ఎంపీ వంశీకృష్ణకు ప్రొటోకాల్ పాటించండి: అన్ని శాఖల అధికారులకు పెద్దపల్లి కలెక్టర్ ఆదేశం

ఎంపీ వంశీకృష్ణకు ప్రొటోకాల్ పాటించండి: అన్ని శాఖల అధికారులకు పెద్దపల్లి కలెక్టర్ ఆదేశం

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ విషయంలో జరుగుతున్న ప్రొటోకాల్​ఉల్లంఘనలపై ఆ జిల్లా కలెక్టర్​కోయ శ్రీహర్ష స్పందించారు. ప్రతి అధికారిక కార్యక్రమంలోనూ ఎంపీ వంశీకృష్ణకు కచ్చితంగా ప్రొటో కాల్‌‌ పాటించాలని అన్ని శాఖల అధికారులను ఆయన​ఆదేశించారు. ఎక్కడైనా ప్రొటోకాల్​ఉల్లంఘన జరిగితే  చాలా తీవ్రంగా పరిగణిస్తామని, తప్పు చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  

ఏడాదిగా ప్రొటోకాల్​ ఉల్లంఘనలు
పెద్దపల్లి ఎంపీగా వంశీకృష్ణ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అనేక సందర్భాల్లో అధికారులు ప్రొటోకాల్​ ఉల్లంఘిస్తూ వచ్చారు. అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానం పంపకపోవడంతోపాటు శిలాఫలకాలపై ఆయన పేరును విస్మరిస్తూ వచ్చారు. సరస్వతి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటుచేసిన అధికారిక ఫ్లెక్సీల్లో ఎంపీ పేరును, ఫొటోను చేర్చకపోవడం వివాదాస్పదమైంది.

గోదావరిఖని ఓసీపీ5 కార్యాలయంలో ఆవిష్కరించిన శిలాఫలకంపై ఆయన పేరు రాయలేదు. మంథని నియోజకవర్గంలో ఎంపీ అధికారిక పర్యటన సందర్భంగానూ అధికారులు ప్రొటోకాల్ పాటించలేదు. దీంతో తనకు జరిగిన ప్రొటోకాల్​ఉల్లంఘనలపై ఎంపీ వంశీకృష్ణ పార్లమెంట్ సెక్రటరీకి ఆధారాలతో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కలెక్టర్ స్పందించి అధికారులకు ఆదేశాలిచ్చారు.