- హెచ్ఎంఎస్ నాయకుల డిమాండ్
నస్పూర్, వెలుగు: సింగరేణిలో అన్ని సంఘాలకు సమాన హోదా కల్పించాలని హెచ్ఎంఎస్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం ఏరియాలోని ఆర్కే న్యూటెక్ గని మేనేజర్ కు జాగృతి నాయకులతో కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గుర్తింపు ప్రాతినిథ్య సంఘాల కాలపరిమితి ముగిసిపోయిందని, ఇప్పుడు అన్ని యూనియన్లకు సమాన హోదా కల్పించాలన్నారు. 2023 డిసెంబర్ 27న సింగరేణి సంస్థలో ఎన్నికలు నిర్వహించారని, సెంట్రల్ లేబర్ కమిషనర్ ప్రకారం సంఘాల కాల పరిమితి రెండేండ్లు మాత్రమేనని, ఆ తర్వాత యథావిధిగా గుర్తంపు హోదా రద్దవుతుందని స్పష్టం చేశారు.
మళ్లీ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించే వరకు హెచ్ఎంఎస్ యూనియన్ తో సహా అన్ని రిజిస్టర్డ్ కార్మిక సంఘాలకు సమాన హోదా కల్పించి సమస్యలపై చర్చించాలని డిమాండ్ చేశారు. మైన్స్ కమిటీ, పిట్, సేఫ్టీ కమిటీలతో పాటు ఇతర అధికారిక సమావేశాలను అన్ని సంఘాలతో నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో హెచ్ఎంఎస్ పిట్ కార్యదర్శి తుల అనిల్ కుమార్, అడ్లూరి అనిల్, సంపత్, జాగృతి నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.
