, గవర్నర్, సీఎం నుంచి కార్పొరేటర్ల వరకు ఇచ్చే జీతాలు, అలవెన్సుల్లో కోత పెట్టడం కుదరదు. దీంతో సంక్షేమ పథకాలకే కోత పెడుతున్నారు. 

ఖాళీలు ఎప్పుడు భర్తీ చేస్తరు
రాష్ట్రంలో 4,91,304 మంది ఉద్యోగులు ఉండాలి. పీఆర్సీ రిపోర్ట్ ప్రకారం 1,91,126 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వీటిని ఎప్పుడు నింపుతారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. పీఆర్సీని 7.5 శాతంగా ప్రకటించారు. సీఎంతో సమావేశమైన ఉద్యోగ సంఘాల ప్రతినిధులు చెప్పిన ప్రకారం.. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ఏపీకన్నా అదనంగా పీఆర్సీ ఇస్తారని, రిటైర్మెంట్ వయసు 61 ఏండ్లకు పెంచుతారని, ప్రమోషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. కోడ్ ఉన్నప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రభావం చూపేలా సీఎం నుంచి ఇలాంటి ప్రకటనలు రావడం దారుణం. పట్టణ ప్రాంతాల్లో 8 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 23 శాతం నిరుద్యోగం ఉన్నట్లు గణాంకాలు చెప్పినా వాస్తవంగా ఈ అంకెలకు రెట్టింపు ఉంటుంది. దీంతో ఉపాధి కోసం జనం వేరే రాష్ట్రాలకు వలస పోతున్నారు. ఇక కరోనాతో పరిశ్రమలు పెద్దఎత్తున మూతపడ్డాయి. కొత్త ఉద్యోగాలు రాకపోగా, ఉన్న ఉద్యోగాలు ఊడిపోయాయి. ఇక గత బడ్జెట్లో ప్రకటించిన నిరుద్యోగ భృతి రూ.3,016కి అతీగతీ లేదు.  నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి చిన్న, మధ్య తరహా పరిశ్రమలను, వ్యవసాయ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయడం ద్వారా ఉపాధి కల్పించే అవకాశం ఉన్నా పట్టించుకోవడం లేదు. 

ప్రకటనలన్నీ కాగితాలకే పరిమితం
ఆరోగ్యంలో రాష్ట్రం 15వ స్థానంలో ఉన్నది. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు రూ.55,717 కోట్లు కేటాయించినట్టు చూపినా, ఎంతో మంది పేదలు ఆర్థిక సాయం అందక, వైద్య సేవలు లభించక చనిపోయారు. ఇక డబుల్ బెడ్రూం ఇండ్లు, దళితులకు మూడెకరాల భూమి, పట్టణాభివృద్ధి, మూసీ ప్రక్షాళనకు రూ.10 వేల కోట్లు, హైదరాబాద్ను విశ్వనగరంగా మార్చడం లాంటి ప్రకటనలన్నీ కాగితాలపై మాత్రమే ఉన్నాయి. దళితులకు భూములు పంచుతామన్న ప్రభుత్వం భూసర్వే ద్వారా ప్రభుత్వానికి ఉన్న భూములను రాబట్టి ఒక్క ఏడాదిలో మొత్తం దళితులకు మనిషికి 2 ఎకరాల భూమిని పంచడానికి అవకాశం ఉన్నా.. ఆ దిశగా చర్యలు తీసుకోలేదు.

సబ్ ప్లాన్ నిధులు సగం కూడా ఖర్చు పెట్టట్లే
దళితులు, గిరిజనులకు కేటాయింపులు వేల కోట్లలో చేస్తున్నారు. ఖర్చు మాత్రం దానిలో 50 శాతం దాటడం లేదు. 2014 నుంచి 2021 వరకు దళితులకు రూ.85,913 కోట్లు సబ్ప్లాన్ కింద కేటాయించి రూ.33,655 కోట్లే వ్యయం చేశారు. గిరిజనులకు రూ.50,581 కోట్లు కేటాయించి 50 శాతం లోపే ఖర్చు చేశారు. మైనారిటీలు, మహిళలు, బీసీ వర్గాలకు కేటాయించిన బడ్జెట్లు కూడా 50 శాతం దాటలేదు. విద్యా రంగానికి అసలు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. 2018-–19లో స్కూల్ ఎడ్యుకేషన్కు రూ.10,630 కోట్లు కేటాయించగా, గత ఏడాది రూ.10,405 కోట్లే కేటాయించారు. ప్రైవేటు సంస్థలకు ఎర్రతివాచీ పరిచిన ప్రభుత్వం ప్రైమరీ ఎడ్యుకేషన్ను మాత్రం అంతగా ప్రోత్సహించడం లేదు. దీంతో ప్రైవేటు స్కూళ్లకు లక్షల్లో ఫీజులు చెల్లించాల్సి వస్తున్నది.

ఇప్పటికీ వరద సాయం అందలే 
నవంబర్లో వచ్చిన వరదల వల్ల రూ.8,836 కోట్ల నష్టం జరిగింది. 7.35 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. పంటల నష్టమే రూ.5 వేల కోట్లకుపైగా ఉంటుంది. 70 మంది ఈ వరదల్లో చనిపోయారు. నష్టపోయిన కుటుంబానికి రూ.10 వేలు, చనిపోయిన వారి కుటుంబానికి రూ.5 లక్షలు ఇస్తామని ప్రకటించారు. ఇప్పటికీ 30% మందికి పరిహారం అందలేదు. వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర చెల్లింపులో కేంద్రం సహకరిస్తేనే తాము కొనుగోలు చేస్తామంటూ సీఎం, వ్యవసాయ మంత్రి ప్రకటించడం వారి నిర్లక్ష్యాన్ని తెలియజేస్తున్నది. రాష్ట్ర అవసరాల మేరకు కీ-లోన్పై వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేసి రైతులకు కనీస మద్దతు ధర కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నట్లు మరచిపోతున్నారు. పంటల నష్ట పరిహారం, బీమా తదితర పథకాలు సక్రమంగా పనిచేయకపోవడం వల్ల నష్టపోయినవారికి పరిహారాలు లేవు. రైతులకు ప్రకటించిన రుణమాఫీ ఒకేసారి చెల్లించడానికి ప్రభుత్వం ఆ బాకీని తమ ఖాతాలో వేసుకుని కిస్తీల వారీగా బ్యాంకులకు చెల్లిస్తూ రైతులను రుణ విముక్తులను చేసే అవకాశం ఉన్నా ఆ పని చేయకుండా రైతులపై వడ్డీ భారం వేస్తున్నది. 

అప్పులు పెరుగుతున్నయ్
2014లో రాష్ట్ర అప్పులు రూ.70 వేల కోట్లు. 2021 మార్చి నాటికి రూ.2,29,205 కోట్లకు అప్పులు చేరుకుంటాయని అంచనా. కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్ పేరుతో ఇప్పటికే రూ.42,410 కోట్లు అప్పు తెచ్చారు. మరో రూ.60 వేల కోట్లు తేవడానికి రంగం సిద్ధం చేశారు. ఇవి కాక డబుల్ బెడ్రూం ఇండ్లు, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలు తదితర కార్పొరేషన్ల ద్వారా మరో రూ.50 వేల కోట్ల వరకు అప్పులు చేశారు. ఇవన్నీ కలిపితే మొత్తం అప్పులు రూ.3.25 లక్షల కోట్లకు చేరుకుంటాయి. అప్పులకు వడ్డీగా ఏటా రూ.20 వేల కోట్లు చెల్లించాల్సి వస్తోంది. ఇన్ని వేల కోట్లు వ్యయం చేసినా మహబూబ్నగర్, ఆదిలాబాద్ జిల్లాల్లోని ప్రాజెక్టులు పూర్తికాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఆదిలాబాద్లో 20 వరకు ఉన్న మధ్య తరహా ప్రాజెక్టులు 20 ఏండ్లుగా నిర్మాణాలు సాగుతూనే ఉన్నాయి. అంచనా వ్యయం రెట్టింపు చేసినా పనులు పూర్తికాలేదు. మహబూబ్నగర్ జిల్లాలో పంట కాల్వలు, బ్రాంచ్ కాల్వలు పూర్తికాకపోవడంతో నీరు వృథాగా పోతోంది. సాగునీటి ప్రాజెక్టులపై రెండేండ్ల క్రితం హడావుడి చేసిన ప్రభుత్వం.. పనులు సగం దూరం వచ్చాక పట్టించుకోకపోవడంతో అవి నత్తనడకన సాగుతున్నాయి.-సారంపల్లి మల్లారెడ్డి,ఉపాధ్యక్షుడు, ఆలిండియా కిసాన్ సభ