ఫస్ట్​ టైమే పొన్నం ప్రభాకర్ కు మంత్రి పదవి

ఫస్ట్​ టైమే పొన్నం ప్రభాకర్ కు మంత్రి పదవి
  •     పొన్నంకు కలిసివచ్చిన హుస్నాబాద్​
  •     బీసీ కోటాలో టికెట్​, మినిస్టర్​ పోస్ట్

సిద్దిపేట, వెలుగు : హుస్నాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి మొట్టమొదటి సారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన పొన్నం ప్రభాకర్ కు మంత్రి పదవి లభించింది. సీఎం రేవంత్ రెడ్డి మంత్రి వర్గంలో ఆయన చోటు దక్కించుకున్నారు. కరీంనగర్ కు చెందిన పొన్నం ప్రభాకర్ ఎన్‌ఎస్‌యూఐ నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని  ప్రారంభించి ఎంపీగా ఐదేండ్లు పనిచేశారు. తెలంగాణ  బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు క్రియాశీలకంగా వ్యవహరించడమే కాకుండా తోటి కాంగ్రెస్ ఎంపీలతో కలసి పోరాటం చేశారు. ఈ సందర్భంగా లగడపాటి  రాజగోపాల్ పెప్పర్ స్ర్పే దాడికి గురయ్యారు. తరువాత 2014 ,2019 పార్లమెంటు, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మూడు సార్లు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 

హుస్నాబాద్ లో మారిన అదృష్టం

గత మూడు ఎన్నికల్లో వరుస పరాజయాలు చవిచూసిన పొన్నం ప్రభాకర్ కు హుస్నాబాద్ లో కలిసివచ్చింది. అనూహ్యంగా హుస్నాబాద్ బరిలోకి దిగి ఎమ్మెల్యేగా గెలిచిన మొదటిసారే మంత్రి పదవి లభించింది. గత పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా పోటీ చేసినప్పుడు హుస్నాబాద్ సెగ్మంట్ లో పొన్నం ప్రభాకర్ 42 వేల ఓట్లను పొందారు. ఆ ఎన్నికల్లో ఓటమి చవి చూసినా హుస్నాబాద్ సెగ్మెంట్​లో భారీ ఓట్లను సాధించడంతో తన రూటును మార్చుకున్నారు. కాంగ్రెస్ టికెట్ హుస్నాబాద్ టికెట్ కోసం చివరి నిమిషంలో అప్లై  చేసుకున్నారు. ఎంపీగా ఢిల్లీ స్థాయిలో  ఉన్న మంచి సత్సంబంధాలు ఆయనకు టికెట్ దక్కడంలో కీలక పాత్ర పోషించాయి. 

బీసీ కోటాలో టికెట్, మంత్రి పదవి

బీసీ కోటాలో హుస్నాబాద్ కాంగ్రెస్ టికెట్ పొందిన పొన్నం ప్రభాకర్ గెలుపొందడమే కాకుండా అదే కోటాలో ఏకంగా మంత్రి వర్గంలో స్థానం పొందారు. గౌడ సామాజిక వర్గానికి చెందిన పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ లో ఆ వర్గంతో పాటు ఇతర బీసీ కులాల మద్దతు కూడా పొందారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఒడితల సతీశ్ కుమార్ పై 19,344 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. క్రమ శిక్షణ గల కార్యకర్తగా పార్టీ కోసం పనిచేయడమే కాకుండా సౌమ్యుడనే పేరును పొందారు. ఇదే సమయంలో ఎల్బీనగర్ లో మధు యాష్కి ఓడిపోవడంతో పొన్నం ప్రభాకర్  మంత్రి పదవికి అడ్డంకులు లేకుండా పోయాయి. 

మూడు జిల్లాల్లో ప్రభావం

పొన్నం ప్రభాకర్ కు మంత్రి పదవి దక్కడంతో మూడు జిల్లాల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది. హుస్నాబాద్ నియోజకవర్గం సిద్దిపేట, కరీంనగర్, హన్మకొండ జిల్లాల  మండలాలు ఉండడంతో మూడు జిల్లాల్లో పొన్నం ప్రభాకర్ కీలకంగా మారనున్నారు. ముఖ్యంగా సిద్దిపేట జిల్లా నుంచి మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్​రావు ప్రాతినిధ్యం వహిస్తుండడంతో పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయాల్సిన అవసరం ఏర్పడుతోంది. సిద్దిపేట జిల్లాలో 3 సీట్లు గెలుచుకుని బీఆర్ఎస్ బలంగా ఉండడంతో రానున్న రోజుల్లో కాంగ్రెస్ ను బలోపేతం చేసే బాధ్యత పొన్నం ప్రభాకర్ భుజస్కందాలపై పడుతోంది.