మూడేళ్లయినా ఫుడ్డు పాడు కాదు

మూడేళ్లయినా ఫుడ్డు పాడు కాదు

Food can stored for 3 yearsఇంట్లో ఇడ్లీ చేసినం.. ఎన్ని రోజులుం టది? దోశలు పోసినం.. ఎప్పటిదాకా పాడుకాకుండా ఉంటయి? అన్నం, కూర వండినం.. ఖరాబ్ కాకుండా ఉంటదా? మహా అయితే ఒకట్రెండు
రోజులు ఆ ఫుడ్డు పాడుకాకుండా ఉంటుందేమో. ఫ్రిజ్లో పెడితే ఓ వారం ఏసుకోండి. ఒక్క రోజు
అయితేనే.. సద్ది కూడు అనేస్తం. పక్కకు నెట్టేస్తం. మరి, మూడేళ్లు ఫుడ్డు పాడు కాకుండా ఉంటే.. కచ్చితంగా ఉంటుందంటున్నారు ముంబై యూనివర్సిటీకి చెందిన వైశాలి బంబోలే అనే ఫిజిక్స్​ ప్రొఫెసర్. అందుకు ఓ ప్రత్యేకమైన పద్ధతిని అభివృద్ధి చేశామంటున్నారు.

వంటకాలకు అసలు ఏ ప్రిజర్వేటివ్స్​ కలపకుండానే ఫుడ్డును మూడేళ్లు దాచి పెట్టొచ్చని చెబుతున్నారు. అన్నేళ్లయినా ఆ భోజనం ఘుమఘుమలు, రుచి ఏ మాత్రం తగ్గవంటున్నారు వైశాలి. పోషక విలువలు, మృదుత్వం , రుచి చెక్కు చెదరకుండా ఉంటాయని కరాఖండిగా చెబుతున్నారు. ఎలక్ట్రానిక్​ బీమ్ రేడియేషన్ అనే పద్ధతి ద్వారా ఆహారాన్ని మూడేళ్ల పాటు నిల్వ చేయొచ్చని వైశాలి బంబోలే చెప్పారు. తొలిసారి ఆ టెక్నిక్​ను వాడి సక్సెస్ అయినట్టు తెలిపారు. పేటెంట్​ కోసం దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధమవుతున్నామన్నారు.

15 ఏళ్లుగా ఈ కొత్త టెక్నిక్​పై పనిచేస్తున్నామని, కెమికల్ పాలిమరైజేషన్ కు ఇది ఉత్ప్రేరకంలా ఉపయోగపడుతుందని చెప్పారు. ఆహారానికి బ్యాక్టీరియా సోకకుండా అది కాపాడుతుందని, తద్వారా దాని నిల్వ సామర్థ్యం పెరుగుతుందని చెప్పారు . 2013 నుంచి ఆ టెక్నిక్​పై మరింత తీవ్రంగా పనిచేస్తున్నామని, బోర్డ్​ ఆఫ్ రేడియేషన్ అండ్ ఐసోటోప్ టెక్నాలజీ (బీఆర్ఐటీ)కి తమ ప్రయోగ థీసిస్ ను పంపామని చెప్పారు. తమ ఆలోచన నచ్చి ముంబై యూనివర్సిటీలో పరిశోధన, బయో నానో ల్యాబ్ కోసం రూ.45 లక్షలు ఇచ్చేందుకు అంగీకరించిందని తెలిపారు. ప్యాకేజ్డ్​ ఫుడ్ ఇండస్ట్రీకి ఇది బాగా ఉపయోగపడుతుందన్నారు. ప్రకృతి విపత్తు లొచ్చినప్పుడు బాధితులకు అందించే ఆహారం పాడుకాకుండా చూడొచ్చని, రోదసీలోకి వెళ్లే ఆస్ట్రోనాట్ల ఫుడ్డుకూ ఇది చాలా ఉపయోగకరమని వైశాలి చెప్పారు.