
తెలంగాణలో అటవీ విస్తీర్ణం వివిధ కారణాల వల్ల బాగా తగ్గుతోంది. అటవీ శాఖ చేపడుతున్న కొన్నిచర్యలు సహాయకారిగా ఉన్నాయి. కానీ, తీవ్ర మార్పుల అవసరం కనపడుతోంది. మొత్తం మీద, అటవీ విస్తీర్ణాన్ని ప్రస్తుత 24 శాతం నుంచి 33 శాతానికి పెంచడానికి ప్రత్యక్ష, ప్రభావవంతమైన చర్యలు తీసుకోవడం లేదు. వాస్తవానికి, అటవీ ప్రాంతం 24 శాతం కంటే చాలా తక్కువగా ఉండవచ్చు.
ఆక్రమణ, భూ వినియోగ మార్పు, విధ్వంసం, అటవీ నిర్మూలన నుంచి అడవులు, రిజర్వ్ ఫారెస్ట్, అటవీ భూములు, జాతీయ పార్కులను పరిరక్షించే ప్రాథమిక బాధ్యతలో రకరకాల కారణాల వల్ల అటవీశాఖ విఫలం అయ్యింది. తెలంగాణ జీవవైవిధ్యం, అటవీ ఆధారిత జన్యు సంపద, వృక్ష జాతుల వైవిధ్యాన్ని కోల్పోతోంది. మరో వైపు అటవీ విస్తీర్ణం క్షీణించడం, పట్టణీకరణ ఫలితంగా రాష్ట్రంలో వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అటవీశాఖ పనితీరు మెరుగుపడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
అటవీ ప్రాంతాలే కాదు, తెలంగాణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జాతీయ పార్కుల సరిహద్దులు కూడా సురక్షితంగా లేవు. అటవీ శాఖ తన పరిధిలోని భూముల సర్వేను చేపట్టలేదు. అటవీ భూమి రికార్డులు అందుబాటులో లేవు. కొన్ని పార్కుల నోటిఫికేషన్ చేసి 2 నుంచి 3 దశాబ్దాలు గడిచినప్పటికీ, ప్రభుత్వం ప్రామాణికమైన, ధ్రువీకరించదగిన సర్వే ద్వారా సరిహద్దులను నిర్ధారించలేదు. రాష్ట్రం అంతటా అటవీ భూములు.. భూమాఫియా, ప్రభుత్వ విభాగాలు, వివిధ వర్గాల నుంచి ముప్పును ఎదుర్కొంటున్నాయి. ప్రతి ‘అభివృద్ధి’ ప్రాజెక్ట్ సమావేశాలలో అటవీ శాఖపై ఒత్తిడి చేయడం పాలకులకు అలవాటుగా మారింది.
ఆక్రమణలు, సరిహద్దు ఉల్లంఘనలు, సర్వేలు లేకపోవడం, ఎకో-సెన్సిటివ్ జోన్ (ESZ) నోటిఫికేషన్ ఇవ్వకపోవడం,అధికారిక, అనధికారిక భూమి మళ్లింపులు మొదలైనవి హైదరాబాద్‌లోని మూడు జాతీయ ఉద్యానవనాలు - కేబీఆర్ నేషనల్ పార్క్, మృగవణి నేషనల్ పార్క్, మహావీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్క్ - ఎదుర్కొంటున్నాయి. రంగారెడ్డి జిల్లాలో ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాల పరిస్థితి కూడా ఇంచుమించు ఇదే విధంగా ఉన్నది.
జాతీయ ఉద్యానవనాలకు సంబంధించిన వాస్తవాలు
ఎకో-సెన్సిటివ్ జోన్ నోటిఫికేషన్ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ మృగవణి నేషనల్ పార్క్, కేబీఆర్ నేషనల్ పార్క్ ఈఎస్జడ్లను నేటికీ నోటిఫై చేయలేదు. నా వీటి చుట్టూ సంరక్షణకు ప్రత్యేక జోనల్ నిబంధనలతో కూడిన రక్షణ ప్రాంతాన్ని ఏర్పాటు చేయలేదు. 1998లో గెజిట్ నోటిఫికేషన్ నుంచి మృగవణి జాతీయ ఉద్యానవనం భూభాగాన్ని సర్వే చేయలేదు. సరిహద్దులను నిర్ధారించలేదు.
జీవో 111 పరిధికి అనుసంధానంగా ఈ పార్కును పరిరక్షిస్తే హైదరాబాద్ నగర సహజ నీటి వ్యవస్థ, మూసీ నది పరీవాహక ప్రాంతం పునఃజీవనం సులువుగా సాగుతుంది. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఎదుట మొదట అటవీశాఖ 2012లో మృగవణి జాతీయ ఉద్యానవనం సరిహద్దు సర్వే జరిగిందని, దాంట్లో లోపాలు ఉన్నట్లు కనుగొన్నామని గందరగోళంగా, పరస్పర విరుద్ధంగా పేర్కొంది.
నోటిఫై చేసిన 360 హెక్టార్లకు బదులుగా, ఈ సర్వే కేవలం 287 హెక్టార్లు మాత్రమే నిర్ధారణ జరిగినది. అప్పటికీ 73 హెక్టార్ల జాతీయ ఉద్యానవన భూభాగం నష్టపోయినట్లు కనుగొన్నప్పటికీ ఎటువంటి చర్య తీసుకోలేదు. అటవీ శాఖ కోర్టులో సమర్పించిన ఈ సమాచారం కూడా తరువాత తప్పు అని తేలింది. మార్చి 2023లో కోర్టు ఆదేశించిన తరువాత చేసిన మృగవణి నేషనల్ పార్క్ సర్వేలో వైశాల్యం కేవలం 280 హెక్టార్లు మాత్రమే అని తేలింది. జాతీయ పార్క్ వైశాల్యం 360 హెక్టార్ల (గెజిట్ నోటిఫికేషన్) నుండి 287 హెక్టార్లకు (2012 సర్వే) తరువాత 280 హెక్టార్లకు (2023 సర్వే) ఎలా, ఎందుకు తగ్గుతూ వచ్చింది?
నిర్లక్ష్యపు నీడలో మహావీర్ హరిణ వనస్థలి
మహావీర్ హరిణ వనస్థలి పరిస్థితిలో తేడాలున్నా ఈ పార్కు కూడా నిర్లక్ష్యపు నీడలోనే ఉన్నది. ఈ పార్కు చుట్టూ ఉన్న ESZలో అటవీ శాఖ నిర్మాణాలను తొలగించలేదు. ఇక్కడ భూభాగ పరిరక్షణ చర్యలు ఆశించిన విధంగా లేవు. మహావీర్ హరిణ వనస్థలి పార్కు చుట్టూ పెరుగుతున్న కాంక్రీట్ నిర్మాణాలు, వాహనాల రొద నుంచి వన్యప్రాణులను రక్షించే బాధ్యత అటవీ శాఖ మీద ఉన్నది. హరిణ వనస్థలి నేషనల్ పార్క్ లోపల రెండు కేంద్ర సంస్థలు ఉన్నాయి. CRIDA,GSI సంస్థల భూభాగా పరిధి గురించి అటవీ శాఖ దగ్గర సమాచారం లేదు. అధికారిక సరిహద్దులకు సంబంధించి ఒప్పంద పత్రాలు తదితర కనీస సమాచారం లేనందున అటవీ శాఖ సరిహద్దు నిర్ధారణకు ప్రత్యక్ష చర్యలు చేపట్టలేదు.
2022–-23లో CRIDA, GSI సంస్థలను ప్రశ్నిస్తే అంతర పరిశీలన అనంతరం పత్రాల లేమి గురించి అవి కూడా ఆశ్చర్యపోయాయి. CRIDA, GSIలకు ఏనాడో కేటాయించిన ప్రాంతాల సరిహద్దులకు అధికారిక నోటిఫికేషన్, భూభాగ సర్వే అవసరం ఉన్నది. హరిణ వనస్థలిలో మృగవణి మాదిరిగా సర్వేలు లేకపోవడం, సరిహద్దుల నిర్ధారణ జరగపోవడం వల్ల కోల్పోయిన భూమి గురించిన సమాచారం లేదు. జూబ్లీ హీల్స్ ప్రాంతంలో ఉన్న KBR జాతీయ ఉద్యానవనం కూడా ఆక్రమణలకు గురి అవుతున్నది.
అటవీ రక్షిత చర్యలు తీసుకోవాలి
అడవుల నిర్వహణలో ఏర్పడిన లోతైన సమస్యలను అరికట్టడానికి తెలంగాణ అటవీ శాఖ చర్యలు తీసుకోవాలి. సమగ్ర ప్రణాళిక అవసరం ఎంతైనా ఉన్నది. గడిచిన 3 దశాబ్దాలలో ఈ మూడు జాతీయ ఉద్యానవనాల నిర్వహణ గురించిన విచారణ, లేదా ఆడిట్ చేసి, లోపాలను గుర్తించి, తగిన సుస్థిర పరిరక్షణ ప్రణాళిక తయారు చేయడానికి నిపుణులతో కూడిన స్వతంత్ర కమిటీని అటవీ శాఖ నియమించాలి. హైదరాబాద్ నగరంలోని జాతీయ ఉద్యానవనాల స్థితిపై ఒక వివరణాత్మక శ్వేతపత్రాన్ని తయారు చేయాలి. అటవీ శాఖ HMDA మాస్టర్ ప్లాన్ అభివృద్ధిలో, 28 ఇతర పట్టణ అభివృద్ధి సంస్థల సమావేశాలలో విధిగా పాల్గొని, వారు అభివృద్ధి చేసిన భూ వినియోగం ప్రణాళిక, జోనల్ నిబంధనలలో 33 శాతం అటవీ ప్రాంతాలను పొందుపరచాలి.
రిజర్వ్ ఫారెస్టులు, జాతీయ ఉద్యానవనాలు, పర్యావరణపరంగా సున్నితమైన ప్రాంతాలను, సున్నితమైన వన్యప్రాణులను, వృక్షసంపదను పరిరక్షించే నిబంధనలను సమీక్షించి, రక్షించడం ప్రధాన లక్ష్యంగా తెలంగాణ అటవీ శాఖ పనిచేయాలి. ప్రణాళికాబద్ధమైన కార్యక్రమాల ద్వారా వన మహోత్సవ్ ప్రణాళికను వచ్చే జూన్‌లోగా సిద్ధం చేయాలి. అడవులు, వన్యప్రాణులు, జీవవైవిధ్యం మనుగడ సాగించేలా చట్టాలను అమలు చేయడం వంటి చర్యలు చేపట్టాలి.
ముక్కలైన మృగవణి జాతీయ ఉద్యానవనం
మృగవణి జాతీయ ఉద్యానవనం భూభాగంలో మధ్యలోనించి 2006లో ORR నిర్మించారు. అధికారిక ఆమోదానికి ముందు, తరువాత, అటవీ శాఖ.. పర్యవేక్షణ లేదా భద్రత లేకుండా పార్కు సరిహద్దులను ఆమోదించింది. రెండు భాగాలుగా మిగిలిన ఈ పార్కు అటవీ భూమిని, కొంత కోల్పోయినప్పటికీ, మిగిలిన దాని విషయంలో కూడా 18 సంవత్సరాలుగా నిర్దిష్ట పరిరక్షణ చర్య తీసుకోలేదు. ఉన్నతాధికారుల దృష్టికి వచ్చినా భూభాగ పరిరక్షణ చర్యలు శూన్యం.
ORR వల్ల రెండు ముక్కలైన మృగవణి జాతీయ ఉద్యానవనం భూమి మళ్లింపు కొన్ని నిబంధనలు, షరతులతో జరిగినది. అందులో ముఖ్యమైనది రెండు ముక్కల మధ్య వన్యప్రాణుల సంచారం కోసం అండర్‌పాస్‌ల నిర్మాణం ఉంది. నిర్మించిన ఈ అండర్‌పాస్‌లను సరిగా నిర్వహించడం లేదు. ఇటీవల అనుమతి లేకుండా మృగవణి లోపటి నుంచి 1 KV లైన్ వేశారు. దాని పట్ల కూడా అటవీ శాఖ తన విధి నిర్వహించలేదు. ఈ నిర్లక్ష్యాన్ని నిర్ధారిస్తూ కోర్టు సదరు విద్యుత్ సంస్థ మీద రూ.50 లక్షల జరిమానా విధించింది.
డా. దొంతి నరసింహారెడ్డి, పాలసీ ఎనలిస్ట్