ఆదివాసులకు అడవే ఆహార భద్రత

ఆదివాసులకు అడవే ఆహార భద్రత

అమ్మ ఉన్న చోట ఆకలి ఉండదనేది ఎంత నిజమో! అడవి తల్లి ఉన్నచోట ఆకలి ఉండదనేది కూడా అంతే నిజం. కరువు కాటేసినా అడవి తల్లి చేరదీస్తుంది. తిండి ఇచ్చి ఆదుకుంటుంది. సాగు చేయకుండానే పంటనిస్తుంది. అందుకే దండకారణ్యంలో ఉంటున్న అడవి బిడ్డలకు తిండి ఎప్పుడూ దొరుకుతుంది. 

ఆదివాసులకు అడవే ఆహార భద్రత ఇస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, చత్తీస్​గఢ్​, ఒడిశా రాష్ట్రాల సరిహద్దుల్లోని దండకారణ్యంలో ఎంతోమంది ఆదివాసులు బతుకుతున్నారు. వాళ్లందరికీ అడవే ఆధారం. సాగు చేయకుండానే అనేక రకాల ఆకుకూరలు, దుంపలు పండుతాయి. అడవిలో ఎటు వెళ్లినా ఒక పండో, దుంపో దొరుకుతుంది.  

సంతల్లో 21 రకాల ఆకుకూరలు, పండ్లు, కాయలు, దుంపలు, చిన్న చేపలు, చిన్న రొయ్యలు, కొక్కులు అమ్ముతుంటారు ఆదివాసులు. నాలుగు రాష్ట్రాల సరిహద్దుల్లోని కుంట(ఛత్తీస్​గఢ్​), చింతూరు(ఆంధ్ర ప్రదేశ్​), చర్ల(తెలంగాణ), మోటు(ఒడిశా) సంతలకు కాలాల వారీగా దొరికే కాయలు, ఆకుకూరలు తెస్తారు. వాటిని అమ్మితే వచ్చిన డబ్బుతో వాళ్లకు కావాల్సినవి కొనుక్కుంటారు. 

ప్రకృతిని ప్రేమించాలి

దండకారణ్యంలో సాగు చేయకుండా దొరుకుతున్న వాటిపై జన వికాస్​ సొసైటీ స్టడీ చేసింది. ఆ రిపోర్టు ప్రకారం... కొన్నేండ్ల నుంచి అడవులు నాశనం అవుతున్నాయి. ముందు ముందు తిండి కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. పరిశ్రమలు, ఆర్గనైజేషన్, డిస్​ప్లేస్​మెంట్​, క్లైమేట్​ ఛేంజ్, అభివృద్ధి పేరిట ఆదివాసులను అడవులకు దూరం చేస్తే.. వాళ్ల మనుగడకే ముప్పు వచ్చే ప్రమాదం ఉంది. ప్రకృతిని ప్రేమించడం, పూజించడం ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. వ్యవసాయంలో సింథటిక్​ రసాయనాల వాడకం వల్ల తేనెటీగల క్షీణత పెరిగింది. ఇలాగే మరి కొన్నేండ్లు కొనసాగితే ఎక్కడా తిండి దొరకదు. 

ఇవి దొరుకుతున్నయ్​

మిర్చిలో బొబాయి, బోరాయి, చిన్ని కోర్​ మిడియా, పెద్దకోర్​ మిడియా, నల్ల మిర్చి రకాలు దొరుకుతాయి. వీటితోపాటు తపిడి చిక్కుడు, పెర్మ, తెల్ల చిక్కుడు, కిసీర్​ జాట, బామ్ జాట, కిసీర్​ జాట–2, లుగ్గి జాటా, తెల్ల వంకాయ, పెద్ద రాముల్క, చిన్న రాముల్క, బుడమ కాయలు, వెదురు కొమ్ములు, పుట్టకొక్కులు, తమిర్​మీట, నారదుంప, అడవి ఎలేరి దుంప, నాగేల్​మాటి దుంప, నోస్కా మాటి దుంప, అడ్డపిక్కలు, ఆకు కూరల్లో తొండుకుసీర్​, ఇత్తోడ్​ కుసీర్​, కుక్కాళ్​ కుసీర్​, దోబ కుసీర్, పండ్లలో తోలె, పరిగి, ఎర్క, వెలగ, పుసుగు.. సీజన్​ బట్టి దొరుకుతాయి.

::: మొబగాపు ఆనంద్​ కుమార్  భద్రాచలం, వెలుగు