మన్ననూరు గిరిజన హాస్టల్ లో..మళ్లీ ఫుడ్​ పాయిజన్

మన్ననూరు గిరిజన హాస్టల్ లో..మళ్లీ ఫుడ్​ పాయిజన్
  • 18 మంది స్టూడెంట్లకు అస్వస్థత
  • 13 మంది అచ్చంపేట దవాఖానకు...
  • నాగర్ కర్నూల్ హాస్పిటల్​కుమరో ఐదుగురి తరలింపు  

అమ్రాబాద్, వెలుగు : నాగర్​కర్నూల్​జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు మళ్లీ ఫుడ్ పాయిజన్ బారిన పడ్డారు. ఆగస్టు 14న మన్ననూర్ గిరిజన ఆశ్రమ పాఠశాలలో 280 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురి కాగా,  సోమవారం అదే హాస్టల్ కు చెందిన 18 మంది విద్యార్థులు మరోసారి అస్వస్థతకు గురయ్యారు. కడుపునొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. ఉదయం టిఫిన్​లో భాగంగా కిచిడీ చేశారు. అది తిన్న తర్వాత 8వ తరగతి చదువుతున్న సరిత, మహేశ్వరి, వసంత ఇబ్బంది పడగా వారిని వార్డెన్  తిరుపతమ్మ సమీపంలోని దవాఖానకు తీసుకెళ్లి చికిత్స చేయించింది.

ఆ తర్వాత పౌర్ణమి, సునీత, జై మహేశ్వరితో పాటు మరో 12 మంది అస్వస్థతకు గురికాగా108లో అచ్చంపేట ఏరియా దవాఖానకు తరలించారు. వీరిలో మహేశ్వరి, సునీత, పూర్ణిమ, పద్మ, సింధులను మెరుగైన చికిత్స కోసం నాగర్​కర్నూల్​జిల్లా దవాఖానకు తరలించారు. గత నెలలో ఫుడ్​పాయిజన్ ​జరిగిన తర్వాత హాస్టల్ లో వసతులు మెరుగుపడ్డాయని, ఫిల్టర్ వాటర్  అందిస్తున్నారని విద్యార్థులు తెలిపారు. కాగా, ప్రస్తుతం పిల్లల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్లు చెప్పారు. నెల రోజుల వ్యవధిలో రెండోసారి ఫుడ్​పాయిజన్​ కావడంతో విద్యార్థులు, పేరెంట్స్​ఆందోళన చెందుతున్నారు.