ఓటర్ జాబితా తప్పులు లేకుండా చేయాలి : కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

ఓటర్ జాబితా తప్పులు లేకుండా చేయాలి : కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
  • కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ 

సూర్యాపేట, వెలుగు: మున్సిపాలిటీలలో ఓటర్ జాబితాలో ఎలాంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్తగా తయారుచేయాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆఫీసర్లను ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయంలో  శుక్రవారం మున్సిపల్ కమిషనర్లు, సిబ్బంది తో ఓటర్ జాబితా తయారుపై కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ..  సూర్యాపేట, కోదాడ, హుజూర్‌‌‌‌నగర్,  నేరేడుచర్ల, తిరుమలగిరి మున్సిపాలిటీలలోని 141 వార్డులలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ముసాయిదా ఓటర్ జాబితాను రూపొందించి గురువారం వార్డుల వారీగా ప్రకటించామన్నారు. ఆయా జాబితాలపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నేతలతో ఈనెల 5న మున్సిపాలిటీలలో, 6 వ తేదీన జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహించి వారి నుంచి వచ్చే అభ్యంతరాలను పరిశీలించాలన్నారు.

 ఈనెల 10వ తేదీన మున్సిపాలిటీ వారీగా తుది ఓటర్ జాబితా ప్రకటించనున్నట్లు తెలిపారు. సమావేశానికి అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, ప్రొవిషన్ డిప్యూటీ కలెక్టర్లు అనూష, రవితేజ, డీపీఓ యాదగిరి మున్సిపల్ కమిషనర్లు హనుమంత రెడ్డి, రమాదేవి, శ్రీనివాస్ రెడ్డి, అశోక్ రెడ్డి, మున్వర్ ఆలీ, సి సెక్షన్ సూపరింటెండెంట్ సంతోష్ కుమార్, మున్సిపల్ సిబ్బంది తదితరులు హాజరయ్యారు.