వేటకుక్కలకు జింకలు బలి.. నేషనల్ పార్క్ లో పది రోజుల్లో పది జింకలు మృత్యువాత..

వేటకుక్కలకు జింకలు బలి.. నేషనల్ పార్క్ లో పది రోజుల్లో పది జింకలు మృత్యువాత..
  • మహావీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్క్​లో ఘటన

ఎల్బీనగర్, వెలుగు: నేషనల్​ పార్కులో జింకలకు రక్షణ లేకుండా పోతోంది. కుక్కల దాడిలో వరుసగా జింకలు మృత్యువాత పడుతున్నాయి. మహావీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్క్ లో శనివారం ఓ జింక మృతిచెందిన ఘటనతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. హరిణ వనస్థలి నేషనల్ పార్క్ మన్సూరాబాద్ గేట్ వైపు శనివారం మార్నింగ్​ వాక్​ చేస్తున్న వారికి ఓ జింక గాయాలపాలై చనిపోయి కనిపించింది. వారు సమాచారం ఇవ్వడంతో అధికారులు అక్కడికి చేరుకుని జింక కళేబరాన్ని పార్కులోనే పూడ్చిపెట్టారు. 

అయితే పది రోజులుగా సుమారు 8 నుంచి 10 జింకలు కుక్కల దాడిలో చనిపోయినట్లు తెలుస్తోంది. పార్కులోకి ప్రవేశించిన కుక్కలు అక్కడే తిరుగుతూ జింకలను వేటాడి చంపేస్తున్నట్లు సమాచారం. విషయాన్ని అధికారులు బయటకు పొక్కకుండా జాగ్రతలు తీసుకుంటున్నారు. 

ఆటో నగర్ డంపింగ్ యార్డ్ వైపు ఉండే వేటకుక్కలు పార్కులోకి ప్రవేశించి ఉంటాయని స్థానికులు చెబుతున్నారు. అక్కడ కాంపౌండ్ వాల్ సరిగ్గా నిర్మించాలని అధికారులను గతంలో  కోరినా పట్టించుకోలేదని అంటున్నారు. ఇప్పటికైనా పార్కు అధికారులు సరైన చర్యలు తీసుకుని వన్యప్రాణులను రక్షించాలని కోరుతున్నారు.