
- జలంధర్ దగ్గర్లో బైక్ స్వాధీనం
- నేపాల్ బార్డర్లో హైఅలర్ట్
- గురుద్వారాలో సెర్చింగ్
- అసెంబ్లీలో అమృత్‌పాల్ లొల్లి
చండీగఢ్/న్యూఢిల్లీ: ఖలిస్తానీ నేత అమృత్ పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. ఐదో రోజైన బుధవారం కూడా అతని ఆచూకీ లభించలేదు. చివరిసారిగా టూ వీలర్‌పై ట్రావెల్ చేస్తూ కనిపించిన అమృత్‌పాల్ సింగ్, తర్వాత ఎక్కడికెళ్లాడో పోలీసులు గుర్తించలేకపోతున్నారు. జలంధర్ సిటీకి 45 కి.మీ దూరంలో ఉన్న దారాపూర్ ఏరియాలోని కాలువ దగ్గర అమృత్‌పాల్ ప్రయాణించిన బజాజ్ ప్లాటినం బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ‘వారిస్ పంజాబ్ దే’ చీఫ్ అయిన అమృత్‌పాల్‌పై పంజాబ్ పోలీసులు లుకౌట్ నోటీసులతో పాటు నాన్‌బెయిలబుల్ వారెంట్ (ఎన్బీడబ్ల్యూ) జారీ చేశారు. అమృత్‌పాల్‌ను త్వరలోనే అరెస్ట్ చేస్తామని పంజాబ్ ఐజీ సుఖ్‌చైన్ సింగ్ తెలిపారు.
ఉత్తరాఖండ్‌లో సెర్చ్ ఆపరేషన్
ఉత్తరాఖండ్‌లోని ఉధంసింగ్ నగర్ జిల్లా ఇండో–నేపాల్ బార్డర్‌లోని గురుద్వారాలు, హోటల్స్, పర్యాటక ప్రాంతాల్లో పోలీసులు అమృత్‌పాల్ కోసం వెతుకుతున్నారు. అమృత్‌సర్‌లోని సింగ్ ఇంటికెళ్లిన పంజాబ్ పోలీసులు అతని అమ్మను విచారించారు. విదేశాల నుంచి వచ్చిన ఫండ్స్ పై అమృత్‌పాల్ భార్య కిరణ్ దీప్ కౌర్‌ను జల్లుపూర్ ఖేడాలో ఇద్దరు డీఎస్పీలు ప్రశ్నించారు.
దెబ్బకు దిగొచ్చిన యూకే సర్కార్
బ్రిటన్‌లోని ఇండియన్ హైకమిషన్‌పై ఖలిస్తానీ మద్దతుదారులు దాడి చేయడాన్ని ఇండియా తీవ్రంగా ఖండించింది. ఢిల్లీ చాణక్యపురిలోని శాంతిపథ్‌లోని బ్రిటన్ హైకమిషన్ ఆఫీస్ ముందున్న బారికేడ్లను తొలగించింది. దీంతో యూకే సర్కార్ దెబ్బకు దిగొచ్చింది. బ్రిటన్‌లో ఇండియా హౌస్ అని పిలిచే హైకమిషన్ ఆఫీస్‌కు భద్రత పెంచింది. కాగా, పంజాబ్ ప్రశాంతంగా ఉందని, సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని యూకేలోని ఇండియన్ హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి స్పష్టం చేశారు.
నంగల్ అంబియన్ గురుద్వారాలో..
శనివారం మధ్యాహ్నం 45 నిమిషాల పాటు అమృత్‌పాల్.. నంగల్ అంబియన్ గురుద్వారాలో గడిపినట్లు అక్కడి గ్రంథి (పూజారి), ఆయన భార్య మీడియాకు బుధవారం వెల్లడించారు. ‘‘అమృత్‌పాల్, మరో ముగ్గురు గురుద్వారాకు వచ్చారు. డ్రెస్సులుంటే ఇవ్వాలనడంతో మా కొడుకు డ్రెస్సులిచ్చాం. మా ఫోన్ తీసుకున్నారు. 1 గంటకు వచ్చి.. 1.45 దాకా ఉన్నారు. వెళ్లేటప్పుడు ఫోన్ ఇచ్చేసి.. తలపాగా మార్చుకున్నారు. అమృత్‌పాల్ కోసం పోలీసులు వెతుకుతున్నారని సాయంత్రం తెలిసింది” అని పూజారి, ఆయన భార్య చెప్పారు.
న్యాయపరంగా హెల్ప్ చేస్తాం: బాదల్
అమృత్‌పాల్ కోసం పంజాబ్ పోలీసుల వేట రాజ్యాంగ విరుద్ధమని శిరోమణి అకాలీదళ్ ఆరోపించింది. అరెస్ట్ అయిన సిక్కు యువకులందరికీ న్యాయపరంగా సాయం అందిస్తామని పార్టీ లీడర్ సుఖ్బీర్సింగ్ బాదల్ ప్రకటించారు.
అసెంబ్లీలో ప్రతిపక్షాల నిరసన
అమృత్‌పాల్‌పై నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ప్రయోగించడాన్ని శిరోమణి అకాలీదళ్ అసెంబ్లీలో ఖండించింది. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా క్వశ్చన్ అవర్ ప్రారంభంకాగానే లా అండ్ ఆర్డర్‌పై చర్చించాలని కాంగ్రెస్ ప్రతిపక్ష నేత ప్రతాప్‌సింగ్ స్పీకర్ కుల్తార్ సింగ్‌ను కోరారు. దాన్ని డిస్మిస్ చేసినట్లు ప్రకటించడంతో కాంగ్రెస్ సభ్యులు స్పీకర్ వెల్‌లోకి దూసుకెళ్లారు. ఎన్ఎస్ఏ ప్రయోగం సరికాదన్నారు. రాష్ట్రంలో టెర్రరిస్టుల పాలన నడుస్తున్నదని జీరో అవర్‌లో శిరోమణి అకాలీదళ్ ఎమ్మెల్యే మన్‌ప్రీత్ సింగ్ మండిపడ్డారు. అమాయకులను జైల్లో పెట్టారని ఫైర్ అయ్యారు.