ఏడేండ్లుగా బుగ్గపాడు ‘మెగా ఫుడ్ పార్క్’కు ఒక్క కంపెనీ రాలే

ఏడేండ్లుగా బుగ్గపాడు ‘మెగా ఫుడ్ పార్క్’కు ఒక్క కంపెనీ రాలే
  •     ల్యాండ్​ లీజు రేటు తగ్గిస్తే తప్ప వచ్చే పరిస్థితులు లేవు
  •     ప్రభుత్వ రేట్లు లాభదాయకం కాదంటున్న ఇండస్ట్రియలిస్టులు

ఖమ్మం/సత్తుపల్లి, వెలుగు: ఎవరైనా భూమిని కొనాలన్నా.. లీజుకు తీసుకోవాలన్నా తక్కువ ధరకు వస్తే బాగుండు అనుకుంటారు. ఆ ప్రాంతంలో ఉన్న డిమాండ్​ను బట్టి మార్కెట్ రేటు చెల్లించేందుకు ముందుకు వస్తారు. అయితే మార్కెట్​ధరకు మించి ల్యాండ్​లీజు రేటు పెట్టడంతో ఖమ్మం జిల్లా సత్తుపల్లి సమీపంలోని బుగ్గపాడు ‘మెగా ఫుడ్​పార్క్’లో కంపెనీలు పెట్టేందుకు ఏడేండ్లుగా ఎవరూ ముందుకు రావడం లేదు. దాదాపు పదిహేనేండ్ల కింద ఉమ్మడి ఏపీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మొదటిసారి ఈ పార్కుకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఏడేండ్ల కింద మంత్రి కేటీఆర్ మరోసారి శంకుస్థాపన చేశారు. కానీ ఇంత వరకు ఇక్కడ ఒక్క కంపెనీ కూడా ఏర్పాటు కాలేదు. బుగ్గపాడు సమీపంలోని భూముల మార్కెట్ రేటు ఎకరానికి రూ.35 లక్షల వరకు ఉంది. అయితే మెగా ఫుడ్ పార్కులో 35 ఏళ్ల లీజుకు ఇచ్చే భూమి రేటును అధికారులు ఏకంగా ఎకరానికి రూ.45 లక్షలుగా ఫిక్స్ చేశారు. ఏ ఈక్వేషన్ లో చూసుకున్నా ఇది లాభదాయకం కాదన్న ఉద్దేశంతోనే ఇండస్ట్రియలిస్ట్ లు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. 

3 కంపెనీలు ఆసక్తిగా ఉన్నా..

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వివిధ రకాల పండ్ల తోటలు సాగు అవుతుండడంతో రైతులకు ఉపయోగపడేలా 2008లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ మెగా ఫుడ్ పార్క్ కు భూమి పూజ చేశారు. 203 ఎకరాలు భూమి సేకరించి, కంపెనీల ఏర్పాటుకు ప్లాన్ చేశారు. ఆ తర్వాత పనులు ముందుకు పోలేదు. తెలంగాణ వచ్చాక 2016లో మంత్రులు కేటీఆర్, తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా రూ.109.44 కోట్లతో అందులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మొత్తం భూమిలోని 60 ఎకరాల్లో అభివృద్ధి పనులు చేపట్టారు. కోల్డ్ స్టోరేజీలు, వేర్ హౌస్​లు, ప్యాకింగ్ గోడౌన్లు, సబ్ స్టేషన్, ప్రహరీ, సెంట్రల్ లైటింగ్, డివైడర్లు, డ్రైనేజీలు నిర్మించారు. ఏండ్లు గడుస్తున్నా, అభివృద్ధి పనులు పూర్తి చేస్తున్నా ఇంత వరకు మెగా ఫుడ్ పార్క్ లో ఒక ఇండస్ట్రీ ఏర్పాటు కాలేదు. వందలాది ఇండస్ట్రీలతో, వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశించిన స్థానికులకు నిరాశే ఎదురైంది. ఇప్పటి వరకు మూడు కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నా ఎలాంటి పనులు మొదలు కాలేదు. అధికారులు ఏండ్లుగా భూమిని ఖాళీగా ఉంచుతున్నారే తప్ప లీజు ధరను తగ్గించడం లేదు. వంద కోట్లతో అభివృద్ధి చేసిన భూములకు, ఇక్కడ వసతులకు తగిన రేటు ఉంటుందని చెబుతున్నారు. 

కోట్ల రూపాయలు వృథా

బుగ్గపాడు ఫుడ్ పార్కులో పరిశ్రమలు వస్తే ఈ ప్రాంత యువతకు ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డాం. ఏండ్లు గడుస్తున్నా ఒక్కటి కూడా రాలేదు. ప్రభుత్వం ఖర్చు పెట్టిన కోట్లాది రూపాయలు వృథానే అన్నట్లుంది. ఇప్పటికైనా ప్రభుత్వం పరిశ్రమలను ప్రోత్సహించేలా నిర్ణయం తీసుకోవాలి. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి.
- దాది సందీప్, నిరుద్యోగి, సత్తుపల్లి


లీజు రేట్లపై మళ్లీ రివ్యూ చేస్తామన్నారు

ఉమ్మడి జిల్లాలో మామిడి, జామ, జీడి మామిడి, కోకో, వక్క సహా చాలా రకాల తోటలు ఉన్నాయి. ఫుడ్ పార్క్ లో ప్రాసెసింగ్ యూనిట్లు వస్తే పంటలకు మంచి రేట్లు వస్తాయి. రైతులకు మేలు జరుగుతుంది. ఇటీవల మంత్రి కేటీఆర్ ను కలిసి బుగ్గపాడు ఫుడ్ పార్క్ పెండింగ్ పనులపై చర్చించాం. అధికారులతో సమీక్ష చేస్తానని చెప్పారు. మిగిలిన పనులను పూర్తి చేయిస్తామన్నారు. లీజు రేట్లపై మళ్లీ రివ్యూ చేసి, తర్వాత మాట్లాడతామన్నారు. 
- తుమ్మల నాగేశ్వరరావు, మాజీ మంత్రి 

రెండు నెలల్లో రెండు కంపెనీలు వస్తయ్

బుగ్గపాడు మెగా ఫుడ్ పార్కులో ఫ్యాక్టరీల ఏర్పాటుకు కంపెనీలు ముందుకు వస్తున్నాయి. మ్యాంగో పల్ప్ తయారీ కంపెనీ, కోల్డ్ స్టోరేజీ, వేర్ హౌస్ నిర్వహణ కోసం కొందరు ఇంట్రస్ట్ చూపించారు. ఒకట్రెండు నెలల్లో వాటిని ప్రారంభించే అవకాశం ఉంది. ఫుడ్ పార్క్ లో చేసిన డెవలప్ మెంట్స్ ప్రకారం లీజు ధరను నిర్ణయించారు.  
- పవన్ కుమార్, జోనల్ మేనేజర్, టీఎస్ఐఐసీ