నేరడిగొండ కస్తూర్బా స్కూల్లో ఫుడ్ పాయిజన్

నేరడిగొండ కస్తూర్బా స్కూల్లో ఫుడ్ పాయిజన్

ఆదిలాబాద్ జిల్లా: నేరడిగొండ కస్తూర్బా పాఠశాలలో పాడైపోయిన.. పురుగుల అన్నం తిన్న 20 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా పాడైపోయిన.. పురుగుల అన్నం పెడుతున్నారని విద్యార్థులు ఇవాళ స్కూల్ బిల్డింగ్ ఎక్కి నిరసన నినాదాలు చేశారు. గేటు ఓపెన్ చేయండి.. ఇండ్లకు వెళ్లిపోతామంటూ కేకలు వేయడంతో విద్యార్థుల పరిస్థితి వెలుగులోకి వచ్చింది. 

వాంతులు, విరేచనాలు చేసుకుంటున్న వారిని నేరడిగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం రిమ్స్ కు తరలించారు. నాణ్యత లేని భోజనం తినడం వల్లే అస్వస్థతకు గురైనట్లు తేలింది. గత మూడు నాలుగు రోజులుగా సిబ్బంది పురుగులు, రాళ్లు ఉన్న అన్నం పెడుతుండడంతో చాలా మంది విద్యార్థినులు వాంతులు, విరేచనాలు చేసుకున్నారు. మరికొందరు కడుపునొప్పి బారిన పడగా.. ఇంకొందరు జ్వరంతో బాధపడుతున్నట్లు గుర్తించారు. కస్తూర్బా పాఠశాలలో పురుగుల అన్నం పెడుతున్న విషయం తెలిసి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు.