
- చలికాలంలో తగ్గిన పక్షుల రాక
- ఏటా పడిపోతున్న వలసలు
- చెరువుల ఆక్రమణలే కారణమంటున్న బర్డ్ వాచర్ గ్రూప్స్
హైదరాబాద్, వెలుగు: శీతాకాల విడిది కోసం సిటీకి వచ్చే విదేశీ పక్షుల సంఖ్య ప్రతి ఏటా తగ్గుతూ వస్తోంది. చలికాలం మొదలవగానే వలస పక్షులతో సిటీ చెరువులు కళకళలాడుతుండేవి. వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చే విభిన్న రకాల విదేశీ పక్షులను చూసేందుకు, కెమెరాలతో క్లిక్ మనిపించేందుకు బర్డ్ వాచర్లు క్యూ కడుతుంటారు. అయితే ఒకప్పుడు వందల సంఖ్యలో వచ్చే విదేశీ పక్షుల రాక క్రమక్రమంగా తగ్గుతోంది. ఈ పక్షులు ఆవాసాలుగా చేసుకునే చెరువులు ఆక్రమణలకు గురవడం, చెరువుల చుట్టూ నిర్మాణాలు పెరిగిపోతుండటంతో వాటి రాక క్రమంగా తగ్గిపోతోంది. ప్రస్తుతం ఈ సీజన్లోనూ సిటీకి విదేశీ పక్షులు వచ్చినప్పటికీ మునుపటితో పోలిస్తే ఈ సంఖ్య చాలా తక్కువని బర్డ్వాచర్లు పేర్కొంటున్నారు. ఇలాగే కొనసాగితే రాను రాను ఈ సంఖ్య మరింత పడిపోయే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అనువుగా లేక..
నెలన్నర రోజులుగా సిటీ చెరువులు వలస పక్షులతో కనిపిస్తున్నాయి. అమీన్పూర్, గండిపేట, హిమాయత్‌సాగర్ చెరువుల దగ్గరికి వలస పక్షులు వస్తున్నాయి. విదేశాలతో పోలిస్తే ఇక్కడ చలి తక్కువగా ఉండటం, ఆహారం కూడా దొరుకుతుండటంతో శీతాకాల విడిది కోసం సిటీని ఎన్నుకుంటాయి. కానీ వచ్చే పక్షుల సంఖ్య ఇప్పుడు బాగా తగ్గిపోయిందని వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాపర్లు కూడా పేర్కొంటున్నారు. రియల్ ఎస్టేట్, చెరువుల ఆక్రమణలు పెరిగిపోవడంతో వాటికి అనువైన ప్రాంతాలు లేక వచ్చే వాటి సంఖ్య తగ్గుతోంది. చెరువులు అనువుగా లేక జనావాసాల్లోకి వెళ్తున్నాయి. ఆ సమయంలో కరెంట్ తీగలు, స్తంభాలకు తగిలి చనిపోతున్న ఘటనలు కూడా కనిపిస్తున్నాయి.
బర్డ్ వాచర్స్ ఎక్కువైనా..150 రకాల విదేశీ పక్షులు సిటీకి వస్తాయని
హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ గ్రూప్ సభ్యుడు శ్రీరామ్ రెడ్డి తెలిపారు. వీటిలో 10 నుంచి 15 రకాల బాతులు, నాలుగైదు రకాల హారియర్స్, ఫాల్కన్, ఈగల్స్, ఫ్లెమింగ్‌లోని పలు రకాల పక్షులు, వెర్డిటెర్ ఫ్లై క్యాచర్, నార్తర్న్ షోవలర్, బ్లాక్ టెయిల్డ్ గాడ్‌విట్, ఎల్లో వాగ్‌టెయిల్, కామన్ స్టోన్ చాట్, వాడర్స్, లిటిల్ టెర్న్ వంటి ఎన్నో రకాల పక్షులు ఉన్నాయి. సైబీరియా నుంచి దాదాపు 20 వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి వస్తాయి. వీటిని చూసేందుకు వచ్చే వారి సంఖ్య గతంలో కంటే ఇప్పుడు బాగా పెరిగింది. హైదరాబాద్ బర్డింగ్ పాల్స్, డెక్కన్ బర్డర్స్ గ్రూప్స్ ల ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం బర్డ్ వాక్స్ నిర్వహిస్తున్నారు. పక్షుల సంఖ్య బాగా తగ్గిపోవడంతో చూడలేకపోతున్నామని వాచర్స్ వాపోతున్నారు.
అధికారులు దృష్టిపెట్టాలి
చలికాలంలో విదేశీ పక్షులు వస్తుండటంతో వాటిని చూడటం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అవి చెరువుల్లో దిగి ఆహారం వెతుక్కుంటాయి. చాలా చెరువులు ఆక్రమణలకు గురవు తుండటంతో రెండేళ్లుగా కొన్నిరకాల బాతులకు అనువుగా ఉండటం లేదు. చెరువుల విస్తీర్ణం తగ్గిపోతుండటంతో చాలా పక్షులు రావడం లేదు. చెరువుల సంరక్షణపై ప్రభుత్వం దృష్టిపెట్టాలి.
- శ్రీరాం రెడ్డి, వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్
హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ గ్రూప్ ఫ్లెమింగోల సంఖ్య తగ్గింది
రియల్ ఎస్టేట్, చెరువుల ఆక్రమణలు పెరిగిపోవడంతో వలస పక్షులకు అనువైన ప్రదేశంగా ఉండే సిటీ ప్రాధాన్యత తగ్గిపోతోంది. వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి అలసిపోయి చెరువుల చుట్టుపక్కల ఉండే బిల్డింగ్‌లకు గుద్దుకుని చనిపోతున్నాయి. చెరువులు అనువుగా లేక జనావాసాల్లోకి వస్తున్నాయి. గతంలో వందల్లో ఫ్లెమింగోలు వచ్చేవి ఇప్పుడు తగ్గిపోయాయి.
- మనోజ్ కుమార్ విట్టపు, వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్