
- సైబీరియా, ఆస్ట్రేలియా తదితర దేశాల నుంచి రాక
- ఏర్పాట్లు చేసిన సంస్థలు, వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్లు
- వీకెండ్లో ఫ్యామిలీతో వచ్చి బర్డ్ వాచింగ్
హైదరాబాద్, వెలుగు: వింటర్ వచ్చిందంటే.. సిటీ శివారు ప్రాంతాల్లోని చెరువుల్లో విదేశీ పక్షులు సందడి చేస్తుంటాయి. దీంతో చెరువులు ఆ పక్షులతో కళకళలాడుతుంటాయి. అమీన్ పూర్, నల్లగండ్ల, పీరం చెరువు, గండి చెరువు, హిమాయత్‌సాగర్ బర్డ్ వాచింగ్‌కు హాట్‌స్పాట్‌గా మారాయి. వీకెండ్లో పక్షులను చూసేందుకు బర్డ్ లవర్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సైబీరియా, ఆస్ట్రేలియా, యూరప్, ఆఫ్రికా తదితర దేశాల నుంచి పక్షులు ఇక్కడికి వస్తుంటాయి. వాటిని చూసేందుకు పర్యాటకులు కూడా ఉత్సాహం చూపిస్తుంటారు. బర్డ్ వాచింగ్పేరుతో పలు సంస్థలు, వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్లు చెరువుల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంటారు. చలికాలం ముగిసేవరకు పక్షులు సందడి చేయనుండగా వీకెండ్లో బర్డ్ వాచింగ్‌కు వచ్చే వారితో చెరువుల వద్ద సందడి కనిపిస్తోంది.
బర్డ్ వాచింగ్‌కు ఏర్పాట్లు
వీకెండ్లో సిటీ జనాలు పిక్నిక్ స్పాట్లు వెతుకుతూ ఉంటారు. ఇందుకు శివారులోని బర్డ్ వాచింగ్ బెస్ట్ఆప్షన్గా చెప్పొచ్చు. టూరిస్టులు, ఫొటోగ్రాఫర్లు, ఆర్గనైజేషన్స్ చెరువుల వద్ద ప్రోగ్రామ్స్ చేస్తుండగా సందడిగా మారాయి. సిటీకి చెందిన విశ్వ సస్టైనబుల్ఆర్గనైజేషన్ సంస్థ వీకెండ్స్‌లో అమీన్పూర్, నల్లగండ్ల, పీరం చెరువు, గండి చెరువు తదితర చెరువుల వద్ద బర్డ్ వాచింగ్ నిర్వహిస్తారు. ఫ్యామిలీతో రావొచ్చని నిర్వాహకులు చెబుతున్నారు. ఇప్పటి వరకు100కుపైగా దేశ, విదేశీ పక్షులను గుర్తించినట్లు పేర్కొంటున్నారు. వలంటీర్లు చెరువుల క్లీనింగ్కూడా నిర్వహిస్తున్నారు.
విదేశాల నుంచి..
చలికాలంలో విదేశాల నుంచి ప్రతి ఏడాది సిటీ శివార్లకు పక్షులు వలస వస్తుంటాయి. సైబీరియా, యూరప్, ఆస్ట్రేలియా, రష్యా, టర్కీ, ఆఫ్రికా తదితర దేశాల నుంచి వేల కిలో మీటర్లు ప్రయాణించి చేరుకుంటాయి. ఆయా దేశాల్లో ప్రస్తుతం వాతావరణం అనుకూలంగా ఉండదు. విదేశీ పక్షులకు ఇక్కడ అనువుగా ఉంటుంది. వాటికి ఆహారం కూడా లభిస్తుంది. దీంతో ప్రతి ఏడాది వచ్చి శీతాకాలం ముగిసే వరకు ఉండి వేసవి మొదలవగానే వెళ్లిపోతుంటాయి. నార్తర్న్ ఫోవెలర్, ఎల్లో వాగ్ టేల్, వెర్డిటేర్ ఫ్లై క్యాచర్, కామన్స్టోన్చాట్, లిటిల్టెర్న్ లాంటి విదేశీ పక్షులు బర్డ్వాచర్స్కు కనువిందు చేస్తాయి. వీటితో పాటు స్థానిక పక్షులు కొంగలు, చిలుకలు, పిచ్చుకలతో ఇప్పటికే చెరువుల పరిసరాలు సందడిగా మారాయి.
క్లీనింగ్‌తో పాటు వాచింగ్ చేస్తుంటాం
వీకెండ్ శివారు చెరువులతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చెరువులను క్లీనింగ్ చేస్తుంటాం. ఇప్పటివరకు చెరువుల నుంచి 3.5 టన్నుల చెత్తను వెలికితీశాం. మా టీమ్‌లో 500 మంది వలంటీర్లు ఉన్నారు. క్లీనింగ్‌తో పాటు బర్డ్ వాచింగ్కూడా నిర్వహిస్తున్నాం. వీకెండ్లో మా వలంటీర్లు కాకుండా బయటివారు కూడా వస్తుంటారు. కాలేజీ స్టూడెంట్లు, ఎంప్లాయీస్, ఫ్యామిలీతో పాటు బర్డ్ వాచింగ్‌ను ఎంజాయ్చేస్తుంటారు.
-వినయ్ మంచాల, విశ్వ ఫౌండేషన్.